ASIA CUP 2022: నేను సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఉంటే కచ్చితంగా అతడిని ఎంపిక చేస్తా: మాజీ సెలక్టర్

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆసియాకప్‌కు ఎంపికచేసిన భారత జట్టుపై చర్చ మొదలైంది. సోమవారం రాత్రి  సెలక్షన్‌ కమిటీ 15 మంది సభ్యుల బృందాన్ని ఎంపికచేసిన సంగతి తెలిసిందే. దీనికి రోహిత్‌ కెప్టెన్‌గా ఉండగా, కేఎల్‌ రాహుల్‌ వైస్‌కెప్టెన్‌గా ఎంపికయ్యారు. అయితే, ఆటగాళ్ల ఎంపిక విషయంపై భారత మాజీ సెలెక్టర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్ ఓ క్రీడాఛానల్‌తో మాట్లాడుతూ విశ్లేషించాడు. గాయపడిన బుమ్రా స్థానంలో సీనియర్‌ పేసర్‌ షమీని ఎంపికచేయల్సిందని అభిప్రాయపడ్డాడు. ఆయన మాట్లాడుతూ ‘నేను సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉంటే, ఈ జట్టులో కచ్చితంగా షమీ ఉండేవాడు. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో షమీ చివరిసారిగా భారత్ తరఫున ఆడాడు. అప్పటి నుంచి ఈ ఫార్మాట్‌ ఆడలేదని గమనించడం ముఖ్యం. ఇక నా జట్టులో రవి బిష్ణోయ్‌కు చోటు దక్కేది కాదు. అశ్విన్‌కు అక్షర్‌పటేల్‌ తీవ్రమైన పోటీదారు’ అని అన్నాడు.

ఇక ఓవరాల్‌గా జట్టు ఎంపికపై  మాట్లాడుతూ ‘జట్టు చాలా బాగుందని నేను భావిస్తున్నాను, కానీ.. మరో మీడియం పేసర్ అవసరం. ఇద్దరు మణికట్టు స్పిన్నర్ల ఎంపిక ఓకే అయినా.. అక్షర్‌ జట్టులో లేకపోవడం బాధగా ఉంది. దీపక్ హుడాను ఎంపికచేయడం నాకు నచ్చింది. అతడు మంచి హిట్టర్, ఉపయుక్తమైన ఆఫ్‌ స్పిన్నర్‌. అతడు ఆసియాకప్‌లోనే కాదు. టీ20 ప్రపంచకప్‌ జరిగే ఆస్ట్రేలియా పరిస్థితులలోనూ రాణించగలడని నమ్ముతున్నాను’ అని శ్రీకాంత్ వివరించాడు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు యూఏఈలో ఆసియా కప్‌ పోటీలు జరగనున్నాయి. గ్రూప్‌ ఏ విభాగంలో భారత్‌, పాక్‌ జట్లు ఆగస్టు 28న తలపడనున్నాయి. గాయం కారణంగా కీలక బౌలర్లు బుమ్రా, హర్షల్‌ పటేల్‌ దూరం కాగా, వాళ్లిద్దరూ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో కోలుకొంటున్నట్టు బీసీసీఐ తెలిపింది.

భారత జట్టు
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌, రిషబ్‌ పంత్‌, దీపక్‌ హుడా, దినేశ్‌ కార్తిక్‌, హార్దిక్‌ పాండ్యా, జడేజా, అశ్విన్‌, వై.చాహల్‌, భువనేశ్వర్‌, రవి బిష్ణోయ్‌, అర్షదీప్‌, అవేశ్‌ఖాన్‌.

స్టాండ్‌బై ప్లేయర్లు: శ్రేయాస్‌ అయ్యర్‌, దీపక్‌ చాహర్‌, అక్షర్‌ పటేల్‌


మరిన్ని

ap-districts
ts-districts