మంచి చెడులను గుర్తించడమే కోర్టుల పవిత్ర విధి

సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం వ్యాఖ్య
హత్యాయత్నం కేసులో నిందితుడికి విముక్తి

దిల్లీ: మంచి చెడులను గుర్తించడం, నిందితుడి రక్షణ విషయంలో పైపై పరిశీలనల నుంచి అతడిని కాపాడడమే కోర్టుల పవిత్రమైన విధి అని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. ఓ హత్యాయత్నం కేసులో నిందితుడిని నిర్దోషిగా విడుదలచేస్తూ పై విధంగా స్పందించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. జై ప్రకాశ్‌ తివారీ అనే వ్యక్తికి విచారణ న్యాయస్థానం విధించిన శిక్షను కొట్టివేసింది. ఓ హత్యాయత్నం కేసులో విచారణ న్యాయస్థానం తనను దోషిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ జైప్రకాశ్‌ తివారీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను మధ్యప్రదేశ్‌ హైకోర్టు 2017లో కొట్టివేసింది. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ హిమా కోహ్లిలు సభ్యులుగా గల సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ప్రాసిక్యూషన్‌ కేసు కేవలం ఊహాగానాలు, సందేహాల ఆధారంగా ఉందని, నిందితుడు సమర్పించిన సాక్ష్యాలను అత్యంత సాధారణ విధానంలో పరిశీలించినట్లు స్పష్టమవుతోందని పేర్కొంది. ‘‘మంచి చెడులను గుర్తించడం, సాక్ష్యాధారాల నుంచి సత్యాన్ని వెలికితీయడమే న్యాయస్థానం విధి’’ అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా తనకు ప్రతికూలంగా మారిన అంశాలను వివరించడానికి సీఆర్‌పీసీలోని 313వ సెక్షన్‌ నిందితుడికి సముచితమైన అవకాశాన్ని కల్పిస్తోందని గుర్తుచేసింది. ఫిర్యాదుదారు వాంగ్మూలాన్ని బలపరిచే స్వతంత్ర సాక్ష్యం లేకుండా తివారీకి వ్యతిరేకంగా దాఖలైన కేసు కొనసాగలేదని పేర్కొంది. సెక్షన్‌ 313 కింద అప్పీలుదారుడి స్టేట్‌మెంట్‌పై ప్రాసిక్యూషన్‌ సంతృప్తికరంగా స్పందిచలేదని స్పష్టంచేసింది. ‘‘కేసులో ప్రాసిక్యూషన్‌ రికార్డు చేసిన సాక్ష్యం సహేతుకమైన సందేహాలను మించి అప్పీలుదారుపై అభియోగాలను రుజువు చేసేంతగా లేవు’’ అని పేర్కొంది.

ప్రాసిక్యూషన్‌ ఆరోపణల ప్రకారం.. అప్పీలుదారుడు, మరో సహ నిందితుడు ఫిబ్రవరి 14, 2003న ఫిర్యాదుదారుడి నివాసానికి వెళ్లి బయటకు రావాల్సిందిగా కోరారు. ఆ తర్వాత ఫిర్యాదుదారుడిపై దేశీయ తుపాకీతో కాల్పులు జరిపారు. అనంతరం పరారయ్యారు. ఈ మేరకు ఇద్దరిపై హత్యాయత్నం సెక్షన్‌, ఆయుధాల చట్టం కింద కేసు నమోదుచేశారు. విచారణ న్యాయస్థానం సహ నిందితుడిని నిర్దోషిగా విడుదలచేసి, అప్పీలుదారుడిని దోషిగా తేల్చింది. సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అప్పీలుదారు తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మొత్తం కేసు అంతా కేవలం ఫిర్యాదుదారుడి సాక్ష్యం, అతని తల్లి ‘వినికిడి సాక్ష్యం’ ఆధారంగా ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం కల్పించుకుంటూ.. కేసులో ఫిర్యాదుదారుకు అత్యంత దగ్గరి బంధువులను ఆసక్తికర సాక్ష్యంగా చూడలేమని స్పష్టంచేసింది. అత్యంత జాగ్రత్తగా, సముచితమైన రీతిలో ఆలోచిస్తూ నిందితుడి రక్షణను పరిశీలించడం కోర్టుల పవిత్ర విధి అని పేర్కొంది.


మరిన్ని

ap-districts
ts-districts