39 ఏళ్లుగా... ఆ ఊళ్లో ప్రచారం నిషిద్ధం!

ఓటు వేయకుంటే జరిమానా
ఆదర్శ పథంలో గుజరాత్‌ గ్రామం

గాంధీనగర్‌: ప్రభుత్వాలపై అలిగో, అభివృద్ధి చోటుచేసుకోలేదనో.. ‘మా ఊరికి రాకండి’ అని రాజకీయ నాయకులను అడ్డుకునే ఊర్ల గురించి విన్నాం. అవి ఎన్నికలను బహిష్కరిస్తుండటాన్నీ చూస్తున్నాం. కానీ అభివృద్ధిలో ముందంజ వేసి, దేశంలోనే ఆదర్శగ్రామంగా నిలిచిన ఓ ఊరు ఎన్నికల ప్రచారాన్ని నిషేధిస్తోంది! ఏ పార్టీనీ ప్రచారానికి అనుమతించడం లేదు. ఆ ఊరు గుజరాత్‌లో ఉంది. ఎన్నికలు వచ్చాయంటే రాజకీయ నాయకులు పోటెత్తుతారు. ప్రచారం పేరుతో ధ్వనికాలుష్యం, పోస్టర్లు, బ్యానర్లు.. ఇలా అన్నిరకాల గోల కనిపించేదే! రాజ్‌కోట్‌ జిల్లాలోని రాజ్‌సమధియాలలో మాత్రం అలాంటివేమీ కనిపించవు. ఎలాంటి హడావుడీ ఉండదు. కారణం రాజకీయ ప్రచారాన్ని ఆ ఊరు నిషేధించటమే! ఇప్పుడు కాదు.. 1983 నుంచీ ఇదే పద్ధతిని పాటిస్తోందీ గ్రామం. రాజకీయ ప్రచారాలతో ఊర్లో వాతావరణం కలుషితమవుతుందన్నది గ్రామస్థుల భావన. అందుకే 1983లో అప్పటి సర్పంచి తీసుకున్న ప్రచార నిషేధ నిర్ణయానికి ఇప్పటికీ గ్రామస్థులు కట్టుబడి ఉంటున్నారు. అలాగని రాజకీయ ప్రక్రియకు, ఎన్నికలకు ఈ గ్రామస్థులు దూరంగా ఉంటారనుకుంటే పొరపాటు! ఓటు హక్కు వినియోగించకోవటం ఈ ఊర్లో తప్పనిసరి. ఎవరైనా ఓటు వేయకుంటే రూ.51 జరిమానా విధిస్తారు!

బాధ్యతాయుత ప్రవర్తన

రాజ్‌సమధియాల గ్రామంలో లేని సదుపాయం లేదు. వైఫై ఇంటర్నెట్‌, సీసీటీవీ కెమెరాలు, ఆర్వో ప్లాంటు, జిల్లాలోనే అత్యుత్తమ క్రికెట్‌ గ్రౌండ్‌... ఇలా అన్ని వసతులు ఉన్నాయి. ఈ ఊర్లో అత్యధిక వివాదాలను లోక్‌అదాలత్‌ల ద్వారా పరిష్కరించుకుంటారు. పౌర బాధ్యతల విషయంలోనూ ప్రజలంతా ఎంతో సహకరించటం ఇక్కడి ప్రత్యేకత. రోడ్లపై ఉమ్మడం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, యువకులు ఖాళీగా కూర్చోవటం వంటివాటిని ఇక్కడ అంగీకరించరు. ప్లాస్టిక్‌ను అస్సలు వాడరు. ఈ విషయంలో దేశంలోనే ఆదర్శగ్రామంగా అవార్డులను, రాష్ట్రపతి నుంచి సన్మానాన్ని అందుకుందీ గ్రామం.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు