ముస్లిం విడాకుల్లో ఆ రెండూ ఒకటి కావు

మహిళలు ‘ఖులా’ అవకాశం వాడుకోవచ్చు : సుప్రీంకోర్టు

దిల్లీ: మూడు నెలల వ్యవధిలో నెలకోసారి ‘తలాఖ్‌’ అని చెప్పడం ద్వారా ముస్లింలు విడాకులు (తలాఖ్‌ ఏ హసన్‌) తీసుకోవడం.. వెంటవెంటనే ముమ్మారు ఉచ్చరించి విడాకులు తీసుకునే ట్రిపుల్‌ తలాఖ్‌ (తలాఖ్‌ ఏ బిద్దత్‌) విధానంతో సమానం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహబంధం వద్దనుకునే ముస్లిం మహిళకు ‘ఖులా’ అవకాశం ఎప్పుడూ ఉంటుందని తెలిపింది. ‘‘ఇస్లాంలో పురుషుడు భార్య నుంచి విడిపోవడానికి ‘తలాఖ్‌’ ఉన్నట్టే.. భర్త నుంచి వేరుకావడానికి మహిళకు ‘ఖులా’ అవకాశం కల్పిస్తోంది’’ అని జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ ఎం.ఎం.సుంద్రేశ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కోలుకోలేని విధంగా సంసారం విచ్ఛిన్నమై భార్యాభర్తలు కలిసి ఉండలేని పరిస్థితి ఎదురైతే రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద వారికి విడాకులు మంజూరు చేయవచ్చని వివరణ ఇచ్చింది. తలాఖ్‌-ఏ-హసన్‌ సహా వివిధ రకాలుగా ఉన్న ఏకపక్ష తలాఖ్‌లను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలంటూ గాజియాబాద్‌కు చెందిన మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం మంగళవారం విచారించింది. తలాఖ్‌లు అన్నీ ఏకపక్షం, నిర్హేతుకం, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేవంటూ పిటిషనర్‌ తన దరఖాస్తులో పేర్కొన్నారు. దేశంలోని పౌరులందరికీ విడాకులు తీసుకునేందుకు ఒకేరకమైన నిబంధనలు రూపొందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని అందులో కోరారు. పిటిషనరు తలాఖ్‌-ఏ-హసన్‌ బాధితురాలు కావడం గమనార్హం. ఆమె వాదనతో తాము ఏకీభవించబోమని, మరే ఇతర కారణాల వల్ల కూడా ఇది ఎజెండాగా మారకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘మెహర్‌ (వధువుకు వరుడు ఇచ్చే పరిహారం) అందిస్తే పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవడం మీకు అంగీకారమేనా’’అని ప్రశ్నించింది. ఈ కేసు తదుపరి విచారణ ఆగస్టు 29కి వాయిదా పడింది.


మరిన్ని

ap-districts
ts-districts