యూకేలో ఎపిగ్రఫీ కోర్సు ఎక్కడుంది?

హిస్టరీ సబ్జెక్టుతో ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ పాసయ్యాను. హిస్టరీ, ఆర్కియాలజీ సబ్జెక్టులతో యూకేలో పీజీలో చేరి ప్రధానాంశంగా ఎపిగ్రఫీ చదవాలనుంది. ఈ కోర్సు యూకేలో ఎక్కడుంది?

- రమాకాంత్‌

ఎపిగ్రఫీ అంటే కఠినమైన లేదా మన్నికైన పదార్థంపై నమోదైన రాతల అధ్యయనం. దీన్నో ప్రత్యేకమైన కోర్సుగా కాకుండా హిస్టరీ/ ఆర్కియాలజీల్లో స్పెషలైజేషన్‌గా చదవొచ్చు. ఈ కోర్సు చదివిన తరువాత మీరు ఏ రంగంలో, ఏ విధంగా స్థిరపడాలనుకొంటున్నారో ముందుగా నిర్ణయించుకోండి. సాధారణంగా యూకేలో పీజీ కోర్సుల కాలవ్యవధి ఏడాది. ప్రత్యేకంగా ఎపిగ్రఫీలో పీజీ కోర్సులు అందుబాటులో లేవు. యూకేలో చాలా ప్రముఖ యూనివర్సిటీల్లో హిస్టరీ/ ఆర్కియాలజీలో పీజీ కోర్సులు ఉన్నాయి. వార్విక్‌ యూనివర్సిటీలో ఏన్షియంట్‌ విజువల్‌ అండ్‌ మెటీరియల్‌ కల్చర్‌లో పీజీ, యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌లో ఏన్షియంట్‌ హిస్టరీ పీజీ కోర్సుల్లో ఎపిగ్రఫీ సంబంధ విషయాలను బోధిస్తారు. ఇవేకాకుండా యూనివర్సిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌, యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌, కింగ్స్‌ కాలేజ్‌ లండన్‌, యూనివర్సిటీ ఆఫ్‌ ఎడిన్‌బరో లాంటి విద్యాసంస్థల్లో కూడా హిస్టరీ/ ఆర్కియాలజీ పీజీ కోర్సుల్లో ఎపిగ్రఫీకి సంబంధించిన అంశాలపై అవగాహన కల్పిస్తారు. మీకు ఆసక్తి ఉంటే హిస్టరీ/ఆర్కియాలజీలో పీజీ చేశాక, ఎపిగ్రఫీలో పీహెచ్‌డీ చేసే ప్రయత్నం చేయండి.

- ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


మరిన్ని