‘భేటీ బచావో భేటీ పడావో’ ప్రచారానికే 78% నిధులా?’.. తప్పుబట్టిన పార్లమెంటరీ ప్యానెల్‌

దిల్లీ: ఆడ పిల్లల కోసం కేంద్రం అమలు చేస్తున్న ‘భేటీ బచావో భేటీ పడావో’ పథకం అమలు తీరును పార్లమెంటరీ ప్యానెల్‌ తప్పుబట్టింది. 2016-19 మధ్య కాలంలో ఈ పథకం అమలు కోసం నిర్దేశించిన మొత్తం రూ.446.72 కోట్లలో 78 శాతం మీడియాలో ప్రచారానికే వినియోగించడాన్ని ఆక్షేపించింది. ప్రచారానికి చేసే ఖర్చు విషయంలో ప్రభుత్వం పునః పరిశీలన చేసుకోవాలని సూచించింది. ప్రచారానికి వినియోగించడం కంటే ఆడ పిల్లల చదువు, ఆరోగ్యం కోసం ఖర్చు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సూచించింది. ఈ మేరకు మహిళా సాధికారతపై ఏర్పాటైన కమిటీ.. ఈ పథకం అమలుకు సంబంధించి పలు సూచనలు చేస్తూ తన ఆరో నివేదికను లోక్‌సభకు సమర్పించింది.

ఆడ పిల్లల రక్షణ, వారి చదువుకోసం ఉద్దేశించిన ఈ పథకం అసలు లక్ష్యాలు నెరవేరలేదని కమిటీ తప్పుబట్టింది. కానీ, ఆడ పిల్లల ఉన్నతి కోసం పాటుపడుతున్నామన్న దృష్టిని ఆకర్షించడానికి మాత్రం ఈ పథకం ఉపయోగపడిందని ప్యానెల్‌ తప్పుబట్టింది. పథకం అమల్లో భాగంగా ఆడ పిల్లల ఆరోగ్యం, చదువుపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. వెనుకబడిన ప్రాంతాల్లో స్త్రీ నిష్పత్తిని పెంచడానికి, ఆడ పిల్లల చదువు కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న గొప్ప పథకమని కొనియాడింది. అలాంటి పథకాన్ని కేవలం ప్రచారం కోసం కాకుండా అసలు లక్ష్యం కోసం పనిచేయాలని కేంద్రానికి సూచించింది. జిల్లా స్థాయిలో పథకం అమలు తీరుపై త్రైమాసికానికోసారి సమీక్ష జరగాల్సి ఉండగా.. అలాంటివేమీ జరగడం లేదని ప్యానెల్‌ తప్పుబట్టింది. ఈ పథకం అమలును పర్యవేక్షిస్తున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని సూచించింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని