Pakistan: పాకిస్థాన్‌లో.. రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితే

ఆందోళన వ్యక్తం చేసిన పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రి

కరాచీ: పాకిస్థాన్‌ (Pakistan) ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వచ్చే మూడు నెలలపాటు దిగుమతులపై (Imports) ఆంక్షలు కొనసాగించేందుకే ఆ దేశం మొగ్గుచూపుతోంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో దేశం మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోందని పాకిస్థాన్‌ ఆర్థిక మంత్రి ముఫ్తాఫ్‌ ఇస్మాయిల్‌ హెచ్చరించారు. పాకిస్థాన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ పరిస్థితి (Economic Crisis) నుంచి బయటపడే మార్గాలను అన్వేషిస్తున్నామని అన్నారు.

‘ఇమ్రాన్‌ ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీక్‌ఏ ఇన్సాఫ్‌ (పీటీఐ) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రస్తుత ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతకుముందు పీఎంఎల్‌-ఎన్‌ ప్రభుత్వం సమయంలో దేశ లోటు బడ్జెట్‌ 1600 బిలియన్‌ డాలర్లు ఉండగా.. నాలుగేళ్ల పీటీఐ ప్రభుత్వం పాలనలో అది 3500 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఇటువంటి కరెంట్‌ ఖాతా లోటుతో కూడిన ఏ దేశం కూడా వృద్ధి చెందదు, స్థిరంగా ఉండదు’ అని పాకిస్థాన్‌ ఆర్థికమంత్రి ముఫ్తాఫ్‌ ఇస్మాయిల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఇటువంటి సమయంలో లోటు బడ్జెట్‌ను పెంచి, రుణాలను 80శాతానికి పెంచితే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందుకే ఈ మూడు నెలలు దిగుమతులను అనుమతించబోం. ఈ వ్యవధిలో నూతన విధానాన్ని రూపొందిస్తాం. వృద్ధి రేటు కొంతమేరకు క్షీణిస్తుందని తెలిసినప్పటికీ.. మన చేతిలో ఎటువంటి ప్రత్యామ్నాయాలు లేవు’ అని ఆర్థిక మంత్రి చెప్పినట్లు డాన్‌ వార్తాపత్రిక పేర్కొంది.

ఇదిలాఉంటే, గత ఆర్థిక సంవత్సరంలో పాకిస్థాన్‌ దిగుమతుల విలువ 80 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, ఎగుమతులు మాత్రం కేవలం 31బిలియన్‌ డాలర్లకే పరిమితమైంది. ఎగవేత నుంచి దేశాన్ని రక్షించేందుకు స్వల్పకాలిక చర్యలు తీసుకుంటున్నప్పటికీ దీర్ఘ కాలంలో ఇవి మంచివి కావని తెలుస్తోందని ఆ దేశ ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం సరైన దారిలోనే నడుస్తున్నప్పటికీ రానున్న రోజుల్లో గడ్డు రోజులు వచ్చే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి షరీఫ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని