ఉపరాష్ట్రపతిగా ధన్‌ఖడ్‌ ప్రమాణం

ఈనాడు,దిల్లీ: దేశ 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రపతి భవన్‌లో నిరాడంబరంగా నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. ప్రశాంతమైన రాజ్‌ఘాట్‌లో పూజ్య బాపూజీకి నివాళులర్పిస్తూ.. ‘ఎప్పుడూ భారత మాత సేవలో ఉండేలా ఆశీర్వదించమ’ని కోరుకున్నట్లు ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా సేవలందించిన జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఈ నెల 6న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని మార్గరెట్‌ ఆళ్వాపై ఘన విజయం సాధించారు. 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం బుధవారం ముగియడంతో ఆయన స్థానంలో గురువారం బాధ్యతలు చేపట్టారు. ధన్‌ఖడ్‌కు రాష్ట్రపతి, ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులు అభినందనలు తెలిపారు.

న్యాయవాద వృత్తిలోంచి రాజకీయాల్లోకి...

రాజస్థాన్‌ ఓబీసీ జాట్‌ సామాజిక వర్గానికి చెందిన ధన్‌ఖడ్‌.. మూడు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన దేశంలోనే రెండో అత్యున్నత స్థానానికి ఎదిగారు. 1951 మే 18న రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా కిథనా గ్రామంలో జగదీప్‌ ధన్‌ఖడ్‌ జన్మించారు. ఎల్‌ఎల్‌బీ కోర్సు తర్వాత 1979 నవంబరులో రాజస్థాన్‌ బార్‌ అసోసియేషన్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాజస్థాన్‌ హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు.

1989లో జనతాదళ్‌ తరఫున ఝున్‌ఝును లోక్‌సభ స్థానం నుంచి ధన్‌ఖడ్‌ గెలిచారు. 1990లో అప్పటి ప్రధాని చంద్రశేఖర్‌ కేబినెట్‌లో పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా స్వల్పకాలం పనిచేశారు. 1993-98 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో కాంగ్రెస్‌లో చేరారు. 1998 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ న్యాయవాద వృత్తిలో కొనసాగారు. 2008 తర్వాత భాజపా గూటికి చేరిన ధన్‌ఖడ్‌... 2019లో అనూహ్యంగా పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. మమతా బెనర్జీ సర్కారుతో ఆయన తీవ్ర స్థాయిలో విభేదించే వారు. సిట్టింగ్‌ గవర్నర్‌గా ఉండటం.. ఎంపీగా, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవంతో పాటు దీర్ఘ కాలం న్యాయవాద వృత్తిలో కొనసాగిన ధన్‌ఖడ్‌కు పెద్దల సభలో తలపండిన నేతలను నియంత్రించగలిగే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని భాజపా భావిస్తోంది.

ఇవీ ఉపరాష్ట్రపతి అధికారాలు..

అయిదేళ్ల పాటు పదవిలో కొనసాగే ఉపరాష్ట్రపతి విధుల్లో ప్రధానమైనది రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరించడం. ఏదైనా పరిస్థితుల్లో రాష్ట్రపతి పదవి ఖాళీ అయిన పక్షంలో కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే వరకూ తాత్కాలికంగా ఆ బాధ్యతలను ఉపరాష్ట్రపతి చేపడతారు. ఆ సమయంలో దేశ ప్రథమ పౌరుడి అధికారాలన్నీ ఉపరాష్ట్రపతికి లభిస్తాయి. రాష్ట్రపతికి లభించే జీతభత్యాలు, అలవెన్సులూ వర్తిస్తాయి. రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టే ఉపరాష్ట్రపతి స్థానంలో ఎవరు విధులు నిర్వహిస్తారనేది రాజ్యాంగం స్పష్టం చేయలేదు. అయితే, ఆ సమయంలో రాజ్యసభ సమావేశాలకు డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ అధ్యక్షత వహిస్తారు. లేదా రాష్ట్రపతి అనుమతి పొందిన ఎగువసభ సభ్యులు ఎవరైనా సభను నడపవచ్చు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని