Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్‌ కౌర్

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారి మహిళల క్రికెట్‌ ప్రవేశ పెట్టగా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ నేతృత్వంలోని భారత జట్టు తుదిపోరులో ఆస్ట్రేలియాతో తడబడింది. 161 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ 152 పరుగులకే ఆలౌటైంది. దీంతో 9 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. అలా చివరికి భారత్‌ రజతంతోనే సరిపెట్టుకుంది. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌.. ప్రతిసారి తమ జట్టు ఫైనల్స్‌ వంటి కీలక మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌లో తడబాటుకు గురవుతుందని, పదే పదే అదే తప్పు చేస్తున్నామని విచారం వ్యక్తం చేసింది.

‘బ్యాటింగ్‌లో మేం మెరుగవ్వాలి. ఇలాంటి తప్పులు మేం లీగ్‌ మ్యాచ్‌ల్లో లేదా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో చేయడం లేదు. ఇలా కీలక పోరుల్లోనే ఓటమిపాలవుతున్నాం. ఇది మమ్మల్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఆ విషయం మా బుర్రలను బ్లాక్‌ చేస్తోంది. అయితే, మా జట్టులో బాగా ఆడే మరో బ్యాటర్‌ కావాలని నేను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా. అందుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. ఒకసారి అలాంటి ప్లేయర్‌ దొరికితే ఈ బ్యాటింగ్‌ సమస్య నుంచి బయటపడతాం’ అని హర్మన్‌ చెప్పుకొచ్చింది. అలాగే ఈ మ్యాచ్‌ చాలా తేలిగ్గా గెలిచేవాళ్లమని, దాంతో స్వర్ణం సాధించేవాళ్లమని సంగతి తనకు తెలుసని చెప్పింది. కానీ, ఇప్పుడు సాధించిన రజతం కూడా ఏమాత్రం తక్కువ కాదని పేర్కొంది. తమ తప్పుల నుంచి నేర్చుకొని మరింత కష్టపడాలని హర్మన్‌ అభిలాషించింది.


మరిన్ని

ap-districts
ts-districts