నోటాకు ఓటరు జై

అయిదేళ్లలో 1.29కోట్ల మంది దానికే ఓటు
ఏడీఆర్‌, ‘న్యూ’ విశ్లేషణలో వెల్లడి

దిల్లీ: గత అయిదేళ్లలో దేశంలో జరిగిన సార్వత్రిక, అసెంబ్లీల ఎన్నికల్లో కలిపి ‘నోటా(నన్‌ ఆఫ్‌ ది అబౌ)’కు 1.29 కోట్ల మంది ఓటేశారు. అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) సంస్థ గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. పోటీలో ఉన్న అభ్యర్థులెవ్వరూ నచ్చని పక్షంలో ఎవ్వరికీ ఓటు వేయకుండా నోటాను ఎంచుకునే సదుపాయం అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. 2018-2022 మధ్య నోటాకు పడిన ఓట్లను ఏడీఆర్‌, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌(న్యూ) విశ్లేషించాయి. ఆ నివేదిక ప్రకారం..  

2018-2022 మధ్య మొత్తంగా అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కలిపి 65,23,975 లక్షల ఓట్లు (1.06 శాతం) నోటాకు వచ్చాయి.

లోక్‌సభ ఎన్నికల్లో.. బిహార్‌లోని గోపాల్‌గంజ్‌(ఎస్సీ) పార్లమెంట్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 51,660 ఓట్లు పోలయ్యాయి. అతి తక్కువగా లక్షద్వీప్‌లో 100 ఓట్లు పడ్డాయి.

2020లో జరిగిన రెండు అసెంబ్లీల ఎన్నికల్లో అత్యధికంగా 1.46 శాతం ఓట్లు(7,49,360) వచ్చాయి. బిహార్‌లో 7,06,252 ఓట్లు, ఎన్‌సీటీ దిల్లీలో 43,108 ఓట్లు పోలయ్యాయి.

2022లో జరిగిన ఐదు అసెంబ్లీల ఎన్నికల్లో నోటాకు అతి తక్కువగా 0.70శాతం ఓట్లు పడ్డాయి. గోవా(10,629), మణిపుర్‌(10,349), పంజాబ్‌(1,10,308), ఉత్తర్‌ప్రదేశ్‌(6,37,304), ఉత్తరాఖండ్‌(46,840) ఓట్లు పోలయ్యాయి.

2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా 7,42,134 ఓట్లు పడ్డాయి. 2018లో జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువగా 2,917 ఓట్లు వచ్చాయి. మరోవైపు అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌ రాష్ట్రాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యర్థులు ఎవ్వరూ లేకపోవడంతో అక్కడ నోటాకు ఒక్క ఓటూ పోలవలేదు.

ఓట్ల శాతం విషయంలో.. 2018లో ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు అత్యధికంగా 1.98 శాతం ఓట్లు పడ్డాయి. 2018లో మిజోరం, 2020లో దిల్లీ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో అత్యల్పంగా 0.46 శాతం ఓట్లు వచ్చాయి.

నియోజకవర్గాల వారీగా చూస్తే.. మహారాష్ట్రలోని లాతూర్‌ గ్రామీణ నియోజకవర్గంలో అత్యధికంగా 27,500 ఓట్లు నోటాకు రాగా, అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తాలీలో అత్యల్పంగా 9 ఓట్లు పోలయ్యాయి.

ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ మంది క్రిమినల్‌ కేసులున్న అభ్యర్థులు పోటీ చేసిన నియోజకవర్గాలకు సంబంధించి.. 2018 నుంచి జరిగిన అసెంబ్లీల ఎన్నికల్లో 26,77,616 ఓట్లు నోటాకు వచ్చాయి. బిహార్‌లోని అలాంటి 217 నియోజకవర్గాల్లో 6,11,122 ఓట్లు(1.63 శాతం) పోలయ్యాయి. ఇదిలాఉంటే, ఏదైనా నియోజకవర్గ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. గెలుపు ఎవ్వరిదీ కాదని ప్రకటించాలని ఏడీఆర్‌ సిఫార్సు చేస్తోంది. మళ్లీ ఎన్నికలు నిర్వహించి.. అంతకుముందు బరిలో ఉన్న అభ్యర్థులు మళ్లీ పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తోంది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని