సేవలు అమోఘం... వాక్చాతుర్యం అనంతం..

మీరు వినోబా భావే లాంటివారు

వెంకయ్యనాయుడిని ప్రశంసిస్తూ ప్రధాని మోదీ మూడు పేజీల లేఖ

ఈనాడు, దిల్లీ: సుదీర్ఘ రాజకీయ జీవితంలో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు దేశానికి అందించిన సేవలను ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. భూదానోద్యమ స్ఫూర్తిప్రదాత ఆచార్య వినోబా భావేతో ఆయనను పోల్చారు. ఏదైనా విషయాన్ని సూటిగా, స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వినోబా భావేకి అద్భుతమైన నైపుణ్యం ఉండేదని, అదే తరహా లక్షణం మీలోనూ చూశానని ఉపరాష్ట్రపతి పదవీ కాలం ముగిసే రోజు వెంకయ్యనాయుడికి రాసిన మూడు పేజీల లేఖలో మోదీ పేర్కొన్నారు. భాజపా అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, రాజ్యసభ ఛైర్మన్‌గా దేశం కోసం అత్యంత నిబద్ధతతో పని చేశారని ప్రశంసించారు.

మీ చతురతకు జీవితకాల ఆరాధకుడిని..

‘‘నెల్లూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఉపరాష్ట్రపతి దాకా సాగిన మీ అద్భుతమైన ప్రయాణం ఎంతో స్ఫూర్తిమంతం. మీ రాష్ట్రంలో పెద్దగా ప్రాధాన్యం లేని ఓ పార్టీ, రాజకీయ ఉద్యమంలో చేరడానికి మిమ్మల్ని ప్రేరేపించిన నమ్మకం, నిబద్ధత ఎంత శక్తిమంతమైనవో ఊహించుకోవచ్చు. మీ యుక్త వయసునంతా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికో లేదంటే ఎమ్మెల్యేగా, పార్టీ నాయకుడిగా ప్రతిపక్షంలో ఉండి పోరాడటానికో అంకితం చేశారు. మీ శక్తి అనంత ప్రవాహం వంటిది. దాన్ని మీ చతురత, జ్ఞానంలో చూడొచ్చు. మీ అంత్యప్రాసలు విస్తృత ప్రాచుర్యం పొందాయి. వాక్చాతుర్యం మీ గొప్ప బలం. వినోబా భావే రచనలు నన్నెప్పుడూ ప్రభావితం చేస్తాయి. అత్యంత అనువైన పదాలతో విషయాన్ని స్పష్టంగా చెప్పడం ఆయనకు బాగా తెలుసు. మీ మాటలు ఎప్పుడు విన్నా అదే అద్భుత నైపుణ్యం కనిపిస్తుంది. ప్రేక్షకులను సమ్మోహితులను చేసి, విషయాలను సరళంగా అర్థమయ్యేలా చెప్పగల మీ సామర్థ్యం అద్భుతం. మీ చతురతకు నేను జీవితకాలం ఆరాధకుడిగా ఉంటాను. మీ సలహాలతో వ్యక్తిగతంగా ఎంతో లబ్ధిపొందాను.

పార్టీ బలోపేతానికి విశేష కృషి

భాజపాలో మీరు పని చేసిన సమయం కూడా ఎంతో మహత్తరమైంది. పార్టీ వ్యవహారాల్లో మీరు తీసుకున్న చర్యలు ప్రతి కార్యకర్తనూ ఉత్సాహభరితం చేశాయి. ఎన్నో కొత్త కార్యాలయాలు ప్రారంభించి పార్టీ బలోపేతానికి గట్టి కృషి చేశారు. మీరు పార్టీ సీనియర్‌ పదాధికారిగా ఉన్నప్పుడు ఉన్నత స్థాయి పాత్రికేయులు, మేధావులు దేశ భౌగోళిక రాజకీయ పరిస్థితులపై మీ లోతైన ఆలోచనలను, విశ్లేషణలను వినడానికి ఉత్సుకతతో ఎదురుచూసేవారు. అలాంటి ఒక సంఘటనే నాకు గుర్తుకొచ్చింది. ఆడ్వాణీ రథయాత్ర సమయంలో నాకు వివిధ సంస్థాగత బాధ్యతలు అప్పగించారు. దాంతో యాత్రను దగ్గరగా అనుసరించే వాడిని. ఒక సమయంలో ఆడ్వాణీ వెంట ఉన్న భద్రతా సిబ్బంది అనుభవం గురించి అడిగినప్పుడు వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన కార్యక్రమాల గురించి ఆసక్తికరంగా చెప్పారు. అక్కడ వెంకయ్యనాయుడు అనే ఒక లీడర్‌ ఉన్నారు. ఆయన తెలుగులో సూపర్‌ఫాస్ట్‌గా మాట్లాడతారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో మాకు తెలిసేది కాదు. కానీ అక్కడి ప్రేక్షకులపై అమోఘమైన ప్రభావం చూపేదని తెలిపారు.

అద్భుతంగా రాజ్యసభ నిర్వహణ

ఉపరాష్ట్రపతిగా మీరు పని చేసిన విధానాన్ని బట్టి మీ శక్తి సామర్థ్యాలను అంచనా వేయొచ్చు. రాజ్యసభ ఛైర్మన్‌గా పెద్దల సభను అద్భుతంగా నిర్వహించారు. అధికార, ప్రతిపక్షాల సభ్యులతో మీరు నెరిపిన సన్నిహిత సంబంధాలు సభలో సౌహార్దపూర్వక స్ఫూర్తిని పెంపొందించాయి. కొత్త సభ్యులు, మహిళలు, యువకులు సభలో ఎక్కువ అవకాశాలు పొందడం సంతోషకరం. మీరు సాధించిన విజయానికి రాజ్యసభ ఉత్పాదకత రికార్డులే సాక్ష్యం. గడచిన అయిదేళ్లలో ఎన్నో చరిత్రాత్మక బిల్లులు ఆమోదం పొందాయి. 

జాతీయ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం

ఏ హోదాలో ఎక్కడ పనిచేసినా మీలో కనిపించింది పేదరిక నిర్మూలన, సమస్యల పరిష్కారం పట్ల నిబద్ధతే. మీరు ప్రతి విషయాన్ని ‘నేషన్‌ ఫస్ట్‌’ కోణంలో చూసేవారు. మీ అనుభవం, జ్ఞానం భవిష్యత్తులోనూ శాసనకర్తలకు వెలలేని ఆస్తులుగా పనికొస్తాయి. మీరు దేశానికి చేసిన సేవలకు ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మరిన్ని సార్లు మిమ్మల్ని కలిసి మాట్లాడాలని కోరుకుంటున్నాను’’ అని నరేంద్ర మోదీ లేఖలో పేర్కొన్నారు.


మోదీ ఆత్మీయతకు కృతజ్ఞతలు
- వెంకయ్యనాయుడు

‘అయిదు దశాబ్దాల ప్రజాజీవితంలోని వివిధ కోణాలను ఆత్మీయంగా ప్రస్తావిస్తూ లేఖ రాసిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. రాజకీయ ప్రస్థానంలో మోదీ నుంచి లభించిన సహకారం అమూల్యమైంది. ఆయనకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు’ అని వెంకయ్యనాయుడు ట్వీట్‌ ద్వారా వెల్లడించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని