సంక్షిప్త వార్తలు(8)

పుల్వామాలో ఉగ్రదాడి.. పోలీసు అధికారి మృతి

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆదివారం భద్రతా దళాలపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఓ పోలీసు అధికారి మృతిచెందగా, సీఆర్పీఎఫ్‌ సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. దక్షిణ కశ్మీర్‌ జిల్లాలోని పింగ్లానా ప్రాంతంలో పోలీసు, సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న గాలింపుల సందర్భంగా ఈ దాడి జరిగింది. జావిద్‌ అహ్మద్‌ దార్‌ అనే పోలీసు అధికారి మృతిచెందగా, గాయపడిన సీఆర్పీఎఫ్‌ జవాన్‌ను ఆసుపత్రికి తరలించారు. మరో రెండు రోజుల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా రాష్ట్ర పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.


74.6% బహిరంగ ప్రదేశాల్లో అందుబాటులో మరుగుదొడ్లు

దిల్లీ: దేశంలోని సుమారు 74.6 శాతం బహిరంగ ప్రదేశాల్లో మరుగుదొడ్లు అందుబాటులో ఉన్నాయని జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆదివారం విడుదల చేసిన ఓ నివేదిక తెలిపింది. ఆయా ఆవరణల్లో 84.2 శాతం ప్రాంతాల్లో చెత్త కనిపించిందని, అలాగే 93.1 శాతం చోట్ల వృథానీరు నిలిచిపోయి ఉందని వెల్లడించింది. పవిత్రస్థలాలు, బజార్లు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు వంటి 85,872 పబ్లిక్‌ ప్రదేశాలను సర్వే బృంద సభ్యులు పరిశీలించారు. మొత్తం మీద గృహాల సర్వే, వెబ్‌, మొబైల్‌ యాప్‌ల ద్వారా మొత్తం 5,13,77,176 స్పందనలను విశ్లేషించారు.


ప్రధాని కానుకల వేలం గడువు పొడిగింపు

దిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయానికి అందిన దాదాపు 1,200 కానుకల ఆన్‌లైన్‌ వేలం గడువు తేదీని అక్టోబరు 12వ తేదీ  దాకా పొడిగించినట్లు సాంస్కృతిక మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ కానుకల్లో వివిధ సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీకి అందిన అయోధ్య రామాలయ నమూనాలు, కామన్‌వెల్త్‌ గేమ్స్‌ విజేతల క్రీడా జ్ఞాపకాల వంటివి ఉన్నాయి. సెప్టెంబరు 17న మొదలైన ఈ వేలాన్ని పాత షెడ్యూలు ప్రకారమైతే అక్టోబరు 2తో ముగించాల్సి ఉంది. నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడరన్‌ ఆర్ట్‌లో కొన్ని కానుకలను ప్రదర్శనకు ఉంచారు.


నారింజ పండ్ల ట్రక్కులో రూ. 1,476 కోట్ల డ్రగ్స్‌ లభ్యం

మహారాష్ట్రలోని వాశీలో రూ.1476 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు పట్టుకున్నారు. ఇందులో 198 కిలోల క్రిస్టల్‌ మెథాంఫెటమైన్‌, 9 కేజీల స్వచ్ఛమైన కొకైన్‌ ఉంది. దక్షిణాఫ్రికా నుంచి నారింజ పండ్లను దిగుమతి చేసుకుంటున్న ఓ సంస్థ ట్రక్కుపై అనుమానం వచ్చి వాశీలో శనివారం తనిఖీ చేశామని, అందులోని పండ్ల పెట్టెలను తెరిచి చూస్తే భారీ ఎత్తున మాదకద్రవ్యాలు లభ్యమయ్యాయని డీఆర్‌ఐ వర్గాలు తెలిపాయి. దేశంలో ఇప్పటి వరకు పట్టుకున్న యాంఫెటమైన్‌, కొకైన్‌లలో ఇదే పెద్ద మొత్తమని అధికారులు పేర్కొన్నారు. దిగుమతిదారుడిని అదుపులోకి తీసుకున్నామని, ఈ అక్రమ రవాణాలో మిగిలిన సూత్రధారుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు.


ఎన్‌ఎస్‌ఏ సమాచారాన్ని నిర్లక్ష్యం చేయకండి: ప్రధాని

దిల్లీ: జాతీయ భద్రత మండలి సచివాలయం (ఎన్‌ఎస్‌సీఎస్‌), జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) నుంచి అందే ఏ సమాచారాన్నీ నిర్లక్ష్యం చేయవద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రంలోని అన్ని మంత్రిత్వ శాఖలను, వాటి కార్యదర్శులను ఆదేశించారు. ఏదైనా విధానానికి రూపకల్పన చేసేటప్పుడు మనదేశ వ్యూహాత్మక కోణంలో దానిని చూడాల్సి ఉందన్నారు. రెండ్రోజుల క్రితం ఆయన నేతృత్వంలో అయిదు గంటలపాటు జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశానికి అన్ని శాఖల కార్యదర్శులు కూడా హాజరయ్యారు.


మహారాష్ట్ర సీఎం శిందే భద్రత కట్టుదిట్టం

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే  భద్రతకు ముప్పు ఉన్నట్లుగా అందిన కచ్చితమైన సమాచారం ఆధారంగా ఆయన భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. ముఖ్యమంత్రికి ఉన్న ముప్పు గురించి రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగానికి శనివారం సాయంత్రం కీలక సమాచారం అందింది. రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ కమిషనర్‌ అశుతోష్‌ డుంబ్రే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. సీఎంకు జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కొనసాగుతుందన్నారు. ఈ విషయమై శిందే ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. భద్రత విషయం పోలీసులు చూసుకొంటారని, ప్రజల నుంచి తనను ఎవరూ దూరం చేయలేరన్నారు.


కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌కు మరోసారి ఈడీ సమన్లు

దిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక కేసుతో ముడిపడిన మనీ లాండరింగ్‌ వ్యవహారంలో ప్రశ్నించడం కోసం కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 7న దిల్లీలో తమ ఎదుట హాజరుకావాలని ఆయనకు సూచించింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్‌ జోడో’ యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో శివకుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి ఆయనను గత నెల 19న ఈడీ ప్రశ్నించింది.


గెలుపు నుంచి వచ్చే విజయాలు చాలా అరుదు

జీవితంలో గొప్ప విజయాలు చాలా తక్కువ సందర్భాల్లో గెలుపు నుంచి వస్తాయి. మిగిలిన అన్ని సందర్భాల్లోనూ మీకు ఎదురైన సవాళ్లు, ఎదుర్కొన్న అడ్డంకులు, ఓటములు, పడిలేచిన కెరటంలా నిలదొక్కుకుని పోరాటాన్ని కొనసాగించిన క్షణాలే విజయాన్ని పరిచయం చేస్తాయి.

- హర్ష్‌ గోయెంకా


మరిన్ని