Crime news: ధనవంతుడినంటూ.. నట్టేట ముంచుతాడు

అంతర్‌ రాష్ట్ర నేరస్థుడి పట్టివేత

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : ‘ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుంటాడు. తానో ధనవంతుడునని తియ్యని మాటలతో నమ్మిస్తాడు. బంగారపు ఉంగరాలు బహుమతులుగా ఇస్తాడు. ప్రేమించానని చెప్పి లాడ్జికి తీసుకువెళతాడు. ఆహార పదార్థాల్లో మత్తు మందు కలిపి నగలు, నగదు తీసుకుని ఉడాయిస్తాడు. ఇలా దాదాపు 30 మంది మహిళలను మోసం చేసిన కరుడుకట్టిన అంతర్‌ రాష్ట్ర నేరస్థుడు చేవూరి చంద్ర అలియాస్‌ వెందేటి చంద్ర (50)ను కృష్ణలంక పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతడి నుంచి 97.5 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ విశాల్‌గున్నీ తెలిపారు. గురువారం లబ్బీపేటలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 

వివరాలు ఇలా ఉన్నాయి..

నెల్లూరు జిల్లా కోట మండలానికి చెందిన చేవూరి చంద్ర (50) చిన్నతనంలోనే తల్లిదండ్రులను వదిలేసి ఒంటరిగా ఉంటున్నాడు. కొంతకాలం గూడూరులో పనిచేశాడు. తర్వాత తిరుపతి వెళ్లి స్థిరపడ్డాడు. బస్టాండు చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ.. ఒంటరిగా ఉండే మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. తాను బంగారం వ్యాపారం చేస్తానని చెప్పి, వారితో సన్నిహితంగా మెలిగేవాడు. తర్వాత లాడ్జికి తీసుకువెళ్లి మత్తు మందు ఇచ్చి నగలతో పారిపోయేవాడు. ఇలా గత 12 సంవత్సరాలుగా మోసాలు చేస్తున్నాడు. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, చెన్నై, ఏలూరు నగరాల్లో దాదాపు 30 మందిని మోసం చేశాడు. 8 కేసుల్లో జైలుశిక్ష పడింది. రెండు సార్లు జైలు నుంచి పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి బయటకు వచ్చి విజయవాడ చేరుకున్నాడు. మళ్లీ పాత తరహాలోనే నేరాలు చేయటం ప్రారంభించాడు. జూన్‌లో భవానీపురానికి చెందిన ఓ మహిళను మోసం చేసి 32 గ్రాముల నానుతాడు, 4 గ్రాముల చెవి దిద్దులు తీసుకుని ఉడాయించాడు. ఇదే తరహాలో జులైలో మరో మహిళను మోసం చేసి 24 గ్రాముల నానుతాడు, 8 గ్రాముల పూసలదండ, 20 గ్రాముల చెయిన్, ఉంగరాలు, చెవిదిద్దులతో పారిపోయాడు. దీనిపై విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో జరిగిన పాత నేరాలపై దృష్టి పెట్టి ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. 

మరో నేరం చేయడానికి వచ్చి దొరికిపోయాడు

చంద్ర మళ్లీ మరో మహిళను మోసం చేసేందుకు విజయవాడకు వచ్చినట్లు తెలుసుకుని, అతడి కదలికలపై కృష్ణలంక పోలీసులు నిఘా పెట్టారు. ఏసీపీ డాక్టర్‌ రవికిరణ్‌ నేతృత్వంలో వేట మొదలు పెట్టారు. విజయవాడ బస్టేషన్‌కు వచ్చి చంద్రను కృష్ణలంక సీఐ దుర్గారావు, క్రైం ఎస్సై కృష్ణబాబులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడి నుంచి 97.5గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన సీఐ దుర్గారావు, క్రైం ఎస్సై కృష్ణబాబు, హెడ్‌కానిస్టేబుల్‌ సాంబయ్య, కానిస్టేబుల్‌ బాబూరావులను పోలీసు కమిషనర్‌ కాంతిరాణాటాటా అభినందించారు. వారికి రివార్డులు అందించారు. ఇలాంటి అపరిచిత వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవద్దని, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే డయల్‌ 100 లేదా పోలీస్‌ వాట్సాప్, దిశ యాప్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ విశాల్‌గున్నీ సూచించారు.


మరిన్ని

ap-districts
ts-districts