Stock Market Opening bell: ఆర్‌బీఐ కీలక ప్రకటనలకు ముందు లాభాల్లో సూచీలు

ముంబయి: ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలకు ముందు దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు శుక్రవారం లాభాలతో ప్రారంభమ్యాయి. కేంద్ర బ్యాంకు రెపో రేటును 35 బేసిస్‌ పాయింట్లు పెంచే అవకాశం ఉందన్న అంచనాలకు మార్కెట్లు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఈ అంచనాలకు భిన్నంగా ఆర్‌బీఐ నిర్ణయాలు ఉంటే తప్ప నేడు సూచీల్లో పెద్ద ఒడుదొడుకులు ఉండకపోవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందరూ ఊహించినట్లుగానే కీలక వడ్డీరేట్లను 35 బేసిస్‌ పాయింట్ల మేర మాత్రమే పెంచితే.. మార్కెట్లు రాణించే అవకాశం ఉందని తెలిపారు. అయితే, వారాంతం నేపథ్యంలో గరిష్ఠాల వద్ద స్థిరీకరణకు కూడా అవకాశం ఉందని చెబుతున్నారు. మరోవైపు గ్లోబల్‌ కంపెనీల బలహీన కార్పొరేట్‌ ఫలితాల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ సూచీలు నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి. మరోవైపు చమురు ధర గణనీయంగా తగ్గి 94.4 డాలర్లకు చేరింది.

ఉదయం 9:22 గంటల సమయానికి సెన్సెక్స్‌ 153 పాయింట్ల లాభంతో 58,452 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 17,423 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.78.99 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, ఎస్‌బీఐ, హెచ్‌యూఎల్‌, ఎంఅండ్‌ఎం, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. రిలయన్స్‌, మారుతీ, నెస్లే ఇండియా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టెక్‌ మహీంద్రా, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

నేడు ఫలితాలు ప్రకటించనున్న ప్రముఖ కంపెనీలు: టైటన్‌, ఎంఅండ్‌ఎం, ఎన్‌ఎండీసీ, సీసీఎల్‌ ప్రోడక్ట్స్‌, విశాకా ఇండస్ట్రీస్‌, యూకో బ్యాంక్‌, నైకా, పేటీఎం, పెట్రోనెట్‌, ఫైజర్‌, షిప్పింగ్‌ కార్పొరేషన్‌, ఇంజినీర్స్‌ ఇండియా, ఫోర్టిస్‌, గ్రాఫైట్‌

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

గెయిల్‌: ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి గెయిల్‌ (ఇండియా) లిమిటెడ్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.3,250.95 కోట్ల (ఒక్కో షేరుపై రూ.7.34) నికర లాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.2,157.15 కోట్లతో (ఒక్కో షేరుపై రూ.4.81) పోలిస్తే లాభం 51 శాతం పెరిగింది.

భెల్‌: ప్రభుత్వ రంగ భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ (భెల్‌) ఏప్రిల్‌- జూన్‌ త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన రూ.187.99 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల నష్టం రూ.448.20 కోట్లతో పోలిస్తే ఈసారి గణనీయంగా తగ్గింది. ఆదాయం  రూ.2,966.77 కోట్ల నుంచి రూ.4,742.28 కోట్లకు పెరిగింది.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌: 2022-23 ఏప్రిల్‌-జూన్‌లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌(ఏఈఎల్‌) ఏకీకృత నికర లాభం రూ.468.74 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే సమయ లాభం రూ.265.60 కోట్లతో పోలిస్తే ఇది 76.48 శాతం అధికం.  ఏకీకృత ఆదాయం రూ.12,578.77 కోట్ల నుంచి  మూడింతలకు పైగా పెరిగి రూ.41,066.43 కోట్లకు చేరింది.

బెర్జర్‌ పెయింట్స్‌: ఏప్రిల్‌- జూన్‌లో బెర్జర్‌ పెయింట్స్‌ ఏకీకృత ప్రాతిపదికన రూ.253.71 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2021-22లో ఇదే కాల లాభం రూ.140.48 కోట్లతో పోలిస్తే ఇది 80.60 శాతం ఎక్కువ. కార్యకలాపాల ఆదాయం రూ.1,798.49 కోట్ల నుంచి 53.44 శాతం పెరిగి రూ.2,759.70 కోట్లకు చేరింది.

డాబర్‌ ఇండియా: ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో డాబర్‌ ఇండియా రూ.441.06 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే  త్రైమాసిక లాభం రూ.438.30 కోట్లతో పోలిస్తే స్వల్పంగానే పెరిగింది. కార్యకలాపాల ఆదాయం రూ.2,611.54 కోట్ల నుంచి 8.07 శాతం పెరిగి రూ.2,822.43 కోట్లకు చేరింది.

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ నికర లాభం రూ.925.48 కోట్లుగా నమోదైంది. 2021-22 ఇదే మూడు నెలల్లో నమోదైన రూ.153.44 కోట్లతో పోలిస్తే ఇది ఆరింతలకు పైగా అధికం.

బ్రిటానియా ఇండస్ట్రీస్‌: ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో రూ.335.74 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక లాభం రూ.387.01 కోట్ల  తో పోలిస్తే ఇది 13 శాతం తక్కువ.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని