ఓ..మై ఫ్రెండ్

తడికన్నులనే తుడిచే నేస్తమా..

ఐఫోన్‌లో వెర్షన్లు మారిపోతున్నాయి...వాట్సాప్‌లో అప్‌డేట్స్‌ వచ్చి చేరుతున్నాయి..ఫేస్‌బుక్‌ ఫేడవుట్‌ అవుతోంది.. ఇన్‌స్టాగ్రామ్‌ దూసుకెళ్తోంది... నిన్నటి రోజు నేడు కనుమరుగువుతోంది. ఎన్ని ట్రెండ్‌లు మారినా.. మారనిది ఫ్రెండు ఒక్కడే! రేపే స్నేహితుల దినోత్సవం. కాలాలెన్ని మారినా.. కలకాలం నిలిచి ఉండే ఆ అనుబంధాన్ని మననం చేసుకోవడం యువతకి ముఖ్యం.

స్నేహమంటే ఇద్దరు మనుషులు.. రెండు మనసుల మధ్య అనుబంధాల వారధి. సరైన ఫ్రెండ్‌ ఉంటే.. సంతోషాలకు చిరునామా దొరికినట్టే. కాలేజీ క్లాసులో పక్క బెంచీ అమ్మాయి.. ఆఫీసులో సహోద్యోగితో అల్లుకున్న బంధం.. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు కలబోసుకున్న వైనం.. స్నేహం ఎక్కడైనా మొగ్గ తొడగొచ్చు. అది పూవై విచ్చుకొని సౌరభాలు వెదజల్లితే జీవితాంతం భరోసానిచ్చే నేస్తం దొరికినట్టే. ఈ ప్రియనేస్తాలే సమస్యల చిక్కుముళ్లు విప్పుతారు. కంటికి రెప్పలా కాపాడుకుంటారు. సరదాలను చేరువ చేస్తూ.. బాధల్ని దూరం తరిమేస్తూ జీవితానికో పరమార్థం కల్పిస్తారు. ఈ దోస్త్‌ల ముందు ఎన్ని ఆస్తులున్నా పనికిరావు. అవసరాల కోసం మొదలయ్యే రీజన్‌ స్నేహాలు.. కొద్దికాలమే నిలిచే సీజన్‌ ఫ్రెండ్షిప్‌లు వస్తుంటాయి. పోతుంటాయి. జీవితాంతం అంటిపెట్టుకొని ఉండే జిగిరీలు మాత్రం నీడలా మన వెంటే ఉంటారు.

ఎలా ఉండాలి?
సెల్ఫీ తీసుకొని స్టేటస్‌లో పెట్టుకొన్నంత మాత్రాన అది గొప్ప దోస్తీ అయిపోదు. స్నేహమంటే మందుపార్టీలతో విందులు చేసుకోవడం.. సినిమాలకెళ్లి చిందులేయడమే కాదు. తను ఏడిస్తే మన కళ్లు తడవాలి. ఫ్రెండ్‌ గెలిస్తే మనం గెంతాలి. తను బాధల్లో ఉంటే మనకి పరిష్కారం తట్టాలి. వజ్రాల్లాంటి ఇలాంటి బెస్ట్‌ఫ్రెండ్స్‌ అరుదుగా దొరుకుతారు. ఫేస్‌బుక్‌ స్నేహితుల జాబితాలా సంఖ్య వందలు, వేలల్లో లేకపోయినా ఫర్వాలేదు.. మన తడి కన్నులను తుడిచే నేస్తాలు నలుగురైదుగురున్నా చాలు. అభిమానం ఇచ్చిపుచ్చుకోవడం, అభిప్రాయాలు పంచుకోవడమే కాదు.. వీళ్లు ట్విటర్‌లో డీఎంలా మన వ్యక్తిగత విషయాల్లో గోప్యతలు పాటిస్తారు. సంతోషాలను జీవితంలోకి అప్‌లోడ్‌ చేస్తారు. ఒత్తిళ్లు, కష్టాలను అన్‌లోడ్‌ చేస్తారు. మానసిక రుగ్మతలను అన్‌ఫ్రెండ్‌ చేస్తారు. బాధలను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టేస్తారు. వీరి అండతో సంతోషాలకు కలకాలం లాగిన్‌ కావొచ్చు. మొత్తానికి ఈ నేస్తాలతో జిందగీ మొత్తం ఖుషీ అవుతుంది.

బంధం బలపడాలంటే...
స్నేహం చేయడం తేలిక.. ఫ్రెండ్‌ని కడదాకా నిలబెట్టుకోవడమే కష్టం. మరి ఈ బంధం పదిలంగా ఉండాలంటే ఏం చేయాలి?
* ఆత్మీయ స్పర్శలు, భుజం భుజం కలిపి నడవడాలు.. ఇలాంటివి స్నేహాన్ని మరింత దగ్గర చేస్తాయి. వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ.. అప్పుడప్పుడు ఓ సరదా పార్టీ.. క్రమం తప్పకుండా ఉండాలి.
* సెల్ఫీ దిగి స్టేటస్‌ పెట్టుకోవడాలు.. స్నేహాన్ని సేఫ్‌గా లాకర్‌లో పెట్టి బందీ చేస్తామంటే కుదరదు. దాన్ని వ్యక్త పరుస్తుండాలి. ఒకరిపై ఒకరికి ఉన్న అభిమానాన్ని చిన్నచిన్న బహుమతుల రూపంలో ఇచ్చిపుచ్చుకోవాలి. ప్రత్యేక దినాల్లో శుభాకాంక్షలు పంపుకోవాలి.
ఒకే కంచంలో తినేంత దగ్గరితనం ఉన్నా ప్రతి ఒక్కరికీ ఓ వ్యక్తిగతమైన పరిధి ఉంటుంది. తను నాకు క్లోజ్‌ అంటూ ఆ పరిధులు దాటి వెళ్లొద్దు. పెత్తనం అతిగా చూపొద్దు. అడక్కముందే అతిగా సలహాలివ్వడమూ అంత
మంచిదేం కాదు.

* మనల్ని నమ్మితే ప్రాణాలిచ్చే స్నేహితులు దొరుకుతారు. నీడలా వెన్నంటే ఉంటారు. రహస్యాలూ పంచుకుంటారు. కానీ ఇవన్నీ జరగాలంటే ముందు నమ్మకం ముఖ్యం. స్నేహ బంధానికి ఇది మరీ ముఖ్యం. తనతో ఏమైనా పంచుకోవచ్చు అని ఫ్రెండ్‌తో భరోసా కల్పించగలగాలి.
* ప్రతి ఒక్కరిలో లోపాలుంటాయి. మంచీచెడులుంటాయి. ఫ్రెండ్‌లో కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు. ఆ లోపాలు వదిలి మనవాళ్లలో సానుకూలతలు చూడగలిగినప్పుడే అనుబంధాలు దృఢమవుతాయి.
* అభిమానం, ఇష్టం, స్నేహం.. ఒక్కొక్కరు ఒక్కోలా వ్యక్తం చేస్తుంటారు. మనలాగే వాళ్లూ ఉండాలనుకోవద్దు. మనకే అత్యధిక సమయం కేటాయించాలనుకోవద్దు. ఇలాంటి అంచనాలు, ఆశించడాలు వదిలితేనే ముందుకెళతాం.


గుప్పెడు చాలు

బంధం, అనుబంధాల్లో ప్రత్యేకమైంది స్నేహం. ఎక్కడో ఒకచోట ఇరువురి మధ్య ఏర్పడే పరిచయమనే బీజం మొలకెత్తి, మొగ్గ తొడిగి, పూలు పూసి స్నేహంగా వికసిస్తుంది. బండెడు బంధువులకన్నా.. మనసెరిగే గుప్పెడు స్నేహితులు ఉన్న వ్యక్తి నిజంగా భాగ్యశాలి. కన్నవాళ్లు, బంధువులతో చెప్పుకోలేని విషయాలు స్నేహితులతో పంచుకునేంత చొరవ ఉంటుంది. స్నేహంలో సాన్నిహిత్యమే కాదు.. గౌరవం, చొరవ, నమ్మకమూ.. ఉండాలి. వీటితోపాటు ఒకరికొకరు ఎమోషనల్‌ సపోర్ట్‌ చూపించినప్పుడే ఆ స్నేహం కలకాలం ఉంటుంది.

- డా.వనిత, రచయిత్రి


భరోసా కల్పించేవాడే

నా దృష్టిలో స్నేహితుడంటే మన రహస్యాలు తెలిసినవాడు, పండగలకి శుభాకాంక్షలు తెలిపేవాడే కాదు.. అడగకపోయినా మన కష్టాలు తెలుసుకొని సాయం చేసేవాడు. మంచి చేస్తే మెచ్చుకొని, చెడు చేస్తే చెంప పగలగొట్టేవాడు. మనం వర్షంలో తడుస్తుంటే వర్షాన్ని ఆపలేకపోవచ్చు.. తడవకుండా గొడుగు పడతాడు. చీకట్లో భయపడుతుంటే సూర్యుడిని రప్పించలేకపోవచ్చు.. ఓ కాంతి కిరణాన్ని తెచ్చి దారి చూపేవాడు. మొత్తానికి ‘నాకేం భయం లేదు.. నా ఫ్రెండ్‌ ఉన్నాడు’ అని భరోసా కల్పించగలిగినవాడు. నా అదృష్టంకొద్దీ ఇలాంటి స్నేహితులు చాలామందే ఉన్నారు.                  

- భవ్య


ఏమీ ఆశించకుండా..

జీవితంలో కొన్ని విషయాలు స్నేహితులతో మాత్రమే పంచుకోగలుగుతాం. చిన్నచిన్న కారణాలతో ఆత్మహత్య చేసుకునేవాళ్లను చూస్తుంటే ఫ్రెండ్స్‌ లేకే వాళ్లలా చేసుకున్నారేమో అనే బాధ కలుగుతుంది. సమయానికి ఆ కష్టం పంచుకోగలిగే, సమస్య నుంచి బయట పడేసే స్నేహితులే ఉంటే.. ఎన్నో ప్రాణాలు దక్కేవి. బడి, కాలేజీ రోజుల నుంచీ మాకో గ్యాంగ్‌ ఉండేది. ఆ రోజులు మరపురానివి. ఉద్యోగాల్లో స్థిరపడ్డా.. ఇప్పటికీ మేమంతా టచ్‌లోనే ఉన్నాం. మనస్ఫూర్తిగా చేతనైన సాయం చేయడమే తప్ప వారి నుంచి ఏమీ ఆశించకుండా ఉంటేనే బంధం కలకాలం ఉంటుంది.              

- సుమంత్‌ రాజం, యూఐ డిజైనర్‌


మరిన్ని

ap-districts
ts-districts