CWG 2022: మేం రజతం గెలవలేదు.. స్వర్ణం కోల్పోయాం: శ్రీజేశ్

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత హాకీ జట్టు రజతం గెలవలేదని, స్వర్ణం కోల్పోయిందని సీనియర్‌ ఆటగాడు, గోల్‌కీపర్‌ పీఆర్‌ శ్రీజేశ్‌ అన్నాడు. గతరాత్రి జరిగిన తుదిపోరులో టీమ్‌ఇండియా 0-7 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా విఫలమయ్యాక అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.  కామన్వెల్త్‌ క్రీడలు ప్రారంభమైనప్పటి నాటి నుంచి ఆసీస్‌ వరుసగా ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అందులో భారత్‌ మూడుసార్లు ఫైనల్‌కు చేరి ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే చివరిసారి కామన్వెల్త్‌ క్రీడల్లో ఆడుతున్న భారత గోల్‌కీపర్‌ శ్రీజేశ్‌.. ఫైనల్స్‌లో ఆడటం సంతోషంగా ఉన్నా.. విజేతగా నిలవలేకపోవడం బాధగా ఉందన్నాడు.

‘మేం ఈసారి రజతం గెలవలేదు. పసిడి కోల్పోయాం. ఇది నిరాశ కలిగించే విషయమే అయినా ప్రతిష్ఠాత్మకమైన కామన్వెల్త్‌ క్రీడల్లో ఫైనల్స్‌కు చేరడం గొప్ప విశేషం. జట్టులో అందరికన్నా సీనియర్‌ అయిన నాకు కామన్వెల్త్‌ క్రీడల్లో తుదిపోరులో ఓటమిపాలవ్వడం ఇది నాకు రెండోసారి. ఈ విషయం  జీర్ణించుకోవడం కాస్త కష్టమే అయినా.. యువ ఆటగాళ్లకు ఇది మంచి అనుభవంగా పనికొస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. కాగా మన్‌ప్రీత్ సింగ్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా జట్టు గ్రూప్‌ స్టేజ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఈ క్రమంలోనే సెమీస్‌లో దక్షిణాఫ్రికాను 3-2తో ఓడించి ఫైనల్స్‌లో పసిడిని తీసుకొచ్చేలా కనిపించింది. కానీ, కొలిన్‌ బాచ్‌ నేతృత్వంలోని ఆస్ట్రేలియా తుదిపోరులో భారత్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో భారత్‌ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని