Bihar: భాజపాతో పొత్తు ముగిసింది.. పార్టీ నేతల సమావేశంలో నీతీశ్ నిర్ణయం

పట్నా: అనుకున్నదే జరిగింది..! బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీ(యు) నేత నీతీశ్‌ కుమార్‌... భాజపాతో బంధానికి స్వస్తి పలికారు. ఎన్డీయే కూటమితో పొత్తును రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు నేడు జేడీ(యు) పార్టీ నేతల సమావేశంలో నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

తన రాజకీయ మనుగడకు భారతీయ జనతా పార్టీ నుంచి ముప్పుందని భావిస్తున్న నీతీశ్‌.. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలనే యోచనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జేడీ(యు) ఎంపీలు, ఎమ్మెల్యేలతో సీఎం నేడు సమావేశమయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు నీతీశ్ నివాసంలో ఈ భేటీ జరగ్గా.. దాదాపు రెండున్నర గంటల పాటు చర్చించారు. భాజపాతో జేడీ(యు) పొత్తు ముగిసిందని ఈ సందర్భంగా నీతీశ్ పార్టీ నేతలకు చెప్పినట్లు సమాచారం. ఈ నిర్ణయానికి జేడీ(యు) నేతలు కూడా మద్దతిచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.

మరోవైపు, ఈ సాయంత్రం నీతీశ్‌ కుమార్‌ రాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి పొత్తుపై తన నిర్ణయాన్ని సీఎం అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి. ఆయన వెంట ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ కూడా రాజ్‌భవన్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం నీతీశ్‌కు ప్రతిపక్షాల కూటమి మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలిసి నీతీశ్‌ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.

తేజస్వీకి హోంశాఖ..

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం రబ్రీదేవి నివాసంలో ప్రతిపక్షాల మహాగట్‌బంధన్‌ కూటమి నేతలు నేడు సమావేశమయ్యారు. నితీశ్‌ సీఎంగా కొనసాగేందుకు తాము మద్దతిస్తున్నామని తెలుపుతూ వీరంతా లేఖపై సంతకాలు చేశారు. ఈ లేఖను గవర్నర్‌కు అందించే అవకాశాలున్నాయి. అయితే కొత్త పొత్తులో భాగంగా తనకు హోంశాఖ కేటాయించాలని తేజస్వీ యాదవ్‌.. నీతీశ్‌ను కోరినట్లు సమాచారం. అంతేగాక, లాలూ మరో తనయుడు తేజ్‌ ప్రతాప్‌ను కూడా కొత్త ప్రభుత్వంలోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

అసెంబ్లీలో పార్టీల బలాబలాలు ఇలా..

బిహార్‌లో మొత్తం 243 మంది శాసనసభ్యులున్నారు. ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేయాలంటే 122 మంది సభ్యుల మద్దతు అవసరం. ప్రస్తుతమున్న గణాంకాల ప్రకారం అసెంబ్లీలో పార్టీల సంఖ్యాబలాలు ఇలా ఉన్నాయి..

* జేడీ(యు) - 45

* భాజపా -77

* ఆర్జేడీ - 79

* కాంగ్రెస్‌ - 19

* వామపక్షాలు - 16

* ఏఐఎంఐఎం - 1

* హెచ్‌ఏఎం - 4

* స్వతంత్రులు - 2


మరిన్ని

ap-districts
ts-districts