CM KCR: ORRపై వాహనాలను చూడొచ్చా?.. కమాండ్ కంట్రోల్ నిపుణులకు కేసీఆర్ ప్రశ్నలు

హైదరాబాద్‌: కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభం సందర్భంగా లోపల విభాగాలను సీఎం కేసీఆర్ ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. కేంద్రంలో ఏకకాలంలో లక్ష కెమెరాలను చూసేందుకు వీలుందని పోలీస్‌ అధికారులు సీఎంకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌, యాదాద్రి దేవాలయం, హైదరాబాద్‌, వరంగల్‌.. ఇలా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను అనుసంధానం చేశామని చెబుతూ ఇక్కడి కమాండ్‌ కంట్రోల్‌ నుంచే సాంకేతిక నిపుణులు తెరపై సీఎం కేసీఆర్‌కు చూపారు. ఔటర్‌ రింగ్‌రోడ్‌పై వెళ్తున్న వాహనాలు కనిపిస్తాయా అని అడగ్గా అక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా వాహనాలను చూడొచ్చని వారు వివరించారు.

సర్‌.. ఇక్కడే భోజనం చేయండి...

ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తమతో పాటు భోజనం చేయాలని అభ్యర్థించారు. ఫర్వాలేదు.. వెళ్తానంటూ కళ్లతోనే చెబుతుండగా... హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వచ్చి అభ్యర్థించారు. దీంతో ముఖ్యమంత్రి వారితో పాటు భోజనానికి వెళ్లారు.

ఇంకా ఖరారు కాని పేరు

కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరు పెడతారంటూ గతంలో పోలీస్‌ అధికారులు తెలిపారు. మంచిపేరు పెట్టాలంటూ ప్రజలు, నెటిజన్లను సీవీ ఆనంద్‌ కోరారు. వేల సంఖ్యలో పేర్లు వచ్చాయి. వాటి నుంచి ఒక పేరును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎంపిక చేస్తారని వివరించారు. ప్రారంభోత్సవం రోజైన గురువారం పేరు ప్రకటించలేదు. ఇంకా ఖరారు చేయలేదని పోలీస్‌ వర్గాలు తెలిపాయి.


మరిన్ని

ap-districts
ts-districts