Monkeypox: మంకీపాక్సా? ఆటలమ్మా?

ఇదిగో దద్దు అంటే అదిగో మంకీపాక్స్‌ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. చర్మం మీద చిన్న పొక్కు మొలిచినా మంకీపాక్సేమో అనే భయపడాల్సి వస్తోంది. నిజానికి దద్దు, పొక్కులు దీనికి మాత్రమే పరిమితం కావు. తరచూ కనిపించే చిన్నమ్మవారు/ఆటలమ్మ (చికెన్‌పాక్స్‌) ఇన్‌ఫెక్షన్‌లోనూ రావొచ్చు. మంకీపాక్స్‌తో పోలిస్తే ఇది తేలికైన సమస్య. త్వరగా తగ్గిపోయే సమస్య. కాబట్టి వీటి మధ్య తేడా తెలుసుకొని ఉండటం మంచిది. దీంతో అనవసర భయాందోళనలకు గురికాకుండా చూసుకోవచ్చు.

రెండున్నరేళ్లుగా కొవిడ్‌ బాధలను అనుభవిస్తున్న మనకు కొత్తగా ఏదైనా జబ్బు విజృంభిస్తోందంటే భయం కలగటంలో ఆశ్చర్యమేమీ లేదు. తొలిసారి, మలిసారి కొవిడ్‌ విజృంభించినప్పుడు ఇన్‌ఫెక్షన్‌ సోకినవారికి సన్నిహితంగా మెలిగినవారందరినీ గుర్తించటం, వారందరినీ విడిగా ఉంచటం, చుట్టుపక్కల నివసించేవారందరికీ మూకుమ్మడిగా పరీక్షలు చేయటం తెలిసిందే. చికిత్సలు తీసుకుంటున్నా ఆసుపత్రుల్లో, ఇళ్లలో కొవిడ్‌ ఎంతమందిని పొట్టన పెట్టుకుందో, ఎందరి జీవితాలను అస్తవ్యస్తం చేసిందో. తలచుకుంటేనే గుండె బరువెక్కిపోతుంది. ఈ నేపథ్యంలో మంకీపాక్స్‌ కూడా కొవిడ్‌ మాదిరిగానే విరుచుకు పడుతుందేమో, అంత తీవ్రంగా నష్టం కలిగిస్తుందేమోనని ఆందోళన పడటం సహజమే. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్‌ విస్తరిస్తున్న తరుణంలో అలాంటి భయాందోళనలే అందరిలోనూ నెలకొన్నాయి. మశూచి (స్మాల్‌పాక్స్‌) మాదిరి పొక్కులతో వేధించే ఇది కొవిడ్‌ మాదిరిగానే ప్రపంచవ్యాప్తంగా కలవరం పుట్టిస్తోంది. కానీ కొవిడ్‌లా మంకీపాక్స్‌ మూకుమ్మడిగా సంక్రమించేది కాదు. కుందేళ్లు, ఎలుకలు, చింపాజీలు, గొరిల్లాల వంటి వాటి నుంచి సోకే ఇది ప్రస్తుతం మనుషుల్లోనూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. అయినా అంత భయపడాల్సిన పనిలేదు. ఒక ఉపద్రవంగా మారి, ప్రాణాంతకంగా మారే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే మనుషుల్లోనూ ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం 15 శాతమే. అంటే ఇన్‌ఫెక్షన్‌ గురైనవారికి సన్నిహితంగా మెలిగినా నూటికి 15 మందికి మాత్రమే రావొచ్చన్నమాట. కాబట్టి కొవిడ్‌ మాదిరి భయాందోళనలు వద్దు. దీనర్థం అసలే జాగ్రత్తలు తీసుకోవద్దని కాదు. అనవసరంగా భయపడొద్దనే. ఆందోళన పడకుండా జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. దద్దు, పొక్కుల వంటి లక్షణాల విషయంలో ఆటలమ్మకూ మంకీపాక్స్‌కూ గల తేడాలను గుర్తెరిగి ఉండటం మంచిది.

జ్వరంలోనూ తేడా
మంకీపాక్స్‌లో జ్వరం తీవ్రంగా ఉంటుంది. కానీ ఆటలమ్మలో అసలు జ్వరం ఉండదనే చెప్పుకోవచ్చు. ఉండీ లేనట్టుగా జ్వరం వస్తుంది. ఇతర లక్షణాలూ స్వల్పంగానే ఉంటాయి. పిల్లలు ముందు కాస్త నలతగా, స్తబ్ధుగా ఉంటారు. ఒకట్రెండు రోజుల్లో పొక్కులు కనిపిస్తాయి. త్వరగా తగ్గుతాయి కూడా.

భయమొద్దు
మంకీపాక్స్‌ చాలావరకు దానంతటదే తగ్గిపోతుంది. ఇప్పుడిది ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నప్పటికీ కొత్త జబ్బేమీ కాదు. మనకు దీని గురించి ఇంతకు ముందే తెలుసు. చికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. జ్వరం తగ్గటానికి పారాసిటమాల్‌ ఉపయోగపడుతుంది. పొక్కులు చీము పట్టే అవకాశముంది కాబట్టి యాంటీబయాటిక్స్‌ అవసరమవుతాయి. ఒంట్లో నీటిశాతం తగ్గకుండా తగినంత నీరు, ద్రవాహారం తీసుకోవాలి. మంచి పోషకాహారం తినాలి. కొందరికి రక్తనాళం ద్వారా సెలైన్‌ ఎక్కించాల్సి రావొచ్చు.
* మంకీపాక్స్‌కు సిడోఫోవిర్‌, టెకోవిరిమట్‌ యాంటీవైరల్‌ మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని 600 మి.గ్రా. మోతాదులో రోజుకు రెండు సార్ల చొప్పున రెండు వారాల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. బ్రిన్సిఫోఫోవిర్‌ మందునైతే 200 మి.గ్రా. మోతాదులో వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. వీటిల్లో మనదగ్గర సిడోఫోవిర్‌ మందు అందుబాటులో ఉంది.
* అత్యవసర పరిస్థితుల్లో ఇమ్యునోగ్లోబులిన్లు ఇవ్వాల్సి ఉంటుంది. మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడేవారికి, క్యాన్సర్‌ చికిత్స తీసుకునేవారికివి ఉపయోగపడతాయి.
* ఉపశమన చికిత్సలతోనే చాలామంది కోలుకుంటారు. భయమేమీ అవసరం లేదు. కేవలం 3-6 శాతం మందికే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.

ఆటలమ్మ చికిత్స
ఆటలమ్మ సోకిన పిల్లలను 15 రోజుల వరకు బడికి పంపకూడదు. ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి. చాలావరకు దానంతటదే తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి ఎసైక్లోవిర్‌, వాలాసైక్లోవిర్‌, ఫామ్‌సైక్లోవిర్‌ వంటి యాంటీవైరల్‌ మందులు ఇవ్వాల్సి ఉంటుంది.
* చికెన్‌పాక్స్‌కు టీకా అందుబాటులో ఉంది. కాకపోతే పిల్లలకు ఇచ్చే సార్వత్రిక టీకా కార్యక్రమంలో ఇది లేదు. విడిగానే పిల్లలకు ఇప్పించాల్సి ఉంటుంది.

జాగ్రత్త అవసరం
మంకీపాక్స్‌ అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పీసీఆర్‌ పరీక్ష చేయించుకోవాలి. బయట తిరగకూడదు. ఇంట్లో కుటుంబ సభ్యులంతా మాస్కు ధరించాలి. ఇన్‌ఫెక్షన్‌ గలవారు వాడే దుస్తులు, వస్తువుల వంటివి విడిగానే ఉంచాలి. మిగతావాటితో కలపకూడదు. వీరికి సపర్యలు చేసేవారు గ్లవుజులు, మాస్కు విధిగా ధరించాలి.
* మశూచి టీకా మంకీపాక్స్‌నూ ఎదుర్కొంటుంది. ఇప్పటికే కొన్నిదేశాల్లో దీన్ని ఇస్తున్నారు. ఈ టీకా తీసుకున్నవారికి మంకీపాక్స్‌ సోకితే అంత తీవ్రంగా మారదు. తేలికగా తగ్గిపోతుంది. ఇంట్లో ఎవరికైనా మంకీపాక్స్‌ సోకితే తొలి నాలుగు రోజుల్లో కుటుంబసభ్యులంతా టీకా తీసుకుంటే మంచి రక్షణ లభిస్తుంది. అయితే మనదగ్గర ఇది అందుబాటులో లేదు.


తేడాలు చాలానే

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన మశూచి(స్మాల్‌పాక్స్‌)కి మంకీపాక్స్‌కూ దగ్గరి సంబంధం ఉంది. రెండూ పాక్స్‌విరిడే కుటుంబంలోని ఆర్థోపాక్స్‌వైరస్‌ జాతికి చెందినవే. ఇప్పుడు మశూచి లేదు కాబట్టి మంకీపాక్స్‌ను దాంతో పోల్చి చూడాల్సిన అవసరం లేదు. కానీ ఆటలమ్మ, చిన్న అమ్మవారుగా పిలుచుకునే చికెన్‌పాక్స్‌ను తరచూ చూస్తుంటాం. దీనికి మూలం వారిసెల్లా జోస్టర్‌ వైరస్‌. ఇందులోనూ దద్దు, పొక్కులు తలెత్తుతాయి. వీటి విషయంలో రెండింటికీ చాలా తేడానే ఉంది.


మంకీపాక్స్‌లో..

* ఇన్‌ఫెక్షన్‌కు గురైన జంతువులకు గానీ మనుషులకు గానీ సన్నిహితంగా మెలిగినప్పుడే మంకీపాక్స్‌ సంక్రమిస్తుంది.
* ఉమ్మి, మూత్రం వంటి శరీర స్రావాలు చర్మానికి తగిలినప్పుడు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది ఒంట్లోకి ప్రవేశించటానికి తగిన పరిస్థితులూ కలిసి రావాలి. చర్మం ఎక్కడైనా గీసుకుపోయినా, గాయాలైనా, పుండ్లు పడినా.. అక్కడ ఇన్‌ఫెక్షన్‌కు గురైనవారి శరీర స్రావాలు అంటుకుంటేనే వైరస్‌ ప్రవేశిస్తుంది.
* ఇన్‌ఫెక్షన్‌ గలవారితో లైంగిక సంపర్కంలో పాల్గొన్నా సంక్రమించొచ్చు.
* మంకీపాక్స్‌ వైరస్‌ ఒంట్లోకి ప్రవేశించిన తర్వాత దద్దు రూపంలో బయటపడటానికి 7-17 రోజులు పడుతుంది.
* మనుషుల నుంచి మనుషులకు వ్యాపించే విషయంలో పెద్దవాళ్ల కన్నా పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా పదేళ్ల లోపు పిల్లలకు ముప్పు ఎక్కువ.
* మంకీపాక్స్‌లో దద్దు కన్నా ముందు జ్వరం వస్తుంది. ఆరంభంలో జ్వరంతో పాటు తీవ్రమైన అలసట, జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆకలి లేకపోవటం, గొంతులో గరగర, గొంతునొప్పి తలెత్తుతాయి. పైగా ఇవి తీవ్రంగానూ ఉంటాయి. జ్వరం తగ్గిన తర్వాతే దద్దు మొదలవుతుంది.
* దద్దు చాలావరకు ముఖం లేదా చేతుల మీద మొదలవుతుంది. ఆ తర్వాతే ఛాతీ, పొట్ట, వీపునకు పాకుతుంది. అరిచేతులు, అరికాళ్లకూ విస్తరించొచ్చు.
* ఒంటి మీద దద్దు చాలా నెమ్మదిగా విస్తరిస్తుంది. దీనికి 2-3 వారాలు పడుతుంది.
* దద్దు, పొక్కులు ఒకే విధంగా దీని ప్రత్యేకత (మోనోమార్ఫిక్‌). అంటే దద్దు దశలో దద్దు రూపంలోనే ఉంటుంది. పొక్కుల దశలో అన్నీ నీటిపొక్కులే ఉంటాయి. చీము దశలో అన్నింటికీ చీము పడుతుంది. ఇక మానిపోయే దశలో అన్నీ చెక్కు కట్టి ఉంటాయి.
* మంకీపాక్స్‌ పొక్కులు చర్మంలో చాలా లోతుగా ఏర్పడతాయి. ఈ పొక్కుల్లో వేర్వేరు గదులుంటాయి. వీటి చుట్టుపక్కల వాపేమీ ఉండదు.
* పొక్కులు నెమ్మదిగా వస్తాయి కాబట్టి మానటానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఇవి చెక్కు కట్టి, పొట్టుగా మారటానికి 10-14 రోజులు పడుతుంది.
* మంకీపాక్స్‌లో దురద చాలా తక్కువగా ఉంటుంది.
* 4-6 రోజుల తర్వాత కొత్తగా పొక్కులేవీ రావు.
* లింఫ్‌గ్రంథులు పెద్దగా అవటం మరో ప్రత్యేక లక్షణం. ఆటలమ్మకు మంకీపాక్స్‌కు ప్రధానమైన తేడా ఇదే.  దద్దు రావటానికి ఒకట్రెండు రోజుల ముందు మెడ, చంకలు, గజ్జల వద్ద బిళ్లలు కడతాయి. ఇవి బాగా నొప్పి పెడతాయి.
* పొక్కులు మానిన తర్వాత మచ్చలు పడతాయి.
* పొక్కులు మాని, పొట్టుగా ఏర్పడిన తర్వాత వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించటమనేది ఉండదు.


ఆటలమ్మలో..

* చాలావరకు పిల్లలకే వస్తుంది. అలాగని పెద్దవాళ్లకు రాకూడదనేమీ లేదు. పిల్లలకైతే తేలికగా తగ్గుతుంది. పెద్దవారిలోనైతే న్యుమోనియా, మెదడు వాపు, మెదడు పొరల వాపు, కాలేయ వాపు వంటి తీవ్ర సమస్యలకు దారితీయొచ్చు.
* ఆటలమ్మ ఎప్పుడుపడితే అప్పుడు రాదు. సంవత్సరంలో కొన్ని రోజుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది.
* ఇన్‌ఫెక్షన్‌ గలవారు మాట్లాడుతున్నప్పుడు, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లను వేరొకరు పీల్చినప్పుడు సంక్రమిస్తుంది.
* ఆటలమ్మ సోకిన తర్వాత 7-21 రోజుల్లో లక్షణాలు మొదలవుతాయి. ఇవి ఉండీ లేనట్టుగా, కొద్దిరోజులే  ఉంటాయి.
* జ్వరంతో పాటే నీటి పొక్కులు (దద్దు) వస్తాయి. ఇవి మాటిమాటికీ.. అంటే మొదటిరోజు రావొచ్చు. మళ్లీ నాలుగో రోజు రావొచ్చు. ఇలా తగ్గిపోయి, మళ్లీ మళ్లీ వస్తుంటాయి.
* ఛాతీ, పొట్ట, వీపులో దద్దు మొదలవుతుంది. తర్వాత మిగతా భాగాలకు పాకుతుంది. చేతులు, కాళ్ల మీద తక్కువగా ఉంటాయి.
* దద్దు చాలా వేగంగా.. 5-7 రోజుల్లోనే ఒంటి మీద విస్తరిస్తుంది. ఆ తర్వాత దద్దు రావటం ఆగిపోతుంది.
* ఆటలమ్మలో పొక్కులు కొన్ని కొత్తగా పుట్టుకొస్తుంటే, కొన్ని నీటి పొక్కులుగా ఏర్పడుతుంటాయి. అందువల్ల ఒకే సమయంలో దద్దు, పొక్కులు, పుండ్ల దశలన్నీ (ప్లీయోమార్ఫిక్‌) కనిపిస్తుంటాయి. అంటే కొన్ని దద్దు రూపంలో ఉండొచ్చు. వాటి పక్కనే నీటి పొక్కులు కనిపించొచ్చు. కొన్ని పుండ్లు పడొచ్చు. కొన్ని ఎండిపోవచ్చు.
* పొక్కులు చర్మంలో పైపైనే ఏర్పడతాయి. చిన్నగా ఉంటాయి. వీటిల్లో ఒకే గది ఉంటుంది. తేలికగా చితుకుతాయి. పొక్కుల చుట్టూ వాచినట్టు కనిపిస్తుంటుంది. ఎంత త్వరగా వస్తాయో అంతే త్వరగా (4-7 రోజుల్లో) ఎండిపోయి, రాలిపోతాయి.
* ఆటలమ్మ దద్దులో దురద ఎక్కువగా ఉంటుంది.
* ఇందులో లింఫ్‌ గ్రంథులు పెద్దగా అవవు.
* పొక్కులు మానిన తర్వాత మచ్చలు పడవు.


చేయి, పాదం, నోటి జబ్బు

ఇటీవల చేయి, పాదం, నోటి జబ్బు (హ్యాండ్‌ ఫుట్‌ అండ్‌ మౌత్‌ డిసీజ్‌- హెచ్‌ఎఫ్‌ఎండీ) కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ఇందులోనూ ఒంటి మీద పొక్కులు కనిపిస్తుండటం వల్ల మంకీపాక్స్‌గా పొరపడుతున్నారు. నిజానికిది మామూలు సమస్యే. పెద్దగా భయపడాల్సిన పనిలేదు. హెచ్‌ఎఫ్‌ఎండీ ఓ చర్మ సమస్య. దీనికి మూలం పోలియో రహిత ఎంటెరోవైరస్‌లు. సాధారణంగా కాక్స్‌సాకీవైరస్‌లతో వస్తుంటుంది. పదేళ్ల లోపు పిల్లల్లో ఎక్కువ. చాలావరకిది మల విసర్జన అనంతరం చేతులు సరిగా శుభ్రం చేసుకోకపోవటం.. లేదూ మలం ఉన్నచోట తాకిన చేతులను నోట్లో పెట్టుకోవటం ద్వారా వ్యాపిస్తుంది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లతోనూ సోకుతుంది గానీ తక్కువ. లాలాజలం వంటి శరీర స్రావాలతోనూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించొచ్చు.

లక్షణాలు ఇవీ

వైరస్‌ సోకిన 3-6 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. స్వల్పంగా జ్వరం వస్తుంది. అదీ ఒకట్రెండు రోజులే ఉంటుంది. నలత, కడుపునొప్పి.. కొద్దిగా ముక్కు కారటం, జలుబు, గొంతునొప్పి వంటివీ ఉండొచ్చు. నోట్లో పుండ్లు పడటం పెద్ద సమస్య. ఇవి చాలా నొప్పి పెడతాయి. దీంతో తిండి సరిగా తినకపోవచ్చు. చొంగ కారొచ్చు. మెడ వద్ద బిళ్లలు కట్టొచ్చు.
* హెచ్‌ఎఫ్‌ఎండీ బారినపడ్డ పిల్లల్లో సుమారు 60-70% మందిలో చర్మం మీద దద్దు వస్తుంటుంది. అరిచేతులు, అరిపాదాలు.. చేతులు, పాదాలు, పిరుదుల పక్కన పొక్కులు తలెత్తుతాయి. సాధారణంగా జననాంగాల వద్ద, ముఖం, కాళ్ల మీద పొక్కులు వస్తాయి. అరిచేతులు, అరిపాదాల మీద చిన్న బొబ్బల్లా కనిపిస్తుంటాయి. పొక్కుల చుట్టూ ఎర్రగా ఉంటుంది. వారం, పది రోజుల్లో ఇవి ఎండిపోయి, చెక్కు కడతాయి.

నిర్ధరణ
పొక్కుల తీరును చూడగానే సమస్య ఏంటన్నది తెలుస్తుంది. దీనికి పరీక్షలేవీ లేవు. ఉద్ధృతంగా వ్యాపిస్తున్నప్పుడు మలం, గొంతు స్రావాల నమూనాలతో కల్చర్‌ పరీక్షలు చేయాల్సి రావొచ్చు. వైరస్‌ను గుర్తించటానికి పీసీఆర్‌ పరీక్ష ఉపయోగపడుతుంది.

చికిత్స
వారం, పది రోజుల్లో దానంతటదే తగ్గిపోతుంది. జ్వరం ఉంటే పారాసిటమాల్‌, నోట్లో పుండ్లు తగ్గటానికి నోటి పూత మందులు ఉపయోగ పడతాయి. ఐస్‌క్రీములు, కూల్‌ డ్రింకులు, ఉప్పు, కారం పదార్థాలు తినకపోవటం మంచిది. సమస్య తీవ్రమైతే ఎసైక్లోవిర్‌ వంటి మందులు మేలు చేస్తాయి.


మరిన్ని

ap-districts
ts-districts