Kaduva review: రివ్యూ కడువా

చిత్రం: కడువా; నటీనటులు: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, వివేక్‌ ఒబెరాయ్‌, సంయుక్తా మేనన్‌, కళాభవన్‌ షాజోన్‌ తదితరులు; సంగీతం: జేక్స్‌ బిజోయ్; ఎడిటింగ్‌: షమీర్‌ మహ్మద్‌; సినిమాటోగ్రఫీ: అభినందన్‌ రామానుజం; రచన: జిను వి. అబ్రహాం; దర్శకత్వం: షాజీ కైలాస్‌; విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

కరోనా తర్వాత ప్రేక్షకుడు ఓటీటీని ఆకళింపు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇతర చిత్ర పరిశ్రమలో విజయవంతమైన చిత్రాలను ఆస్వాదిస్తున్నాడు. దీంతో ఆయా భాషల్లో నటించే నటులు పరిచయం అవుతున్నారు. మలయాళంలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ స్టార్‌ హీరో. ఆయన నటించిన పలు చిత్రాలు గతంలో డబ్‌ అయ్యాయి. ఇక ‘అయ్యప్పనుమ్‌ కోషియుం’ ఆయనను తెలుగు వారికి మరింత దగ్గర చేసింది. దీంతో తాజాగా ఆయన నటించిన మలయాళ మాస్‌ మూవీ ‘కడువా’ అదే పేరుతో ఇటీవల తెలుగులోనూ విడుదలైంది. ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమ్‌అవుతోంది. మరి ఈ మూవీ కథేంటి? పృథ్వీరాజ్‌ సుకుమారన్‌పాత్ర ఎలా ఉంది?

కథేంటంటే: కడువకున్నెల్‌ కురిచ్చియన్ ‌(పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) అలియాస్‌ కడువా.. పాళ అనే ప్రాంతంలో రబ్బరు పంటను సాగు చేస్తుంటాడు. అక్కడి వారందరికీ కడువా సుపరిచితమే. ఏ సాయం కావాలన్నా చేస్తుంటాడు. అదే ప్రాంతానికి ఐజీగా వస్తాడు జోసెఫ్‌ చాందీ( వివేక్‌ ఒబెరాయ్‌). అతను వచ్చిన దగ్గరి నుంచి పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ కడువా, ఆయన కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తుంటుంది. ఇంతకీ కడువాకు పోలీస్‌ డిపార్ట్‌మెంట్ ఎందుకు వ్యతిరేకంగా మారింది? జోసెఫ్‌ చాందీతో కడువాకు ఉన్న పోరు ఏంటి? వీరి మధ్య ఘర్షణ తలెత్తడానికి కారణం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఇదొక మాస్‌ మసాలా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. కథా బలమున్న చిత్రాలు వెండితెరను పలకరించే మలయాళ ఇండస్ట్రీలో ఇలాంటివి కాస్త అరుదు. సినిమా మొదలైన దగ్గరి నుంచి చివరి వరకూ కథానాయకుడు, ఆయన పాత్రను ఎలివేట్‌ చేయడమే పరమావధిగా సాగుతుంది.  కడువా జైలుకు రావడంతో సినిమా మొదలవుతుంది. ఆ పాత్రను ఎలివేట్‌ చేస్తూ, హైప్‌ఇస్తూ వచ్చే సన్నివేశాలను తీర్చిదిద్దారు. అక్కడి నుంచి కథ ప్లాట్‌ పాయింట్‌ను రివీల్‌ చేసుకుంటూ వెళ్లాడు దర్శకుడు. ఐజీ జోసెఫ్‌, కడువాల మధ్య వార్‌ నువ్వా నేనా అన్నట్లు సాగుతుంది. ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’లో ఏవిధంగానైతే పాత్రలు అహాన్ని ప్రదర్శిస్తాయో.. ఇందులోనూ అంతే. అయితే, దానికి కాస్త యాక్షన్‌ జోడించి దర్శకుడు ‘కడువా’ను తీర్చిదిద్దాడు. ప్రథమార్ధమంతా ఇలాగే సాగుతుంది. ప్రతి సన్నివేశంలోనూ హీరో ఎలివేషన్‌ ప్రధానంగా కనిపిస్తుంది. ద్వితీయార్ధంలో జోసెఫ్‌-కడువాల మధ్య పోరు తారస్థాయికి చేరుతుందని ఆశిస్తే.. ప్రీక్లైమాక్స్‌ ముందే కథను తేల్చేశాడు దర్శకుడు. చివరి 30 నిమిషాలు ఎలా పూర్తి చేయాలో తెలియక, ఒక రొటీన్‌ మాస్‌ యాక్షన్‌ సీన్‌తో ముగించాడు. ‘ఇది ఇక్కడితో అయిపోలేదు’ అంటూ చివర్లో వచ్చే సంభాషణలు చూస్తే.. దీనికి కొనసాగింపు ఇవ్వాలనుకున్నాడు దర్శకుడు. ఈ వీకెండ్‌ ఏదైనా ఒక యాక్షన్‌ థ్రిల్లర్‌ విత్‌ హీరో ఎలివేషన్స్‌ ఉన్న మూవీ చూడాలనుకుంటే కాలక్షేపం కోసం ‘కడువా’ ప్రయత్నించవచ్చు. అమెజాన్‌ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. కాకపోతే కేవలం మలయాళం ఆడియో మాత్రమే ఇచ్చారు. తెలుగులో కూడా ఇచ్చి ఉంటే మరింత బాగుండేది.

ఎవరెలా చేశారంటే: కథాబలమున్న చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తారు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. కానీ, ఈసారి హీరో ఎలివేషన్స్‌తో కూడిన కథను ఎంచుకున్నారు. ఇదే విషయాన్ని ప్రచార సమయంలోనూ చెప్పారు. కడువాగా ఆయన పాత్రకు న్యాయం చేశారు. ఇందులో మరో ముఖ్యమైన పాత్ర వివేక్‌ ఒబెరాయ్‌. జోసెఫ్‌ చాందీగా పోలీస్‌ ఆఫీసర్‌పాత్రలో దీటుగా నటించారు. సంయుక్తామేనన్ అక్కడక్కడా మెరుపులు మెరిపించింది. మిగిలిన వాళ్లు తెలుగువాళ్లకు పెద్దగా పరిచయం లేని వాళ్లే. సాంకేతికంగా సినిమా ఓకే. జేక్స్‌ బిజోయ్‌ నేపథ్య సంగీతం యాక్షన్‌ సీన్స్‌ను ఎలివేట్‌ చేసింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా. యాక్షన్‌ సీన్స్‌ను కూడా కొత్తగా డిజైన్‌ చేశారు. ఎడిటింగ్‌ కూడా పర్వాలేదు. అబ్రహాం కథను దర్శకుడు షాజీ కైలాస్‌ బాగానే హ్యాండిల్‌ చేశాడు. మాస్‌, యాక్షన్‌ మూవీ కాబట్టి లాజిక్‌లతో పనిలేదు. ద్వితీయార్ధంపై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే మరింత బాగుండేది.

బలాలు

+ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, వివేక్‌ ఒబెరాయ్‌

+ యాక్షన్‌ సన్నివేశాలు

+ హీరో ఎలివేషన్స్‌

బలహీనతలు

- తెలిసిన కథే

- క్లైమాక్స్‌

చివరిగా: మాస్‌+ యాక్షన్‌+ఎలివేషన్‌=‘కడువా’

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని