Dasoju sravan: బానిసగా బతకలేను.. అందుకే కాంగ్రెస్‌కు రాజీనామా: దాసోజు శ్రవణ్‌

హైదరాబాద్‌: రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, బానిస బతుకు బతకడం ఇష్టంలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు దాసోజు శ్రవణ్‌ ప్రకటించారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రవణ్‌ మాట్లాడారు.‘‘సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారనే కృతజ్ఞతతో.. 2013లో జరిగిన జైపూర్‌ చింతన్‌ శిబిర్‌లో రాహుల్‌ ప్రసంగం విని ఉత్తేజితుడై 2014లో కాంగ్రెస్‌ పార్టీలో చేరా. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఏఐసీసీ అధికార ప్రతినిధి స్థాయికి చేరా. పార్టీకి క్రియాశీలకంగా అహోరాత్రులు ఎంతో కష్టపడ్డా. కానీ, రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత.. కాంగ్రెస్‌ పార్టీలో కులం, ధనం చూసి ప్రాధాన్యత ఇస్తున్నారు. రేవంత్‌ నాయకత్వంలో అరాచక పరిస్థితులు నన్ను కలచివేశాయి’’ అని శ్రవణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

టీపీసీసీ ఒక మాఫియాలా మారింది..

‘‘సోనియా, రాహుల్‌ చెప్పిన సిద్ధాంతాలకు విరుద్ధంగా తెలంగాణలో జరుగుతోంది. 3.5 కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి సోనియా తెలంగాణ ఇస్తే.. ఆ సిద్ధాంతాలను తుంగలో తొక్కి రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారు. రేవంత్‌ తప్పులను సరి చేయాల్సిన.. ఏఐసీసీ ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌, వ్యూహకర్త సునీల్‌ కూడా పార్టీని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ప్రశ్నించిన వారిపై తప్పుడు నివేదికలిస్తూ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి నామరూపాల్లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది.. ఇది చాలా దుర్మార్గం. రాజకీయాలు.. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా ఉండాలనేది కాంగ్రెస్‌ సిద్ధాంతం. కానీ, తెలంగాణ కాంగ్రెస్‌లో అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఏఐసీసీ ముఖ్య నాయకులు కూడా దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేయడంలేదు.

ఇప్పటికీ చిరంజీవి నా అన్నయ్యే..

రాహుల్‌, కేసీ వేణుగోపాల్‌ లాంటి నేతలకు కూడా రాష్ట్రంలో పార్టీ తప్పిదాలు చెప్పా. ఇది టికెట్ సమస్య కాదు. సామాజిక న్యాయానికి భిన్నంగా అగ్రవర్ణ కుల వ్యవస్థ కొనసాగుతోంది. ఎక్కడ ఉన్నా సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తా. రేవంత్‌రెడ్డి వ్యవహారశైలి మారితే పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. భాజపాతో ఇంత వరకు చర్చలు జరపలేదు. ఈటల రాజేందర్‌ దిల్లీ తీసుకెళ్లిన జాబితాలో నా పేరు లేదు. కేసీఆర్‌ లాంటి లక్షణాలు రేవంత్‌రెడ్డిలో కూడా ఉన్నాయి. 2009లో ప్రజారాజ్యం వదిలేసినప్పుడు నేను తిట్టి బయటకు రాలేదు. ఇప్పటికీ చిరంజీవి నా అన్నయ్యే.

నా ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకే రాజీనామా..

కొప్పుల రాజు, జైరామ్‌ రమేశ్‌ లాంటి వారు తెలంగాణ బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కానీ, ఇవాళ వారు కూడా స్పందించలేని పరిస్థితి ఏర్పడింది. పార్టీలో బీసీ, ఎస్టీలను బలహీనపరుస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి తన వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకునేందుకు నలుగురైదుగురు నాయకులను నియమించి పార్టీని నాశనం చేస్తున్నారు. ఏఐసీసీ నుంచి ఒక ప్రాంఛైజీ తెచ్చుకున్నట్టు వ్యవహరిస్తున్నారు. టీపీసీసీకి గుత్తేదారు అయినట్టు నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఆయన ఎవరికీ అందుబాటులో ఉండరు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక మాఫియా తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీలో చేరింది బానిసలుగా బతికేందుకు కాదు. ఏడాది కాలంగా ఎన్నో బాధలు తట్టుకున్నా. నా ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నా’’ అని దాసోజు శ్రవణ్ ప్రకటించారు.

ఫలించని కాంగ్రెస్‌ నేతల బుజ్జగింపులు..

శ్రవణ్ రాజీనామా చేయనున్నారనే విషయం తెలుసుకుని బుజ్జగించేందుకు సీనియర్‌ నేతలు కోదండరెడ్డి, మహేశ్‌ కుమార్‌గౌడ్‌ ఆయన నివాసానికి వెళ్లారు. పార్టీ మార్పుపై పునరాలోచన చేసి ఉపసంహరించుకోవాలని సూచించారు. పార్టీలో చేరికల అంశంపై తనకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని ఈ సందర్భంగా వారితో శ్రవణ్‌ అన్నట్టు తెలిసింది. కాంగ్రెస్‌ నేతలు ఎంత బుజ్జగించినప్పటికీ శ్రవణ్‌ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని