Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన నీతి ఆయోగ్‌

నీతి ఆయోగ్‌ నిరర్థక సంస్థగా మారిందని, అందుకు నిరసనగా.. దిల్లీలో రేపు జరగబోయే ఆ సంస్థ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ... నీతి ఆయోగ్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ఒక భజన మండలిగా మారిందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

2. ప్రధాని మోదీతో తెదేపా అధినేత చంద్రబాబు భేటీ

చాలా కాలం తర్వాత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, తెదేపా అధినేత చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. వీరిద్దరూ ఐదు నిమిషాల పాటు ప్రత్యేకంగా చర్చించుకున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ దిల్లీలో జరిగిన ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత.. మోదీ, చంద్రబాబు మాట్లాడుకోవడం చర్చనీయాంశంగా మారింది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత మోదీ, చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమైన సందర్భాలు లేవు.


Video: వ్యక్తి పొట్టలో స్టీల్‌ గ్లాస్‌.. గంటపాటు శ్రమించి బయటకు తీసిన వైద్యులు


3. ఆవేశంలో నోరు జారా.. ఎంపీ కోమటిరెడ్డికి సారీ చెబుతున్నా: అద్దంకి దయాకర్‌

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆ పార్టీ తుంగతుర్తి నేత అద్దంకి దయాకర్‌ క్షమాపణలు చెప్పారు. నిన్న చండూరు బహిరంగ సభలో ఏదో ఆవేశంలో నోరు జారానని, ఎంపీకి వ్యక్తిగతంగా క్షమాపణ చెబుతున్నట్టు అద్దంకి దయాకర్‌ వివరించారు. తన వ్యాఖ్యల వల్ల బాధపడుతున్న కోమటిరెడ్డి అభిమానులు క్షమించాలన్న దయాకర్‌.. పార్టీకి నష్టం చేయాలని భావించలేదన్నారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చే లోపే షోకాజ్‌ నోటీసు ఇచ్చారన్న అద్దంకి మరోసారి తప్పు జరగకుండా చూసుకుంటానని పేర్కొన్నారు.

4. ముఖాముఖిగా మోదీని నిలదీస్తేనే కేసీఆర్‌ను ప్రజలు నమ్ముతారు: రేవంత్‌

ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయడానికి, నాయకులను వేధించడానికి కేంద్రంలో భాజపా, తెలంగాణలో తెరాస సర్కారు.. ప్రభుత్వ సంస్థలను వినియోగించుకుంటున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ ఇద్దరూ ఒక్కటేనని విమర్శించారు. దేశ భద్రతకోసం వినియోగించాల్సిన సంస్థలను రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి ఉపయోగించడం దారుణమన్నారు.

5. ఉపరాష్ట్రపతి ఎన్నికలో జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ విజయం

ఊహించినట్లుగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో(Vice President Election) అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌(Jagdeep Dhankhar) విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వా(Margaret Alva)పై 346 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. మొత్తం 725 ఓట్లు పోలవ్వగా.. ధన్‌ఖడ్‌కు 528, మార్గరెట్ ఆళ్వాకు 182 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. అంతకుముందు పార్లమెంటు భవనంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు నిర్వహించిన పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది.


Video: యోగాసనలతోనూ అపెండిసైటిస్‌ బాధ నుంచి ఉపశమనం


6. చమురు ధరల ఎఫెక్ట్‌.. HPCLకు భారీ నష్టాలు

ప్రభుత్వ రంగానికి చెందిన చమురు సంస్థ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (HPCL) త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.10,196 కోట్ల నష్టాలు వచ్చినట్లు పేర్కొంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగా ఉంచడం వల్ల మార్జిన్లు తగ్గినట్లు తెలిపింది. స్టాండలోన్‌ పద్ధతిలో కంపెనీ నికర నష్టం రూ.10,196.94 కోట్లుగా నమోదైంది.

7. సినీ ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ సోదాలు.. రూ.200కోట్ల ‘నల్లధనం’ గుర్తింపు

ఇటీవల తమిళనాడు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల ఇళ్లలో ఆదాయపు పన్నుశాఖ సోదాలు (IT Raids) నిర్వహించింది. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున ‘నల్లధనం’ గుర్తించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ CBDT) శనివారం వెల్లడించింది. ఈ సోదాల్లో రూ.200 కోట్లకు పైనే ‘లెక్కల్లో వెల్లడించని’ ఆదాయాన్ని గుర్తించినట్లు సీబీడీటీ తెలిపింది.

8. ఆ నిఘా నౌక ప్రయాణాన్ని వాయిదా వేయండి.. చైనాను కోరిన శ్రీలంక

తన నిఘా నౌక ‘యువాన్ వాంగ్ 5’.. హంబనటొట నౌకాశ్రయ సందర్శనను వాయిదా వేయాలని శ్రీలంక ప్రభుత్వం చైనాను కోరింది. ఇరు దేశాల మధ్య తదుపరి సంప్రదింపులు జరిగే వరకు ఈ ప్రక్రియను నిలిపేయాలని విజ్ఞప్తి చేసింది. వాస్తవానికి ఈ నౌక ఆగస్టు 11న శ్రీలంకలో చైనా లీజుకు తీసుకున్న హంబన్‌టొట ఓడరేవు రావాల్సి ఉంది. అయితే.. తాజాగా శ్రీలంక విదేశాంగ శాఖ ఈ నౌక ప్రవేశానికి అనుమతిని వాయిదా వేసింది.


Video: యుద్ధ నౌకలు, విమానాలు, క్షిపణులతో డ్రాగన్ మిలటరీ డ్రిల్స్


9. క్రికెట్‌లో పతకం ఖాయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్‌ఇండియా

కామన్వెల్త్‌లో తొలిసారి జరుగుతున్న మహిళల క్రికెట్‌లో టీమ్‌ఇండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లాండ్‌ను 160/6 స్కోరుకే పరిమితం చేసి నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌లో అడుగు పెట్టింది. దీంతో పతకం ఖాయం చేసుకుంది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో స్కివెర్ 41, వ్యాట్ 35, జోన్స్ 31, సోఫీ డంక్లే 19, కాప్సీ 13, సోఫీ 7, బౌచిర్‌ 4* పరుగులు చేశారు.

10. ఈ బాధలు భరించలేకపోతున్నానంటూ అమెరికాలో ప్రవాస భారతీయురాలి ఆత్మహత్య

కుమార్తెలకు జన్మనిస్తున్నావంటూ భర్త వేధింపులు.. అత్తింటివారి సూటిపోటి మాటలు భరించలేని ఓ ప్రవాస భారతీయురాలు తనువు చాలించింది. అంతకుముందే తన బాధలను వెళ్లగక్కుతూ ట్విటర్‌లో ఓ వీడియో పోస్ట్‌ చేసింది.  ‘ప్రతిరోజు ఈ దాడులను భరించలేను. ఎనిమిదేళ్లుగా క్షోభకు గురవుతున్నా’ అంటూ అందులో వాపోయింది. తన బాధలను పంచుకుంటూ.. చనిపోతున్నాను డాడీ నన్ను క్షమించు అంటూ పోస్ట్‌ చేసిన వీడియో హృదయాలను ద్రవింపజేస్తోంది.


మరిన్ని

ap-districts
ts-districts