Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. నీతిఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్‌

దిల్లీలో ఆదివారం జరిగే నీతిఆయోగ్‌ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నానని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. చాలా బాధాకరమే అయినప్పటికీ ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించినట్టు చెప్పారు. తమ  నిరసనను బహిరంగ లేఖ ద్వారా నేరుగా ప్రధానికి తెలియజేస్తున్నామని వెల్లడించారు.

2. అలర్ట్‌.. రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

తెలంగాణలో రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇవాళ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడవొచ్చని వాతావరణ కేంద్ర సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు. రానున్న మూడు రోజులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. ఈరోజు రుతుపవన ద్రోణి జైసల్మేర్‌, కోట, సాగర్‌, పెండ్రా రోడ్ గుండా బాలాసోర్‌ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళ్తుందని పేర్కొన్నారు.

3. చేనేత రంగంపై మోదీ సర్కారు చిన్నచూపు: కేటీఆర్‌

తెలంగాణ చేనేత రంగానికి కేంద్రం చేసిందేమీ లేదని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత రంగానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చేపట్టాల్సిన చర్యలపైన కేంద్ర చేనేత, ఔళి శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌కు ఆయన లేఖ రాశారు. వ్యవసాయం తర్వాత అత్యధిక మంది దేశ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగంపై మోదీ సర్కారు చిన్నచూపు చూపిస్తోందని లేఖలో ఎండగట్టారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నేతన్నల కడుపు కొడుతుందని మండిపడ్డారు.


Video: మీరాబాయి చానుకు థోర్ స్టార్‌ క్రిస్ హెమ్స్‌వర్త్ ప్రశంసలు


4. కాంగ్రెస్‌ కార్యకర్తలు కష్టపడి.. రేవంత్‌ను సీఎం చేయాలా?: రాజగోపాల్‌రెడ్డి

తెరాసలోకి 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వెళ్లినప్పుడు ఎవరూ మాట్లాడలేదని.. వారిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. దిల్లీలో రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో సీఎల్పీ నాయకుడికి సహకరించానని తెలిపారు. ఈ మూడున్నరేళ్లుగా మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో పోరాడానని చెప్పారు. 2014 తర్వాత పార్టీ పదవులు ఇవ్వకపోయినా కష్టపడ్డానన్నారు.

5. 40శాతం మందికే పని.. నిరుద్యోగంపై ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు

దేశంలో నిరుద్యోగ సమస్యపై మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు చైనాపై ఆధారపడిన ప్రపంచ దేశాలు.. ఇప్పుడు భారత్‌వైపు చూస్తున్నాయని, ఆ ఫలాలు అందుకోవాలంటే నిరుద్యోగ సమస్యను అధిగమించాల్సి ఉందన్నారు. అందుకోసం తయారీ రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. దేశంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వారిలో కేవలం 40 శాతం మందికే పని లభిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.

6. 7 రాష్ట్రాల్లో 10% దాటిన పాజిటివిటీ రేటు.. కేంద్రం అలర్ట్‌

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉన్నప్పటికీ.. కొన్ని రాష్ట్రాల్లో గత కొన్ని రోజలుగా కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఏడు రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు 10శాతం దాటడం కలవరపెడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్‌ వ్యాప్తి కట్టడికి త్వరితగతిన చర్యలు చేపట్టాలంటూ ఆయా రాష్ట్రాలను సూచించింది.

7. ఉచిత రేషన్ సరే.. ఆ రూ.10 లక్షల కోట్ల మాటేంటి..?

పలు అంశాల్లో సొంతపార్టీపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతుంటారు భాజపా నేత వరుణ్ గాంధీ. 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ అందించిన ప్రభుత్వానికి తప్పక అభినందనలు తెలపాలంటూ భాజపా ఎంపీ ఒకరు పార్లమెంట్‌లో పేర్కొన్న నేపథ్యంలో..ఈయన ట్విటర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్ల కాలంలో ప్రభుత్వం మాఫీ చేసిన మొండి బకాయిల మొత్తాన్ని పోల్చుతూ ట్వీట్ చేశారు.


Video : సైబర్ నేరాలపై.. యూట్యూట్ ద్వారా ఎస్‌ఐ అవగాహన


8. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో కష్టతరమైన పాత్ర రామ్‌చరణ్‌దే: పరుచూరి గోపాలకృష్ణ

ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో (RRR) రామ్‌చరణ్‌ (RamCharan), ఎన్టీఆర్‌ (NTR) తమ నటనతో అదరగొట్టేశారని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopalakrishna) అన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో తారక్‌ పాత్ర చిన్నగా ఉందంటూ ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందనలపై పరుచూరి స్పందించారు. పాత్ర నిడివి ఎంత సేపు ఉందనేది కాదని, అది ప్రేక్షకుల్లో ఎలాంటి ప్రభావాన్ని సృష్టించిందనేది చూడాలని ఆయన అన్నారు.

9. జులైలోనూ తగ్గిన ఓలా విక్రయాలు.. ఒకినావా దూకుడు హీరో బ్రేక్‌!

ఎలక్ట్రిక్‌ వాహన విక్రయాల్లో సంచలనానికి మారుపేరుగా నిలిచిన ఓలా ఎలక్ట్రిక్‌ విక్రయాలు మరోసారి క్షీణించాయి. జూన్‌లో 5,874 వాహనాలు విక్రయించిన ఓలా సంస్థ.. జులైలో కేవలం 3,426 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గత నెలతో పోలిస్తే విక్రయాలు 42 శాతం తగ్గాయి. కొన్ని నెలలుగా విక్రయాల పరంగా అగ్రస్థానంలో నిలిచిన ఒకినావా ఆటో టెక్‌కు దూకుడుకు హీరో ఎలక్ట్రిక్‌ బ్రేకులు వేసింది.

10. ఉపరాష్ట్రపతి వేతనం ఎంతో తెలుసా?

దేశ తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఈ పదవికి నేడు ఓటింగ్ జరుగుతోంది. ఎన్డీయే కూటమి తరఫున  పశ్చిమ బెంగాల్‌ మాజీ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ ఆళ్వా పోటీలో ఉన్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగియనుండగా.. రాత్రికల్లా ఫలితం వెల్లడికానుంది. ఉభయసభల్లో ఎన్డీయే, దాని మిత్రపక్షాలకు స్పష్టమైన బలమున్నందున అధికారిక కూటమి అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖఢ్‌ గెలుపు దాదాపు లాంఛనమే.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని