నీట్‌, జేఈఈ విలీనంపై తొందర లేదు

క్యుయెట్‌ సాంకేతిక లోపాలు అందుకు అవరోధంకావు
యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ వెల్లడి

దిల్లీ: ఉమ్మడి విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష (సీయూఈటీ-క్యుయెట్‌) నిర్వహణలో ప్రాథమికంగా ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు ఆ పరీక్ష పరిధి విస్తరణకు అవరోధంకాబోవని యూజీసీ ఛైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ స్పష్టం చేశారు. క్యుయెట్‌లో జేఈఈ, నీట్‌ విలీన ప్రతిపాదనపై వెనక్కి తగ్గబోమనీ పేర్కొన్నారు. అయితే, విలీనానికి తొందరపడబోమని, గట్టి కసరత్తుతోనే ముందుకు వెళ్తామని చెప్పారు. క్యుయెట్‌లో తలెత్తుతున్న సమస్యలు తమకు గుణపాఠాలు వంటివని, త్వరలోనే వాటిని పరిష్కరించుకుని ఏడాదికి రెండు సార్లు ఆ పరీక్షను నిర్వహిస్తామన్నారు. ‘విద్యార్థులు వివిధ ప్రవేశ పరీక్షలకు సన్నద్ధం కావాల్సిన శ్రమను తొలగించి ఒకే పరీక్షతో నచ్చిన కోర్సులో చేరే అవకాశాన్ని కల్పించాలన్నది లక్ష్యం. అయితే, నూతన విధానం అమలుకు తొందరపడం. పకడ్బందీ ప్రణాళికతోనే కార్యరూపంలోకి తెస్తామ’ని పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగదీశ్‌ కుమార్‌ వెల్లడించారు. క్యుయెట్‌లో జేఈఈ, నీట్‌ల విలీనం ఎప్పుడు ఉండవచ్చని ప్రశ్నించగా...‘ఈ నెలాఖరుకు నిపుణుల కమిటీ నియామకం జరుగుతుంది. ప్రపంచంలోని, దేశంలోని అన్ని ప్రవేశ పరీక్షలపై అధ్యయనం చేస్తుంది. వచ్చే ఏడాదే ‘ఏక పరీక్ష’ విధానం అమలులోకి తీసుకురావాలని నిర్ణయిస్తే అందుకు సన్నాహాలను ఇప్పటి నుంచే ప్రారంభించాలి. సంబంధిత భాగస్వాముల మధ్య ఏకాభిప్రాయం సాధించాలి. సబ్జెక్టుల వారీగా సిలబస్‌ను ఖరారు చేయడంతో పాటు పరీక్ష కాఠిన్య స్థాయినీ నిర్ణయించాల్సి ఉంటుంద’ని తెలిపారు. భవిష్యత్తులో అన్నీ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ)లే ఉంటాయన్నారు. క్యుయెట్‌-యూజీ నాలుగో దశ పరీక్షలు బుధవారం నుంచి మొదలుకానున్నాయి.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని