Love: భీకర యుద్ధం వేళ.. రష్యా అబ్బాయి-ఉక్రెయిన్‌ అమ్మాయి వివాహం

విదేశీ జంట వివాహానికి వేదికైన భారత్‌

కీవ్‌: రష్యా (Russia) జరుపుతోన్న భీకర యుద్ధంతో ఉక్రెయిన్‌ పౌరులు (Ukraine Crisis) వణికిపోతున్నారు. రష్యా సేనలు చేస్తోన్న అకృత్యాలకు చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వేల మంది పిట్టల్లా రాలిపోతున్నారు. ఇటువంటి భయానక సమయంలో ఉక్రెయిన్‌ వాసులు ప్రాణాలు చేతపట్టుకొని ఆశ్రయం కోసం పొరుగు దేశాలకు పరుగులు పెడుతున్నారు. ఇలా ఇరుదేశాల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోన్న వేళ.. ఇవేమీ తమ జీవితానికి అడ్డుకావంటూ శత్రుదేశాలకు చెందిన ఓ ప్రేమజంట (Love Couple) ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌ అమ్మాయి మెడలో రష్యా అబ్బాయి తాళి కట్టి వివాహం చేసుకోగా.. ఇందుకు భారత్‌లోని ధర్మశాల (Dharamshala) వేదిక కావడం విశేషం.

రష్యాకు చెందిన సెర్గీ నొవికొవ్‌ ఇజ్రాయిల్‌లో స్థిరపడ్డాడు. అయితే, అతను ఉక్రెయిన్‌కు చెందిన ఎలోనా బ్రమోకాతో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. గత ఏడాది కాలంగా హిమాచల్‌ ప్రదేశ్‌లోని ధర్మశాలలో నివాసముంటున్నారు. ఇదే సమయంలో ఇరు దేశాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అయినా వివాహం చేసుకునేందుకు ఇరువురు సిద్ధంకాగా.. ధర్మశాలే అందుకు వేదికయ్యింది. దీంతో ఖరోటా గ్రామంలోని రాధాకృష్ణ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆగస్టు 2న వీరి వివాహం జరిగింది. పెళ్లికుమారుడు కుర్తా పైజామా వేసుకోగా.. ఉక్రెయిన్‌ వధువు మాత్రం లెహెంగా చోళీ, ఎరుపురంగు దుపట్ట వేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచారు.

అయితే, హిందూ సంప్రదాయం ప్రకారం రామన్‌ శర్మ అనే స్థానిక అర్చకుడు ఈ వివాహాన్ని జరిపించారు. ఈ సమయంలో అర్చకుడు మంత్రాలను పఠిస్తుంటే.. వధూవరులకు వాటి భావం అర్థమయ్యేలా ఓ ట్రాన్స్‌లేటర్‌ వారికి సహకరించారు. ఈ వివాహానికి స్థానికులతో పాటు విదేశీ పర్యాటకులు అతిథులుగా హాజరుకాగా.. స్థానిక వంటకాలతో విందును ఏర్పాటు చేశారు. భీకర యుద్ధంతో రెండు దేశాలు శత్రువులుగా మారినప్పటికీ ప్రేమ మాత్రం దేన్నైనా జయిస్తుందని చెప్పడానికి నొవికోవ్‌, బ్రమోకా వివాహం నిదర్శనమని పెళ్లికి హాజరైనవారు చెప్పుకొచ్చారు.


మరిన్ని

ap-districts
ts-districts