Thailand: థాయిలాండ్‌ నైట్‌ క్లబ్‌లో అగ్నిప్రమాదం.. 13 మంది సజీవ దహనం..!

ఇంటర్నెట్‌డెస్క్‌: థాయిలాండ్‌లోని ఓ నైట్‌ క్లబ్‌లో శుక్రవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 13 మంది సజీవ దహనం కాగా.. 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆగ్నేయ థాయిలాండ్‌ సత్తాహిప్‌ జిల్లాలోని మౌంటేన్‌ బీ నైట్‌స్పాట్‌ క్లబ్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. గోడలపై ఉన్న పదార్థానికి మండే  స్వభావం ఉండటంతో ఈ ప్రమాదం తీవ్రత వేగంగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. 

దాదాపు 4,800 చదరపు మీటర్ల వైశాల్యం ఉన్న ఈ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో  మంటలను ఆర్పేందుకు సిబ్బంది దాదాపు రెండు గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది. బాత్రూమ్‌ల వద్ద చిక్కుకున్నవారు ఈ ప్రమాదంలో ఎక్కువగా మరణించినట్లు తెలిసింది. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. బాధితులంతా థాయ్‌ జాతీయులే అయి ఉంటారని భావిస్తున్నారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదు.

గతంలో కూడా థాయిలాండ్‌ నైట్‌ క్లబ్‌ల్లో ఘోర అగ్నిప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. 2009లో బ్యాంకాక్‌లో జరిగిన ప్రమాదంలో దాదాపు 60 మంది ప్రాణాలు కోల్పోయారు.


మరిన్ని

ap-districts
ts-districts