Whatsapp: వాట్సాప్‌ నుంచి కొత్త అప్‌డేట్‌.. ఇక 2 రోజుల తర్వాతా డిలీట్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్లకు మరో సదుపాయాన్ని వాట్సాప్‌ (Whatsapp) అందుబాటులోకి తీసుకొచ్చింది. యూజర్లు ఇకపై రెండు రోజుల కింద పంపిన మెసేజ్‌లను సైతం ఇకపై డిలీట్‌ చేసుకునే సౌకర్యాన్ని తెచ్చింది. ట్విటర్‌ వేదికగా ఈ విషయాన్ని వాట్సాప్‌ పేర్కొంది. ఇప్పటికే కొందరు యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి రాగా.. త్వరలోనే యూజర్లందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. మీకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చిందో లేదో ఓ సారి చెక్‌ చేయండి.

ఒకప్పుడు వాట్సాప్‌లో ఏదైనా మెసేజ్‌ పంపితే దాన్ని డిలీట్‌ చేసుకునే సదుపాయం ఉండేది కాదు. దీంతో పొరపాటున పంపిన మెసేజ్‌ల విషయంలో యూజర్లు ఇబ్బంది పడేవారు. దీంతో ఇలాంటి సందేశాలను తొలగించేందుకు డిలీట్‌ ఆప్షన్‌ను వాట్సాప్‌ పరిచయం చేసింది. అయితే మెసేజ్‌ పంపిన 1 గంట 8 నిమిషాల 16 సెకన్లలోపే డిలీట్‌ చేసుకునేందుకు వీలుండేది. ఇకపై 2 రెండురోజుల 12 గంటల వరకు పాత సందేశాలను డిలీట్‌ చేయొచ్చు. మరోవైపు వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్ల కోసం మరో సదుపాయం కూడా వాట్సాప్‌ తీసుకురానుంది. గ్రూప్‌ సభ్యులు పంపిన మెసేజ్‌ను అడ్మిన్‌ తొలగించే సదుపాయం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇది బీటా దశలో ఉంది. యూజర్లు పంపిన మెసేజ్‌ను ఎడిట్‌ చేసుకునే వెసులుబాటునూ తీసుకొచ్చేందుకూ వాట్సాప్‌ ప్రయత్నాలు చేస్తోంది.


మరిన్ని

ap-districts
ts-districts