BJP: 2024లో మళ్లీ పొరపాటు జరిగితే ఆ భగవంతుడు కూడా రక్షించలేరు: సుజనా చౌదరి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరిగిన పొరపాటు మళ్లీ 2024లోనూ జరిగితే మనల్ని ఆ భగవంతుడు కూడా రక్షించలేరని భాజపా నేత సుజనా చౌదరి అన్నారు.  రాజధాని అమరావతికి మద్దతుగా భాజపా ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ‘మనం.. మన అమరావతి’ పేరిట ఆ పార్టీ నేతలు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా రాజధాని పరిధిలోని తుళ్లూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభకు పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. 2019లో జరిగిన పొరపాటు మళ్లీ జరగకుండా చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఆలోచించి నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో దుర్భాషలు మంచిది కాదని రాజధాని ప్రజలకు సూచించారు. రాజధాని ప్రాంతానికి ఏ పార్టీ నేతలు వచ్చిన అమర్యాదగా ప్రవర్తించొద్దన్నారు.

ఏపీలో మాట్లాడే స్వాతంత్ర్యం కూడా లేదు.. 

మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజ్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలో జరిగిన దుర్మార్గం అమరావతి రైతుల్ని మోసం చేయడమేనన్నారు. రాజధాని రైతులను మోసం చేయడమంటే తల్లి, చెల్లి, భార్యను మోసం చేసినట్టేనని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో అమరావతికి మద్దతిస్తానన్న జగన్‌ మాటలు గుర్తు చేసుకోవాలని సూచించారు. జగన్‌ది ఎన్నికల ముందు ఓ మాట.. తర్వాత ఓ మాట అని విమర్శించారు. సొంతపార్టీ వారే నిజాలు మాట్లాడితే జైల్లో వేయించారని.. రఘురామకృష్ణరాజు వ్యవహారం అందుకు నిదర్శనమని ఆరోపించారు. దేశమంతా 75ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం చేసుకుంటోంది.. ఏపీలో మాత్రం కనీసం మాట్లాడే స్వాతంత్ర్యం లేదన్నారు.

జగన్‌.. అభివృద్ధి వ్యతిరేకి..

భాజపా సీనియర్‌నేత సత్యకుమార్‌ మాట్లాడుతూ...దేశానికైనా, రాష్ట్రానికైనా ఒకటే రాజధాని ఉండాలని స్పష్టం చేశారు. ‘‘ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూమినంతా ప్రభుత్వ పెద్దలు కబ్జా చేస్తున్నారు. పులివెందులలో భూసేకరణకు జగన్‌ పిలుపునిస్తే.. కడప జిల్లా ప్రజలు ఒక్క ఎకరం కూడా ఇచ్చేందుకు ముందుకు రాలేదు. సీఎం జగన్‌ అమరావతిలో మాత్రమే అభివృద్ధికి వ్యతిరేకులు కాదు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకులు. ఉత్తరాంధ్రను ఒక నేతకు ఇస్తే.. గంజాయి వ్యాపారం చేస్తూ, కొండలు తవ్వుకున్నారు. గోదావరి జిల్లాల్లో రెండు కులాల మధ్య కుంపటి పెట్టారు. రాయలసీమ ప్రాంతంలో రెండు మతాల మధ్య చిచ్చు పెట్టారు. ఏపీలో భాజపాకు సీట్లు రాకపోయినా మోదీ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారు. రాష్ట్రంలో రూ.70వేల కోట్లతో కేంద్రం రైల్వే ప్రాజెక్టులు నిర్మిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థను కేటాయించింది. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీల కోసం మోదీ రూ.2,500 కోట్లు ఇచ్చారు’’ అని సత్య కుమార్‌ వివరించారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని