అనుమానం ఉన్నవారిని ఈడీ ఎందుకు విచారించకూడదు?

కేరళ హైకోర్టు ప్రశ్న
వ్యక్తుల ప్రైవసీని ఉల్లంఘించవద్దని ఈడీకి ఆదేశం

కొచ్చి: ఎవరిపైనైనా అనుమానం ఉన్నప్పుడు వారిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎందుకు విచారించకూడదని కేరళ హైకోర్టు ప్రశ్నించింది. ‘కేరళ మౌలిక సదుపాయాల పెట్టుబడుల నిధి మండలి’ (కేఐఐఎఫ్‌బీ) ఆర్థిక వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ తనకు జారీ చేసిన రెండు సమన్లను కొట్టివేయాలని కేరళ మాజీ ఆర్థిక మంత్రి, సీపీఎం సీనియర్‌ నేత థామస్‌ ఐజాక్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ వి.జి.అరుణ్‌ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అనుమానితునిగా కాకుండా సాక్షిగా ఎవరికైనా ఈడీ సమన్లు ఇవ్వకూడదా అని ఆయన్ని ప్రశ్నించింది. ఐజాక్‌ను అనుమానితునిగానే ఈడీ చూస్తోందని, వ్యక్తిగత వివరాలను అడుగుతోందని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. వ్యక్తుల ప్రైవసీని ఉల్లంఘించవద్దని ఈడీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు నిర్ణయం వెలువడేవరకు విచారణకు హాజరు కాకూడదని ఐజాక్‌ భావిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని నిర్బంధించడానికి, విపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల కూల్చివేతకు ఈడీని కేంద్రం ఒక ఆయుధంగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. కేఐఐఎఫ్‌బీ ఆర్థిక వ్యవహారాల్లో విచారణకు వ్యతిరేకంగా ఐదుగురు ఎల్డీఎఫ్‌ ఎమ్మెల్యేలు వేసిన పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.మణికుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వాయిదావేసింది. ఐజాక్‌కు ఈడీ సమన్లు జారీ చేయడాన్ని కాంగ్రెస్‌, వామపక్షాలు తప్పుపట్టాయి. ఆ రెండు పార్టీలూ ఒక గూటి పక్షులేనని భాజపా ఎద్దేవా చేసింది.


మరిన్ని

ap-districts
ts-districts