Voting: భారత్‌లో తప్పనిసరి ఓటింగ్‌.. కేంద్ర ప్రభుత్వం ఏమందంటే..?

దిల్లీ: దేశంలో తప్పనిసరి ఓటింగ్‌పై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. భారత్‌లో ఈ విధానం ఆచరణలో సాధ్యం కాదని స్పష్టం చేసింది. దీంతో తప్పనిసరి ఓటింగ్‌ కోసం ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్‌ బిల్లును సభ్యులు ఉపసంహరించుకున్నారు. భారత్‌లో నిర్బంధ ఓటింగ్‌కు సంబంధించిన ప్రైవేటు మెంబర్‌ బిల్లును భాజపాకు చెందిన జనార్ధన్‌ సింగ్‌ సిగ్రివాల్‌ 2019లో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీని ద్వారా నల్లధనానికి అడ్డుకట్ట వేయడంతోపాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుందని అభిప్రాయపడ్డారు. అయితే, దీనిపై తాజాగా స్పందించిన కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి ఎస్‌పీ సింగ్‌ బఘేల్‌.. నిర్బంధ ఓటింగ్‌పై సభ్యుడి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నప్పటికీ ఓటు వేయనందుకు పౌరులను శిక్షించడం ఆచరణలో సాధ్యం కాదన్నారు. గత మూడేళ్లుగా ఈ బిల్లుపై చర్చ జరిగినప్పటికీ కొంతమంది సభ్యులు ఇందుకు మద్దతు పలుకగా మరికొందరు వ్యతిరేకించారని చెప్పారు. అంతేకాకుండా మార్చి 2015లో ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్‌ ఇచ్చిన నివేదిక కూడా నిర్బంధ ఓటింగ్‌ను వ్యతిరేకించిందని.. ఈ విధానం అమలు ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు.

గత లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్‌ 66.11శాతమే ఇప్పటివరకు గరిష్ఠం. 2014తో పోలిస్తే 1.16శాతం పెరిగింది. ఇటువంటి నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకోని వారి పేర్ల జాబితాను రూపొందించాలని ఈ ప్రైవేటు బిల్లులో ప్రతిపాదించారు. దీనిపై స్పందించిన కేంద్ర సహాయ మంత్రి.. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమేనన్నారు. ఓటింగ్‌ అనేది పౌరుల హక్కు అయినప్పటికీ అది నిర్బంధ బాధ్యత కాదని.. లా కమిషన్‌ కూడా ఇందుకు సానుకూలంగా లేదని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2004లో బీఎస్‌ రావత్‌, 2009లో జేపీ అగర్వాల్‌లు పార్లమెంటులో ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టినప్పటికీ అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు. తర్వాత 2014లోనూ సింగ్రివాల్‌ కంపల్సరీ ఓటింగ్‌ బిల్లును ప్రవేశపెట్టారు.

ఇదిలాఉంటే, దేశంలో తప్పనిసరి ఓటింగ్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు ఈ ఏడాది ఆరంభంలోనూ పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ప్రయోజనాలు, పథకాలు అందుకునేందుకు వీలుగా ఓటింగ్‌ సర్టిఫికేట్‌ ఇచ్చే ప్రణాళిక కూడా ప్రభుత్వం వద్ద లేదని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని