Bihar: తేజస్వీతో కలిసి గవర్నర్‌ను కలవనున్న నీతీశ్.. భాజపాకు షాక్‌ తప్పదా?

పట్నా: బిహార్‌ రాజకీయాలు క్షణక్షణానికి ఉత్కంఠగా మారుతున్నాయి. బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ(యు)నేత నీతీశ్‌ కుమార్‌... ఎన్‌డీఏ కూటమి నుంచి వైదొలగే యోచనలో ఉన్నారన్న వార్తల నేపథ్యంలో నేడు అధికార, ప్రతిపక్ష పార్టీలు కీలక సమావేశాలు నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే సీఎం నీతీశ్ కుమార్‌ నేడు గవర్నర్‌ను కలిసే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. నీతీశ్‌ వెంట ఆర్జేడీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ కూడా రాజ్‌భవన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

ఈ సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర గవర్నర్‌ ఫాగు చౌహన్‌ను కలిసేందుకు నీతీశ్ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. భాజపాతో తాము పొత్తు వీడుతున్నామని గవర్నర్‌కు ఆయన అధికారికంగా చెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. నీతీశ్ ప్రభుత్వం మైనార్టీలో పడుతుంది. అప్పుడు ప్రతిపక్ష ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

మా మద్దతు నీతీశ్‌కే: ప్రతిపక్ష కూటమి

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఉదయం 11 గంటలకు జేడీయూ నేతలతో నీతీశ్ సమావేశమయ్యారు. అటు ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీల మహాగట్‌బంధన్‌ కూటమి ఎమ్మెల్యేలు కూడా రబ్రీదేవీ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీతీశ్‌ కుమార్‌ ఉండేలా మద్దతు తెలుపుతూ ప్రతిపక్ష నేతలు లేఖపై సంతకాలు చేశారు. ఈ లేఖను ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌కు అందజేశారు. మహాగట్‌బంధన్‌లోకి నీతీశ్ వస్తానంటే తాము తప్పకుండా స్వాగతిస్తామని కాంగ్రెస్‌ నేత అజిత్ శర్మ భేటీ అనంతరం వెల్లడించారు. 

రాజీనామా చేయనున్న భాజపా మంత్రులు

మరోవైపు తాజా రాజకీయ పరిస్థితులపై భాజపాపై కూడా వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ ఉదయం ఉప ముఖ్యమంత్రి తార్‌కిశోర్‌ ప్రసాద్‌ నివాసంలో భాజపా కీలక నేతలు సమావేశమయ్యారు. నీతీశ్‌ మంత్రివర్గంలో ఉన్న మొత్తం 16 మంది భాజపా మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.


మరిన్ని

ap-districts
ts-districts