Rajinikanth: రాజకీయాల్లోకి వస్తున్నారా?.. క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్‌

గవర్నర్‌తో రజనీకాంత్‌ సమావేశమైన దృశ్యం

చెన్నై, న్యూస్‌టుడే: రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెలిపారు. గిండిలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ రవితో రజనీకాంత్‌ సోమవారం సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు వారి భేటీ కొనసాగింది. అనంతరం రజనీకాంత్‌ విలేకర్లతో మాట్లాడారు. తాను గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసినట్టు తెలిపారు. తమిళనాడు, తమిళుల నిజాయతీ, కఠినశ్రమ, ఆధ్యాత్మిక భావజాలం గవర్నర్‌ను ఆకర్షించాయని పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్టు గవర్నర్‌ పేర్కొన్నారని తెలిపారు. పాలు, పెరుగు వంటి ప్యాకెట్‌ ఉత్పత్తులపై జీఎస్టీ పన్ను విధింపుపై మాట్లాడేందుకు నిరాకరించారు. రాజకీయాల గురించి మాట్లాడారా? అని పాత్రికేయులు ప్రశ్నించగా అవునని సమాధానమిచ్చారు. వాటి గురించి మీడియాతో పంచుకోలేనని తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన మాత్రం తనకు లేదంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ‘జైలర్‌’ చిత్రీకరణ 15నగానీ, 20వ తేదీనగానీ ప్రారంభం కానుందని రజనీ తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts