దళిత బాలుడి మృతితో రాజస్థాన్‌లో ప్రకంపనలు

గహ్లోత్‌ సర్కారుకు తాఖీదు

జైపుర్‌, దిల్లీ: తాగునీటి కుండను తాకినందుకు టీచర్‌ తీవ్రంగా కొట్టడంతో ఓ దళిత బాలుడు మృత్యువాతపడిన ఘటన రాజస్థాన్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సీఎం అశోక్‌ గహ్లోత్‌ నేతృత్వంలోని సర్కారుకు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ దారుణోదంతంపై రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) మంగళవారం తాఖీదు జారీ చేసింది. బాలుడి మరణానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి చోటుచేసుకుందో తమకు ఏడు రోజుల్లోగా తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు- బాలుడి మృతి రాజకీయంగానూ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో దళితులకు రక్షణ కరవైందని ఆరోపిస్తూ బారా-అత్రు ఎమ్మెల్యే పానాచంద్‌ మేఘ్‌వాల్‌ (కాంగ్రెస్‌) సోమవారం తన పదవికి రాజీనామా చేయగా.. ఆయనకు మద్దతుగా బారా మున్సిపల్‌ కౌన్సిల్‌లో హస్తం పార్టీకి చెందిన 12 మంది కౌన్సిలర్లు తాజాగా రాజీనామా లేఖలు సమర్పించారు. జాలోర్‌ జిల్లా సురానా గ్రామంలోని ఓ పాఠశాలలో తాగునీటి కుండను తాకినందుకు గత నెల 20న టీచర్‌ చితకబాదడంతో ఇంద్రా మేఘ్‌వాల్‌ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 13న అతడు ప్రాణాలు కోల్పోయాడు. కాంగ్రెస్‌ అగ్ర నేత సచిన్‌ పైలట్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గోవింద్‌సింగ్‌ దోస్తారా తదితర ప్రముఖులు తాజాగా బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు.


మరిన్ని

ap-districts
ts-districts