జమ్మూ-కశ్మీర్‌లో సైనిక శిబిరంపై ఆత్మాహుతి దాడి కుట్ర భగ్నం

భారీ ప్రాణనష్టాన్ని నివారించిన భద్రతాదళాలు

ఇద్దరు ముష్కరుల హతం

అమరులైన నలుగురు జవాన్లు

జమ్ము: దేశం స్వాతంత్య్ర అమృతోత్సవాలు జరుపుకొంటున్న వేళ.. జమ్మూ-కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడితో భారీ స్థాయిలో ప్రాణ నష్టం కలిగించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను భారత సైన్యం భగ్నం చేసింది. సైనిక స్థావరంపై దాడికి యత్నించిన ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టింది. ఈ క్రమంలో ఉగ్రవాదులతో నాలుగు గంటలపాటు జరిగిన కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. రాజౌరీ జిల్లా పార్ఘల్‌లో ఉన్న ఆర్మీ క్యాంప్‌ వద్ద గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.

సైనికాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఉగ్రవాదులు ప్రతికూల వాతావరణాన్ని అనువుగా మార్చుకుని సైనిక శిబిరంలోకి చొరబడేందుకు కంచెను దాటే యత్నం చేశారు. శక్తిమంతమైన బుల్లెట్లు, గ్రెనేడ్లతో వచ్చిన వారు ఆత్మాహుతి దాడికి పాల్పడి భారీ స్థాయిలో విధ్వంసం సృష్టించే లక్ష్యంతో ఈ దుస్సాహసం చేశారు. అనుమానాస్పద కదలికలను గుర్తించి అప్రమత్తమైన సెంట్రీలు ఇద్దరు ముష్కరులను హెచ్చరించారు. ఎలాగైనా లోపలికి ప్రవేశించాలన్న ఉద్దేశంతో ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసిరారు. ఆ పేలుడు ధాటికి సెంట్రీ విధుల్లో ఉన్న ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై అక్కడకు చేరుకుని ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపారు. ముష్కరులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులనూ సైన్యం మట్టుబెట్టి భారీ నష్టాన్ని నివారించగలిగింది. అయితే ముష్కరుల కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. వారిలో సుబేదార్‌ రాజేంద్ర ప్రసాద్‌(రాజస్థాన్‌), రైఫిల్‌మ్యాన్లు డి.లక్ష్మణన్‌(తమిళనాడు మదురై జిల్లాలోని టి.పుదుపట్టి గ్రామం), మనోజ్‌ కుమార్‌(హరియాణా), నిశాంత్‌ మాలిక్‌ ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటన వెనుక పాకిస్థాన్‌కు చెందిన జైషే మొహమ్మద్‌ ఉగ్ర ముఠా హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 2019లో 40 మంది భద్రతా సిబ్బంది మరణించిన పుల్వామా ఘటన తర్వాత మూడేళ్లకు మళ్లీ ఇప్పుడు అదే తరహాలో జమ్మూ-కశ్మీర్‌లో ఆత్మాహుతి దాడి యత్నం జరగడంపై భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. రాజౌరీ జిల్లాలో పెద్ద ఎత్తున  తనిఖీలు చేపట్టాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని