కోడింగ్‌లో దిట్ట!

హాయ్‌ ఫ్రెండ్స్‌.. ‘మన చేతికి ఫోన్‌ వస్తే.. ఏం చేస్తాం?’ - ఇంకేం చేస్తాం.. గేమ్స్‌ ఆడతాం.. యూట్యూబ్‌ చూస్తాం.. అంతే కదా! మధ్యమధ్యలో ఎప్పుడైనా ఫోన్‌ మొరాయిస్తే.. సింపుల్‌గా రీస్టార్ట్‌ చేసేస్తాం. అందుకు కారణమేంటో ఆలోచించకుండా.. మళ్లీ మన పనిలో మునిగిపోతాం. కానీ, ఓ నేస్తం మాత్రం.. ‘అసలు ఫోన్‌ మధ్యలో ఎందుకు ఆగిపోయింది?’ అని ఆలోచనలో మునిగాడు. ఆ ప్రయత్నంలోనే మూడు ఆప్స్‌ కనిపెట్టాడు.. గిన్నిస్‌ రికార్డూ సాధించాడు. ఆ వివరాలే ఇవీ..

రియాణాకు చెందిన కార్తికేయకు 12 సంవత్సరాలు. జవహర్‌ నవోదయ విద్యాలయంలో ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న ఈ నేస్తం.. మూడు ఆప్స్‌ రూపొందించి ఔరా అనిపిస్తున్నాడు. అంతేకాదు.. అతి చిన్న వయస్కుడైన ఆప్‌ డెవలపర్‌గా ‘గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లోనూ స్థానం సంపాదించాడు.

ఆన్‌లైన్‌ క్లాసుల కోసం..

లాక్‌డౌన్‌ సమయంలో ఆన్‌లైన్‌ క్లాసులు వినేందుకు.. కార్తికేయ కోసం వాళ్ల నాన్న రూ.10 వేలు పెట్టి స్మార్ట్‌ఫోన్‌ తీసుకొచ్చారు. కొద్దిరోజుల్లోనే ఆ ఫోన్‌ క్లాసుల మధ్యలో ఆగిపోసాగింది. అసలు సమస్య ఏంటో తెలుసుకుందామని, యూట్యూబ్‌లో తెగ వెతికాడు. అక్కడే దానికి పరిష్కారాన్నీ కనిపెట్టాడు. ఆ ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్‌లో కొన్ని లోపాలున్నట్లు గుర్తించి, సొంతంగా వాటిని సరిదిద్దాడు. అలా అనుకోకుండా ఈ బాలుడికి కోడింగ్‌పైన ఆసక్తి ఏర్పడింది. ప్రతిరోజూ కొద్దికొద్దిగా నేర్చుకుంటూ.. ఈ వయసులోనే మూడు ఆప్‌లను రూపొందించాడు. ఒకటేమో జనరల్‌ నాలెడ్జికి, మరొకటి కోడింగ్‌తోపాటు గ్రాఫిక్స్‌కు, ఇంకోటి డిజిటల్‌ ఎడ్యుకేషన్‌కు సంబంధించినది. అంతేకాదు.. ప్రస్తుతం ఈ మూడు ఆప్స్‌ ద్వారా దాదాపు 45,000 మందికి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడట. సాధారణంగా మనమైతే ఫోన్‌ స్క్రీన్‌ పగిలిపోతే, వెంటనే కొత్తది మార్పిస్తాం. కానీ, ఈ నేస్తం మాత్రం స్క్రీన్‌ చాలావరకూ పగిలిపోయినా.. అలాగే తన చదువును కొనసాగించాడని వాళ్ల నాన్న గొప్పగా చెబుతున్నారు.  

హార్వర్డ్‌ స్కాలర్‌షిప్‌

సాంకేతిక అంశాలతోపాటు చదువులోనూ కార్తికేయ ముందే ఉంటున్నాడు. అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షలో అద్భుత ప్రతిభ చూపి, స్కాలర్‌షిప్‌ సాధించాడు. ప్రస్తుతం కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో బీఎస్సీ చదువుతున్నాడు. హార్వర్డ్‌లో ప్రవేశం అంటే మాటలు కాదు కదా.. అందుకే, ఈ బాలుడి మేధస్సు గురించి తెలుసుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, ప్రత్యేకంగా పిలిపించుకొని మరీ అభినందించారట. తనకు ప్రధాని మోదీ అంటే చాలా ఇష్టమని, ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని చెబుతున్నాడీ నేస్తం.. భవిష్యత్తులో భారత దేశానికి సేవ చేయడమే తన లక్ష్యమట.


మరిన్ని

ap-districts
ts-districts