దైవాన్ని మోసగించలేం

యేసుప్రభువు ధర్మప్రచారం చేస్తున్న రోజుల్లో ‘నీతిమంతులుగా కనిపిస్తూ నిజాయితీ లేనివారు కపటులు పులిసినపిండితో సమానం. వారి తప్పుడు బోధలతో ప్రజలు దారితప్పే అవకాశం ఉంది. ఎందులోనూ ద్వైదీభావం తగదు. అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుండాలి. దైవజ్ఞానం పవిత్రమైంది. అక్కడ సమానత్వం, సత్ఫలితాలుంటాయి. పక్షపాతవైఖరి, పైపై డాంబికాలకు చోటుండదు. కానీ మనుషుల నడవడి స్వార్థంతో నిండి ఉంటుంది. దేవుని అనుగ్రహం కోరుకునేవారు కోపం, ద్వేషం, కపటం, అసూయలను వదిలి నిర్మల మనసుతో జీవించాలి. లోకంలో ఉన్న విషయాలపై వ్యామోహం పెంచుకుంటూ, ప్రార్థనలు చేయడాన్ని దేవుడు ఆమోదించడు. ఈ లోక ప్రలోభాలు దేవుడితో వైరమని తెలుసుకోవాలి. ఎవరినైనా మభ్యపెట్టగలం కానీ మన అంతరంగాన్నీ, దైవాన్నీ మోసగించలేం. అందుకే భక్తుడైన దావీదు ‘మా దోషాలన్నీ నీయెదుట ఉన్నాయి. నీ ముఖ కాంతిలో మేం చాటుగా చేసిన పాపాలు కనిపిస్తున్నాయి’ అన్నాడు. కనుక పరిశుద్ధ జీవితమే దేవునికి ప్రీతికరం’ అంటూ ప్రబోధించాడు.

- బందెల స్టెర్జి రాజన్‌


మరిన్ని