పగుళ్లు గుర్తిస్తే.. పదికాలాలు మన్నిక!

వరద నీటి నిల్వలతో ఉపరితల పగుళ్లు వచ్చే వీలు
‘ఈనాడు’తో జేఎన్‌టీయూ సివిల్‌ ఇంజినీరింగ్‌ ఆచార్యుడు కేఎం లక్ష్మణరావు

ఈనాడు, హైదరాబాద్‌: వర్షాకాలం.. వానలు ముంచెత్తి కాలనీలు జలదిగ్బంధనంలో చిక్కుకుంటున్నాయి. రోజుల తరబడి వీధుల్లో.. ఇళ్ల మధ్య నీరు నిలిచి ఎటూ కదలడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి భవనాల పటిష్టత దెబ్బతినే అవకాశం ఉంది. నీటి నిల్వతో భూమి గుల్లబారి పునాదులపై ప్రభావం పడే వీలుంది. తద్వారా భవనాల మన్నిక తగ్గి కుంగిపోయే ఆస్కారం లేకపోలేదు. మరి ఈ పరిస్థితుల్లో భవనాల పటిష్టతను మెరుగుపరుచుకోవడం ఎలా? వర్షపునీరు ఎక్కువ రోజులపాటు కాలనీలు, ఇళ్ల చుట్టూ నిల్వ ఉంటే ఆయా నిర్మాణాలపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? తదితర అంశాలపై జేఎన్‌టీయూ-హెచ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ ఆచార్యుడు ప్రొ.కె.ఎం.లక్ష్మణరావు వివరించారు.

* సాధారణంగా ఏదైనా భవనం లేదా ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు పునాది లోతు, నేల సామర్థ్యం లెక్కించాలి. నేల సామర్థ్యం రెండు రకాలుగా అంచనా వేయవచ్చు. ఒకటి సాధారణ పరిస్థితుల్లో ఏ విధంగా ఉంది? నీరు చేరితే ఏ విధంగా మారుతుందో గుర్తించాలి. అలా చేసిన తర్వాత పునాది దశ దాటుకుని నిర్మాణ శైలిపై దృష్టి పెట్టవచ్చు. నగరంలో భవనాలు ఎక్కువగా మేస్త్రీల ఆధ్వర్యంలో ప్రణాళికలు వేసుకుని కట్టినవే ఎక్కువగా ఉంటున్నాయి. ఇళ్లు లేదా అపార్టుమెంట్లు కొనేప్పుడు ఇంజినీరింగ్‌, ప్లానింగ్‌, నాణ్యత ప్రమాణాలను కొనుగోలుదారులకు నిర్మాణదారులు ఇవ్వడం లేదు. వారూ అడగడం లేదు. ఆయా వివరాలు లేకపోతే భవిష్యత్తులో భవనానికి పగుళ్లు వచ్చినా.. పాడైనా ఇబ్బందులు తప్పవు.

వరదలతో: నగరంలో వరదల కారణంగా భవనాల్లో ఉపరితల పగుళ్లు, నిర్మాణపర పగుళ్లు.. అని రెండు రకాలుగా వస్తాయి. బయటి నుంచి వచ్చే ఒత్తిళ్లు, వరద ఉద్ధృతితో నిర్మాణ పగుళ్లకు అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు పునాదుల దశలో ప్రవాహం ఎక్కువ ఉంటే నిర్మాణంపై ప్రభావం పడి పగుళ్లు రావచ్చు. వీటిని గుర్తించి ముందుగా క్రాక్‌ మ్యాపింగ్‌ చేసుకోవాలి. స్తంభాల వరుసల్లో తేడాలు ఏమైనా ఉన్నాయో.. లేదో తనిఖీ చేయాలి. బోర్‌లాగ్‌ డాటా ఆధారంగా బేరింగ్‌ సామర్థ్యం విశ్లేషించవచ్చు. ఇమేజ్‌ స్కానర్లు, ఎన్‌డీటీ (నాన్‌ డిస్ట్రక్టివ్‌ టెస్టింగ్‌) పరికరాలతో ఉపరితల ,  నిర్మాణపర పగుళ్లను తెలుసుకునే వెసులుబాటు ఉంది. భవనాల పరిస్థితి సరిగా లేకపోతే రెట్రోఫిట్‌, రీ స్ట్రక్చరింగ్‌ చేసుకోవాలి.

చిన్న భవనాలపైనే ప్రభావం ఎక్కువ: ప్రస్తుతం వంద, 80 గజాల్లో నిర్మిస్తున్నారు. సాధారణ భవనం పక్కనే భారీ భవంతులు కట్టినప్పుడు లేదా వానలు పడినప్పుడు ఆయా భవనాలపై ప్రభావం పడుతుంది. అందుకే రెండు నిర్మాణాల మధ్య కనీస ఎడం పాటించడం శ్రేయస్కరం. నిర్మాణం జరిగిన తర్వాత పక్కనున్న భవనం ఏమైనా కుంగిందా.. అన్నది తనిఖీ చేసుకోవాలి. సాధారణంగా పునాదులు భవనాల ఎత్తులో  1/3 లేదా 1/4వంతు లోతులో నిర్మిస్తారు. నీటి నిల్వ కారణంగా ఎక్కువగా చిన్న భవనాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఉపరితల పగుళ్లు వస్తుంటాయి.


నీరు వెళ్లేలా ఏర్పాట్లుండాలి..

శ్లాబ్‌ లేదా భవనం గోడలపై పడిన నీరు వెంటనే వెళ్లిపోయేలా చూసుకోవాలి. ప్రత్యేక గొట్టాలు లేదా ప్రవాహంతో ఇంకుడు గుంతల్లోకి చేరేలా చూడాలి. వెంటిలేటర్లు, శ్లాబ్‌లపై  నిల్వ ఉండకుండా ప్రత్యేక ఏర్పాట్లుండాలి. దీనివల్ల గోడల్లోనికి నీరు చేరకుండా ఉంటుంది. మరుగుదొడ్లలో టైల్స్‌ మధ్య ఖాళీలు రాకుండా తనిఖీ చేసుకుంటుండాలి. ఎక్కడైతే అతుకులు, పగుళ్లు ఉంటాయో.. అక్కడే నీరు చేరే అవకాశముంది. అలాగే పునాదులపై పక్కాగా అవగాహన ఉండాలి. నీరు చేరినప్పుడు భూమి పొరలు లేదా రాళ్లలో కొంత మేర మార్పులు వచ్చి పునాదులపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున.. ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇమేజ్‌ స్కానర్లతో వాటి పరిస్థితిని తెలుసుకోవచ్చు. సహజంగా ఉపరితలంపై ఉండే నీటి కారణంగా భవనం పాడయ్యే అవకాశం తక్కువ. నగరంలో ఎర్రగడ్డ, చుట్టుపక్కల ప్రాంతాల్లో స్వల్ప స్థాయిలో భూమి కంపించడం చూస్తున్నాం.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని