Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్‌ మృతి.. స్పందించిన సెహ్వాగ్‌

(ఫొటో సోర్స్‌: సెహ్వాగ్ ట్విటర్)

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా దిగ్గజ అంపైర్‌ రూడి కోయిర్జెన్‌ (73) మంగళవారం కన్నుమూశారు.  దక్షిణాఫ్రికాలోని రివర్‌డాలె ప్రాంతంలో కోయిర్జెన్‌తోపాటు మరో ముగ్గురు మృత్యువాతపడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. అంపైర్‌ మృతిపై ఆయన కుమారుడు జూనియర్‌ రూడి కోయిర్జెన్‌ స్పందించారు. ‘‘ఆయన తన స్నేహితులతో కలిసి గోల్ఫ్‌ టోర్నమెంట్ ఆడేందుకు వెళ్లారు. అయితే నిన్న సోమవారమే తిరిగి వస్తారని మేం భావించా.  అయితే మరొక రౌండ్‌ను ఆడేందుకు ఉండాలని వారంతా నిర్ణయించుకుని అక్కడే ఉండిపోయారు. ఇవాళ ఇలా జరిగింది’’ అని తెలిపారు. కోయిర్జెన్‌ మృతిపై టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ భావోద్వేగానికి గురయ్యాడు. ఆయనతో తనకున్న అనుబంధం గురించి ట్విటర్‌లో స్పందించాడు. 

కోయిర్జెన్ మృతికి సంతాపం తెలియజేస్తూ సెహ్వాగ్‌ నివాళులర్పించాడు. ‘‘ఓం శాంతి.. వాలె రూడి కోయిర్జెన్ మృతికి ఆయన కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా.  కోయిర్జెన్‌తో అద్భుతమైన అనుబంధం ఉండేది. ఎప్పుడైనా కాస్త ర్యాష్‌గా షాట్‌ కొట్టినప్పుడు.. ఆయన వెంటనే కోప్పడేవారు. ‘కాస్త నిదానంగా ఆడు. నీ బ్యాటింగ్‌ చూడాలని ఉంది. అలాగే మా అబ్బాయికి మంచి క్రికెట్ ప్యాడ్స్‌ కొనాలి. ఏమైనా మంచి బ్రాండ్స్‌ చెప్పు’ అని నన్ను అడిగేవారు. ప్యాడ్స్‌ గురించి విచారణ చేసి మరీ ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చా. కోయిర్జెన్‌ జెంటిల్‌మన్‌, అలానే వ్యక్తిగతంగా అద్భుతమైన వ్యక్తి.  రూడీ.. నిన్ను మిస్‌ అయ్యా.. ఓం శాంతి’’ అని ట్వీట్‌ చేశాడు. 1992 నుంచి 2010 వరకు మొత్తం 331 మ్యాచ్‌లకు ( 108 టెస్టులు, 209 వన్డేలు, 14 టీ20లు) అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు.



మరిన్ని

ap-districts
ts-districts