ఎడ్‌టెక్‌ కంపెనీల్లో కొనసాగుతున్న లేఆఫ్‌లు.. వేదాంతు, లీడ్‌లో చెరో 100 మందికి ఉద్వాసన!

ఇంటర్నెట్‌ డెస్క్‌‌: ఎడ్‌టెక్‌ (Edtech) కంపెనీల్లో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. స్కూళ్లు, కాలేజీలు తెరవడంతో పాటు భౌతిక ట్యూషన్‌ సెంటర్లు ఏర్పాటు కావడంతో కొవిడ్‌ సమయంలో ఆదరణ సంపాదించిన ఈ కంపెనీలకు ఆదరణ తగ్గింది. దీంతో ఆయా కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీలైన వేదాంతు, లీడ్‌ (లీడ్‌ స్కూల్‌) చెరో వంద మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి.

ఈ ఏడాది మే నెలలో 624 మంది ఉద్యోగులను తొలగించిన వేదాంతు.. తాజా ఉద్వాసనతో మొత్తం 724 మంది ఉద్యోగులను తొలగించినట్లయ్యింది. లేఆఫ్‌లు వేసిన ఉద్యోగులకు 2 నెలల వేతనాన్ని ఈ కంపెనీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మే నెలకు ముందు ఈ కంపెనీలో 5,900 మంది ఉద్యోగులు పనిచేసేవారు. మరో ఎడ్‌టెక్‌ కంపెనీ లీడ్‌ ఏకంగా 40 శాతం సిబ్బందిని తగ్గించుకున్నట్లు వార్తలు రాగా.. దాన్ని కంపెనీ ఖండించింది. మొత్తం 2,200 మంది ఉద్యోగుల్లో 100 మంది మాత్రమే తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ ఏర్కొంది. పనితీరును సమీక్షించే ప్రక్రియ గత నెల పూర్తయ్యిందని, ఏటా ఇలా జరగడం సాధారణమని కంపెనీ పేర్కొంది. ఈ రెండు కంపెనీలే కాదు అన్‌ అకాడమీ, బైజుస్ సైతం ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం గమనార్హం.


మరిన్ని

ap-districts
ts-districts