Indigo: ఇండిగో విమానం నుంచి త్వరగా దిగేయొచ్చు

దిల్లీ: ప్రయాణికులు విమానం నుంచి త్వరగా దిగడం కోసం ఇక నుంచి మూడు తలుపులను తెరవనున్నట్లు విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. ‘విమానానికి ముందుండే రెండు ద్వారాలు, వెనక ఒక ద్వారాన్ని తెరుస్తాం. ప్రపంచంలోనే ఈ ప్రక్రియను మొదలు పెడుతున్న తొలి విమానయాన సంస్థ ఇండిగోనే కానుంద’ని సంస్థ పేర్కొంది. ఈ విధంగా చేయడం వల్ల విమానాశ్రయంలో 5-6 నిమిషాలను ఆదా చేసుకోవచ్చని ఇండిగో సీఈఓ రోనోజాయ్‌ దత్తా విలేకర్లతో పేర్కొన్నారు. ‘సాధారణంగా ఒక ఏ321 విమానంలోని 185-236 మంది ప్రయాణికులను రెండు ద్వారాల ద్వారా బయటకు పంపడానికి 13-14 నిమిషాల సమయం పడుతుంది. అదనంగా మరో తలుపు తెరిస్తే 7-8 నిమిషాల్లోనే అందరు ప్రయాణికులు విమానం నుంచి దిగగలుగుతార’ని ఆయన అన్నారు. దీని వల్ల విమానాల టర్నరౌండ్‌ సమయం (లోడింగ్‌, అన్‌లోడింగ్‌, సర్వీసింగ్‌) తగ్గుతుందన్నారు. ముందుగా బెంగళూరు, ముంబయి, దిల్లీ నగరాల్లో ఈ మూడు తలుపుల ప్రక్రియ ప్రారంభిస్తామని సీఈఓ తెలిపారు. తర్వాత అన్ని విమానాశ్రయాలకూ విస్తరిస్తామన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని