కొత్త పాఠ్యాంశాలు ఎలా ఉండాలి?

ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన కేంద్రం

అందరూ పాల్గొనాలని మంత్రి పిలుపు

ఈనాడు, దిల్లీ: పాఠశాల విద్యలో కొత్త పాఠ్యాంశాలను ఖరారు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఈమేరకు ‘నేషనల్‌ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్‌’ పేరుతో సర్వే ప్రారంభించింది. ఇందులో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, స్కూల్‌ లీడర్లు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, కమ్యూనిటీ మెంబర్లు, ఎన్‌జీఓలు, నిపుణులు, ప్రజాప్రతినిధులు, కళాకారులు, చేతివృత్తుల నిపుణులు, రైతులతోపాటు పాఠశాల విద్య పట్ల ఆసక్తి ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పిలుపునిచ్చారు. మొత్తం 23 భారతీయ భాషల్లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు. దీంతో ఎవరైనా ఇందులో పాల్గొని తమకు నచ్చిన భాషలో అభిప్రాయాలను వెల్లడించవచ్చు. జాతీయ నూతన విద్యావిధానానికి అనుగుణంగా కొత్త పటిష్ఠమైన విద్యావ్యవస్థను నిర్మించడానికి ప్రజలు తమ వంతు చేయూతను అందించాలని మంత్రి కోరారు. ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో https://ncfsurvey.ncert.gov.in/ అనే వెబ్‌సైట్‌కి వెళ్లి అందులో అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని సూచించారు. ఎక్కువ మంది పాల్గొని ఎక్కువ అభిప్రాయాలు వ్యక్తం చేయడం వల్ల నూతన విద్యావిధానానికి సంబంధించి ఆచరణాత్మక మార్గసూచీని (ప్రాక్టికల్‌ రోడ్‌మ్యాప్‌) తయారు చేయడానికి వీలవుతుందని పేర్కొన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts