
బుజ్జి పట్టణం.. చూసొద్దాం రండి!
హాయ్ ఫ్రెండ్స్.. ప్రపంచంలోని వింతలూ, విశేషాల గురించి మీకు చాలానే తెలిసి ఉంటాయి. కానీ, ఎన్ని తెలుసుకున్నా.. తెలియనివి ఇంకా అనేకం ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం కూడా ఆ కోవకు చెందినదే. మరి.. ఆ వింత ఏంటో, దాని ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా..
క్రొయేషియాలోని ‘హమ్’ అనే ప్రాంతం ప్రపంచంలోనే అతి చిన్న పట్టణమట. ఈ విషయం నేను చెప్పడం లేదు నేస్తాలూ.. ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ ప్రతినిధులే చెబుతున్నారు.
రెండే వీధులు..
ఆ దేశ రాజధాని నగరానికి కూత వేటు దూరంలో ఉండే హమ్ పట్టణం మధ్యయుగానికి చెందినది. చుట్టూ కొండలు, మూడు వరసల్లో రాతి ఇళ్లు, రెండు వీధులు మాత్రమే ఉండే ఈ పట్టణ జనాభా కేవలం 27 మంది. 2011లో 21గా ఉన్న ఇక్కడి జనాభా గతేడాదికి 27కు పెరిగింది. చారిత్రక ఆధారాల ప్రకారం ఈ పట్టణం 1102వ సంవత్సరంలో వెలుగులోకి వచ్చిందట. అంటే.. అంతకు ముందే ఏర్పడిందన్నమాట. దీని గురించి బయటి ప్రపంచానికి తెలిసిన తర్వాత.. ఒక్కొక్కరుగా నివాసం ఏర్పరచుకోసాగారు. ఈ పట్టణం రక్షణకు స్థానికులే 1552లో ఓ పెద్ద గంటతోపాటు వాచ్ టవర్ను ఏర్పాటు చేశారు. బందిపోట్ల నుంచి ప్రమాదం లేకుండా పట్టణం చుట్టూ చాలా ఎత్తులో రాళ్లతో గోడనూ నిర్మించారు. ఎటుచూసినా పచ్చని పర్వతాలు, భారీ వృక్షాల మధ్య ఉండే ఇది.. కేవలం వంద మీటర్ల పొడవూ, 30 మీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. మొదట దీన్ని గ్రామంగా గుర్తించినా.. ఇంతకంటే చిన్నవి కూడా ఉండటంతో.. ‘హమ్’కు పట్టణ హోదా కల్పించారు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ పట్టణం ఇప్పటికీ చెప్పుకోదగినంతగా అభివృద్ధి చెందలేదట.
పర్యాటకుల వరస
ప్రపంచంలోనే అతి చిన్న పట్టణంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతానికి పర్యాటకులు వరస కడుతున్నారు. ఇక్కడ చూసేందుకు ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా.. మధ్యయుగం నాటి శిల్పకళా వైభవం, రాళ్లతో నిర్మించిన ఇళ్లు, వీధులను చూసేందుకే దేశవిదేశాల నుంచి వస్తుంటారట. వారికి స్థానికులే దగ్గరుండి మరీ స్వాగతం పలుకుతుంటారు. ఈ ఊరికి ఒక మూలన ఉన్న ఖాళీ ప్రాంతంలో ఓ బెంచీని ఏర్పాటు చేశారట. టూరిస్టులు దాని మీద కూర్చొని.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, ఫొటోలు దిగుతూ మురిసిపోతుంటారు. అధిక శాతం నగరాలు ఎప్పటికప్పుడు విస్తరిస్తూనే ఉంటాయి కదా.. కానీ, ఈ పట్టణం మాత్రం రాతి గోడ కట్టినప్పుడు ఎంత ఉందో.. ఎటువంటి ఆక్రమణలు, చొరబాట్లు లేకుండా ఇప్పటికీ అంతే విస్తీర్ణంలో ఉందట. ఇవండీ ఈ బుజ్జి పట్టణం విశేషాలు.. భలే ఉన్నాయి కదూ!
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rishi Sunak: రిషి సునాక్ 100 రోజుల ప్రతిన..
-
Crime News
Andhra News: వాగులో దూకి నిందితుడి పరారీ.. పోలీసులు గాలించినా లభించని ఆచూకీ
-
Movies News
K.Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
General News
Telangana News: కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం
-
World News
Saudi Arabia: ఈ యువరాజు హయాంలో.. రికార్డు స్థాయి మరణశిక్షలు..!
-
India News
Jammu Kashmir: కశ్మీర్ ఉగ్రవాదుల కొత్త ఆయుధం.. పెర్ఫ్యూమ్ బాంబ్!