COVID-19: కరోనా ఇన్‌ఫెక్షన్‌పై పిల్లల ముక్కు మెరుగైన పోరాటం

తాజా అధ్యయనం వెల్లడి

మెల్‌బోర్న్‌: వయసులో పెద్దవారి కంటే చిన్నారుల్లో కొవిడ్‌ (Coronavirus) తీవ్రత తక్కువగానే ఉన్నట్లు నివేదికలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిన్నారుల్లో శ్వాస తీసుకునే సమయంలోనే కరోనా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ను దీటుగా ఎదుర్కొనే సామర్థం నాసికా మార్గాలకు ఉన్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. అయితే, అన్ని వేరియంట్లపై ఇదేవిధమైన పోరాటం చేయక పోయినప్పటికీ.. కొన్ని వేరియంట్లపై మాత్రం పిల్లల నాసికా రంధ్రాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయని తెలిపింది.

చిన్నారుల్లో కరోనా ప్రభావంపై ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ క్వీన్స్‌ల్యాండ్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఇందులో భాగంగా 23 మంది ఆరోగ్యకరమైన చిన్నారుల శ్వాస మార్గాలను, 15 మంది పెద్దవారి శ్వాసరంధ్రాల్లో కరోనా వైరస్‌ తీరును పరిశీలించారు. తద్వారా పెద్దవారితో పోలిస్తే చిన్నారుల శ్వాసమార్గాల్లో వైరస్‌ తక్కువ మోతాదులో వృద్ధి చెందుతోందని పరిశోధకులు గుర్తించారు. వీటితోపాటు యాంటీవైరల్‌ ప్రతిస్పందన కూడా పిల్లల్లోనే గణనీయంగా ఉందని చెప్పారు.

‘పెద్దలతో పోలిస్తే చిన్నారులకు కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ రేటు, లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయి. కానీ, ఇందుకుగల కారణాలు మాత్రం తెలియవు’ క్రిస్టీ షార్ట్‌ పేర్కొన్నారు. అయినప్పటికీ కరోనా వైరస్‌కు కారణమైన సార్స్‌-కోవ్‌-2ను ఎదుర్కొంనేందుకు అవసరమైన రోగనిరోధక స్పందన చిన్నారుల శ్వాసమార్గంలో అధికంగా ఉన్నట్లు తేలిందన్నారు. అయితే, ఒమిక్రాన్‌ వేరియంట్‌ విషయానికి వచ్చేసరికి ఫలితం వేరే మాదిరిగా ఉందన్నారు. ఇటువంటి కారణాలతోనే పిల్లల్లో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.


మరిన్ని

ap-districts
ts-districts