Huzurabad: హుజూరాబాద్‌లో మళ్లీ ‘పొలిటికల్‌ హీట్‌’.. బహిరంగ చర్చకు వచ్చిన కౌశిక్‌రెడ్డి

హుజూరాబాద్ పట్టణం: హుజూరాబాద్‌లో రాజకీయం మళ్లీ వేడెక్కింది. అధికార తెరాస, భాజపా నేతలు సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ చర్చకు పిలుపునిచ్చిన తెరాస ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి.. పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాకు వచ్చారు. ఆయన వచ్చిన కాసేపటికి భాజపా కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

తెరాస అందిస్తున్న ప్రగతే హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కనిపిస్తోందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి అన్నారు. తనతో నియోజకవర్గ అభివృద్ధి విషయమై బహిరంగ చర్చకు రావాలంటూ భాజపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటలకు సవాల్ విసిరిన ఆయన.. ఈ ఉదయం 11 గంటలకు పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాకు వచ్చారు. తన సవాల్‌ను స్వీకరించి ఈటల చర్చకు రాకపోవడంతో నియోజకవర్గంలోని అభివృద్ధి అంతా తెరాస చేసినట్లు ఆయన ఒప్పుకున్నట్లేనని చెప్పారు. 
రాజీనామా చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల.. ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏముందని కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. సొంత మండలం కమలాపూర్‌ పీహెచ్‌సీలో ఒక వైద్యుడ్ని కూడా నియమించుకోలేని దుస్థితిలో ఆయన ఉన్నారని.. అందుకే చర్చకు రావడం లేదని ఎద్దేవా చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి కౌశిక్‌రెడ్డి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా తెరాస కార్యకర్తలు ‘జై కేసీఆర్‌.. జై కేటీఆర్‌.. జై కౌశిక్‌రెడ్డి’ అంటూ నినాదాలు చేశారు. 

ఈ క్రమంలో కొంత మంది భాజపా కార్యకర్తలు అక్కడకు చేరుకుని.. కౌశిక్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి భాజపా కార్యకర్తలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో భాజపాకు చెందిన కొంత మంది కార్యకర్తలు కౌశిక్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఎట్టకేలకు పోలీసు బలగాలు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 20 మందికిపైగా భాజపా కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని వేర్వేరు స్టేషన్లకు తరలించారు.

హుజూరాబాద్‌లో అసలేం జరుగుతోంది?

హుజూరాబాద్‌లో తెరాసతోపాటు భాజపా శ్రేణులు నువ్వా-నేనా అనేలా నియోజకవర్గ అభివృద్ధిపై సవాళ్లు ప్రతి సవాళ్లు విసుకుంటున్నారు. దాదాపు పది నెలల కిందట జరిగిన ఉప ఎన్నికలతో ఇక్కడి హోరాహోరీ తీరు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపును అందుకుంది. ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ విజయం సాధించడంతో అధికార తెరాస కూడా తమ పార్టీ ప్రాబల్యాన్ని నిలుపుకొనేలా పలు కార్యక్రమాలతో ఇన్నాళ్లుగా జోరుని చూపిస్తోంది. ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నుంచి తెరాసకు మారి ఎమ్మెల్సీ పదవిని అందుకున్న పాడి కౌశిక్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూనే నియోజకవర్గంలో పర్యటిస్తూ తన మార్క్‌ చూపిస్తున్నారు.

గడిచిన వారం రోజులుగా ఇటు తెరాస, అటు భాజపా నియోజకవర్గ అభివృద్ధి విషయమై సవాళ్ల జోరుని చూపిస్తున్నాయి. తెరాస అందిస్తున్న ప్రగతే నియోజకవర్గంలో కనిపిస్తోందని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొంటూనే.. తనతో నియోజకవర్గ అభివృద్ధి విషయమై బహిరంగ చర్చకు ఈటల రావాలని డిమాండ్‌ చేశారు. ఇందుకు ప్రతిగా స్పందించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌.. హుజూరాబాద్‌లో కళ్లకు కనిపిస్తున్న అభివృద్ధి అంతా తాను చేసిందేనని, తన రాజీనామా వల్లే ప్రగతి ఫలాలు అందాయనేలా తన వాణిని వినిపించారు. ప్రజలకే తాను జవాబుదారినని విలువలు లేని నాయకులను పట్టించుకోనని తనదైన తరహాలో ప్రత్యర్థి నేత సవాలుని తిప్పికొట్టారు.

పోటాపోటీగా ఫ్లెక్సీలు..

మొదట తెరాస ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి చర్చకు తాను సిద్ధమేనని తేదీని ఖరారు చేస్తూ.. ఎమ్మెల్యేను చర్చకు రావాలనేలా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయించడం చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమక్షంలో స్థానిక అంబేడ్కర్‌ కూడలి వద్దకు 5వ తేదీన(నేడు) ఉదయం రావడానికి తెరాస శ్రేణులంతా సిద్ధమేనని అందులో పేర్కొనడంతో ఇది రాజకీయ దుమారాన్ని రేపింది. దీనికి స్పందించిన భాజపా నాయకులు కూడా ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి వైఖరిని తెలియజెప్పేలా పెద్ద ఫ్లెక్సీని పట్టణంలో ఏర్పాటు చేశారు. అభివృద్ధిపై చర్చకు భాజపా సిద్ధమని తమ నేత ఈటల రాజేందర్‌తో చర్చకు కూర్చునే అనుభవం ప్రత్యర్థులకు లేదనేలా ఫ్లెక్సీలో ఎదుటి పార్టీ నేతల వైఖరిని ఖండించేలా వ్యాఖ్యల్ని రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో బహిరంగ చర్చ కోసం కౌశిక్‌రెడ్డి అంబేడ్కర్‌ చౌరస్తాకు చేరుకోవడం.. ఆ తర్వాత భాజపా శ్రేణులు కూడా అక్కడికి వెళ్లడంతో ఉద్రిక్తత ఏర్పడింది.


మరిన్ని

ap-districts
ts-districts