జైల్లో జైన్‌కు సలాడ్లు.. పండ్లు!

దిల్లీ మంత్రి మరో వీడియో లీక్‌

దిల్లీ: తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ మంత్రి సత్యేందర్‌ కుమార్‌ జైన్‌ను వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అక్కడ ఆయనకు ప్రత్యేక వసతులు అందుతున్నాయంటూ మరో వీడియో వెలుగులోకి వచ్చింది. మత విశ్వాసాలకు అనుగుణంగా తనకు తగిన ఆహారం అందించడం లేదంటూ జైన్‌ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ వీడియో బయటకు వచ్చింది. మంత్రి జైలు గది సీసీటీవీ దృశ్యాల్లో ఆయనకు సలాడ్లు, పండ్లు, ఇతర ఆహారం అందుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫుటేజ్‌ .. జైన్‌ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చుతోందని జైలు వర్గాలు వ్యాఖ్యానించాయి. ఆయన చెప్తున్నట్లు 28కేజీలు తగ్గలేదని, పైగా 8 కేజీలు పెరిగారని పేర్కొన్నాయి. ఇదివరకు మర్దన వీడియో బయటకు రాగా.. అందులో మర్దన చేస్తున్న వ్యక్తి ఫిజియోథెరపిస్టు కాదని రేపిస్టు అని జైలు వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా తిహాడ్‌ జైలులో దిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌ హాలీడే రిసార్ట్‌ సౌకర్యాలు పొందుతున్నారని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి బుధవారం ఆక్షేపించారు.

మీడియాను నియంత్రించండి

జైలు గదిలో తనకు సంబంధించిన వీడియో ఫుటేజీలను పొందకుండా మీడియాను నియంత్రించాలంటూ సత్యేందర్‌ జైన్‌ బుధవారం స్థానిక కోర్టును ఆశ్రయించారు. దీనిపై ప్రత్యేక న్యాయమూర్తి వికాశ్‌ ధుల్‌ తిహాడ్‌ జైలు అధికారులకు నోటీసులు జారీ చేశారు. గురువారం కేసు విచారణ నేపథ్యంలో ఆలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.

నిబంధనల ప్రకారం ఆహారం అందించండి

మతపరమైన ఉపవాసం చేసే సమయంలో జైల్లో ఉన్న దిల్లీ మంత్రి సత్యేందర్‌ జైన్‌కు నిబంధనల ప్రకారం ఆహారం అందించాలంటూ తిహాడ్‌ జైలు అధికారులను దిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి వికాశ్‌ ధుల్‌ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. అలాగే గడచిన ఆరునెలలుగా జైన్‌కు అందించిన ఆహార పదార్థాల వివరాలతో నివేదికను గురువారంలోగా సమర్పించాలని సూచించారు. చట్ట ప్రకారం తన మత విశ్వాసాలకు అనుగుణంగా తనకు అందించే ఆహారాన్ని జైలు అధికారులు నిలిపేశారని, తిరిగి అందించేలా వారికి ఆదేశాలు ఇవ్వాలని జైన్‌ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు