పాక్‌లో క్రైస్తవ కుటుంబం చెర నుంచి వాల్మీకి ఆలయానికి విముక్తి

సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత హిందువుల దర్శనానికి అందుబాటులోకి

లాహోర్‌: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో రెండు దశాబ్దాల పాటు ఓ క్రైస్తవ కుటుంబం కబ్జాలో ఉన్న 1,200 ఏళ్ల నాటి వాల్మీకి ఆలయం మళ్లీ ప్రజల దర్శనార్థం తెరచుకుంది. పాక్‌లో మైనారిటీ వర్గాలు భారత్‌కు వలస వెళ్తూ వదిలి వెళ్లిన ప్రార్థనా స్థలాల వ్యవహారాలను పర్యవేక్షించే ‘ది ఎవాక్యుయీ ట్రస్ట్‌ ప్రాపర్టీ బోర్డ్‌(ఈటీపీబీ) ఈ విషయాన్ని వెల్లడించింది. హిందూమతంలోకి మారినట్లు చెప్పుకుంటున్న ఆ క్రైస్తవ కుటుంబం వాల్మీకి ఆలయానికి చెందిన భూములు తమకే చెందుతాయని కోర్టులో కేసు వేసింది. దీంతోపాటు ఆ గుడిలోకి వాల్మీకి వర్గం వారిని తప్ప మిగతా హిందువులను దర్శనానికి అనుమతించకుండా అడ్డుకొనేది. దీనిపై ఈటీపీబీ న్యాయపోరాటం చేసింది. సుదీర్ఘ కాలం విచారణలు కొనసాగిన తర్వాత కోర్టు గత నెలలో ఈ ఆలయాన్ని ఈటీపీబీకి అప్పగిస్తూ తీర్పునిచ్చింది. లాహోర్‌లోని ప్రసిద్ధ అనార్కలీ బజార్‌ సమీపంలో ఉన్న ఈ ఆలయం బుధవారం మళ్లీ హిందువుల కోసం తెరచుకుంది. ఈ సందర్భంగా వందకు పైగా హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, ముస్లిం నేతలు ప్రారంభోత్సవంలో పాల్గొని దర్శనం చేసుకున్నారు.

1992లో విధ్వంసం

1992లో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన సమయంలో ఓ వర్గానికి చెందినవారు పెద్ద సంఖ్యలో ఈ ఆలయంలోకి చొరబడి కృష్ణుడు, వాల్మీకి విగ్రహాలను పగలగొట్టారు. అక్కడున్న సామగ్రిని ధ్వంసం చేశారు. విగ్రహాలకున్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.


మరిన్ని

ap-districts
ts-districts