Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. కాంగ్రెస్‌కు మరో షాక్‌.. దాసోజు శ్రవణ్‌ రాజీనామా?

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించి రెండు రోజులు గడవకముందే పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా కాసేపట్లో  మీడియా ముందు ప్రకటించనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా పీసీసీ వైఖరి పట్ల శ్రవణ్‌ అసంతృప్తిగా ఉన్నారు.

2. క్యాసినో బిజినెస్‌ చేస్తా.. అందులో తప్పేముంది?: చీకోటి ప్రవీణ్‌

తనపై కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని క్యాసినో నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్‌ అన్నారు. సోషల్‌ మీడియాలో తన పేరుతో ఫేక్‌ అకౌంట్స్‌ క్రియేట్‌ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. నాలుగో రోజు ఈడీ విచారణకు హాజరైన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తనకు ప్రాణహాణి ఉందని.. రక్షణ కల్పించాలంటూ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశానని చెప్పారు.


Video: జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం పొందే వారి షాక్‌!


3. మా వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదు: రేవంత్‌రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. వెంకట్‌రెడ్డికి, తనకు మధ్య ఉద్దేశపూర్వకంగానే కొందరు అగాథం సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ద్రోహం చేసిన రాజగోపాల్‌రెడ్డి.. పార్టీ కోసమే పని చేసే వెంకటరెడ్డి.. ఇద్దరూ వేరు అని అన్నారు. అపోహలతో మా వెంకన్న మనస్తాపం చెందాల్సిన అవసరం లేదంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు.

4. పార్టీ నుంచి నన్ను కూడా వెళ్లగొట్టేందుకు చూస్తున్నారు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

పార్టీ నుంచి తనను కూడా వెళ్లగొట్టేందుకు చూస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాజా రాజకీయ పరిణామాలపై స్పందించారు. దాసోజు శ్రవణ్‌ లాంటి మేధావిని పార్టీ నుంచి వెళ్లగొడుతున్నారని మండిపడ్డారు. తనను కూడా పార్టీ నుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ వాళ్లని బయటకు పంపించి తెదేపా వాళ్లని తీసుకొచ్చి పోటీ చేయించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

5. ఎనిమిదిలో ఒకరికి లాంగ్‌ కొవిడ్‌ సమస్యలు.. : ది లాన్సెట్‌

యావత్‌ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ (Coronavirus) మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ బాధితులపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఎనిమిది మందిలో కనీసం ఒకరు లాంగ్‌ కొవిడ్‌ (Long Covid) లక్షణాలతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. నెదర్లాండ్‌ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనం ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’ (The Lancet)లో ప్రచురితమైంది.


Video: అనుకున్నదాని కంటే ఎక్కువే వడ్డించిన ఆర్‌బీఐ


6. సూర్యకుమార్‌ యాదవ్‌.. నయా ‘360’ డిగ్రీల ప్లేయర్‌: స్కాట్ స్టైరిస్‌

విండీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో అద్భుత అర్ధశతకంతో (76) భారత్‌ను గెలిపించిన సూర్యకుమార్‌ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అలానే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో రెండో ర్యాంకుకు ఎగబాకాడు. 31 ఏళ్ల వయసులో ఆలస్యంగా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న సూర్యకుమార్‌ బ్యాటింగ్‌లో చెలరేగుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోదగిన ప్లేయర్‌గా ఎదిగాడు. ఈ క్రమంలో పొట్టి ప్రపంచకప్‌లో సూర్యకుమార్‌ కీలక బ్యాటర్‌గా మారతాడని న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్‌ అభిప్రాయపడ్డాడు. 

7. భారత్‌తో లీగల్‌ ఫైట్‌.. ట్విటర్‌ నాకు చెప్పలేదు: ఎలాన్‌ మస్క్‌

ట్విటర్‌ (Twitter) కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. తాజాగా ఆ సంస్థతో కోర్టు వివాదాన్ని ఎదుర్కొంటున్నారు. తమ వేదికపై నకిలీ ఖాతాల వివరాలు ఇవ్వడంలో ట్విటర్‌ విఫలమవడంతోనే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన మస్క్‌.. తాజాగా మరిన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రభుత్వంపై ట్విటర్ వేసిన ‘ప్రమాదకర’ వ్యాజ్యాన్ని ఆ సంస్థ ఒప్పందంలో బయటపెట్టలేదని ఆరోపించారు. ఈ మేరకు తన కౌంటర్‌ దావాలో పేర్కొన్నారు.

8. బారికేడ్లు దూకి ప్రియాంక గాంధీ ధర్నా.. బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు

ధరల పెంపు, నిత్యావసర వస్తువులపై జీఎస్‌టీ, నిరుద్యోగం వంటి పలు అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం చేపట్టిన దేశవ్యాప్త నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతిభవన్‌, ప్రధాని కార్యాలయాన్ని ముట్టడించేందుకు హస్తం పార్టీ ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Video : బ్రిటన్ ప్రధాని ఎన్నికల్లో కీలక పరిణామం


9. నాన్సీ పెలోసీపై చైనా ఆంక్షలు..!

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీపై చైనా చర్యలు చేపట్టింది. తైవాన్‌లో పర్యటించినందుకుగానూ ఆమెపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. అవి ఏ రకమైన ఆంక్షలో మాత్రం కచ్చితంగా వెల్లడించలేదు. ఈ మేరకు చైనా విదేశాంగశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. పెలోసీ తైవాన్ పర్యటనపై తీవ్ర అభ్యంతరం, నిరసన వ్యక్తం చేసింది. 

10. అప్పుడు ఐశ్వర్య, సచిన్‌.. ఇప్పుడు సుస్మితా సేన్‌, అమిత్‌ షా..!

మాజీ మిస్‌ యూనివర్స్‌ సుస్మితా సేన్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా.. ఈ కాంబినేషన్ ఏంటని ఆలోచిస్తున్నారా..? ఈ విషయం తెలియాలంటే ‘మ్యాంగోమ్యాన్‌’ హాజీ కలీముల్లా ఖాన్‌ గురించి తెలియాలి. ఆయన కింగ్‌ ఆఫ్ ఫ్రూట్స్ మామిడిలో కొత్త వంగడాలు తీసుకువస్తూ.. మామిడి ప్రియులకు కొత్త రుచులు అందిస్తుంటారు. తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చిన హైబ్రిడ్ రకాలకు పెట్టుకున్నపేర్లే ఇవి. 


మరిన్ని

ap-districts
ts-districts