Alitho Saradaga: ఆమె రాసిన ఉత్తరం కంటతడి పెట్టించింది : యువహీరో నిఖిల్‌

తెలుగు సినిమాతో యువనటుడు నిఖిల్‌ సిద్ధార్థ్ (Nikhil Siddharth)ది దాదాపు పదిహేడేళ్ల ప్రయాణం. 2003లో ‘సంబరం’ సినిమాతో పరిచయమై హ్యాపీడేస్‌(2007) రాజేశ్‌గా, ‘యువత’ (2008)కు చేరువై ‘కార్తికేయ’ (2014)తో కంటెంట్‌ ఉన్న హీరోగా నిలదొక్కుకున్నాడు. కామెడీ, లవ్‌స్టోరీ, క్రైమ్‌, థ్రిల్లర్‌.. ఇలా ఏ అంశంలోనైనా నటించే సత్తా ఉన్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కార్తికేయ-2 (Karthikeya 2)తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ‘కార్తికేయ’తో తొలి సినిమానే సూపర్‌హిట్‌గా మలిచిన దర్శకుడు ‘చందూ మొండేటి’ (Chandoo Mondeti). ప్రతిభ ఉన్న డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఆయన దర్శకత్వంలో రానున్న ‘కార్తికేయ-2’ విశేషాలను ప్రేక్షకులతో పంచుకోవడానికి వీరిద్దరూ ఆలీతో సరదాగా (alitho saradaga) కార్యక్రమానికి విచ్చేశారు. మరి ఆ యువహీరో, యువదర్శకుడు పంచుకున్న విషయాలేంటో చూద్దామా!

మీ ఇద్దరి కాంబినేషన్లో ఇది రెండో సినిమా. దర్శకుడిగా మీకు ప్రేరణ ఎవరు?
చందూ మొండేటి: ఆర్య (2004) సినిమా విడుదలైనప్పుడు ప్రతీచోట దర్శకుడు సుకుమార్‌ గురించి మాట్లాడుకోవడం వినేవాణ్ని. ఒక సినిమా తీస్తే దర్శకుడికి ఇంత పేరు వస్తుందా అని ఆశ్చర్యపోయిన సందర్భం అది. ఒకవిధంగా ఆయనకు నేను ఏకలవ్య శిష్యుడిని. సినిమాల్లోకి వచ్చాక రాజమౌళికి అభిమానిలా మారిపోయాను. దర్శకుడిగా వీళ్లిద్దరే నాకు రోల్‌మోడల్.

అసలు మీది ఏ ఊరు? మీ కుటుంబ నేపథ్యమేంటి?

చందూ మొండేటి: మాది మీ పక్క ఊరే...పశ్చిమ గోదావరి జిల్లా వేములూరు.
నిఖిల్‌: మాది హైదరాబాద్‌. పుట్టింది.. పెరిగింది.. చదివింది అన్నీ ఇక్కడే. 

మీరిద్దరూ ఎలా కలిశారు?మీ ప్రయాణాన్ని ఎలా ప్రారంభించారు?

చందూ మొండేటి: 2005లో ఒక సినిమాకి నేను సుధీర్‌వర్మ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాం. ఆ సినిమాలో శశాంక్‌ హీరో (సై ఫేం). ఆ సినిమాలో హీరో తమ్ముడి రోల్‌కి నిఖిల్‌ని తీసుకున్నారు. నలభై రోజుల షూటింగ్‌ అనంతరం ఆ సినిమా ఆగిపోయింది. కానీ మా ప్రయాణం కొనసాగింది.

నిఖిల్‌: ఫస్ట్‌ టైం ఆ సినిమా ఆఫీసులోనే ఇద్దరం కలిశాం. నేను ఆ రోల్‌ ఆడిషన్‌కి అటెండ్‌ అయ్యి సెలెక్ట్‌ అయ్యాను. కానీ ఆ సినిమా ఆగిపోయింది. అంతకుముందు సంబరం (2003)లో చిన్న పాత్ర చేశా.
 

 

మీరు ‘కార్తికేయ’ సినిమా విడుదల సమయంలో సీక్వెల్‌ ఉంటుందని చెప్పారు.. అంత కచ్చితంగా ఎలా చెప్పారు?

నిఖిల్‌: అవునా సార్‌.. నాకిప్పుడు సరిగా గుర్తు లేదు కానీ సినిమా హిట్టవుద్దనే నమ్మకంతో చెప్పాను. సో అది హిట్టయ్యింది. ఇప్పుడు సీక్వెల్‌ కూడా వచ్చింది. కొవిడ్‌ వల్ల కార్తికేయ-2 కొంచెం ఆలస్యమైంది. సినిమా షూటింగ్‌ 62 రోజుల్లోనే పూర్తయ్యింది. కానీ మధ్యమధ్యలో బ్రేక్‌ వచ్చింది.

పెళ్లికి ముందు వరుసగా సినిమాలు విడుదలయ్యాయి. ఇప్పుడు తగ్గడానికి కారణం ఏమిటి?

నిఖిల్‌: నిజానికి నేను ఈ లాక్‌డౌన్‌ సమయంలో నాలుగు సినిమాల్లో నటించాను. స్పై, 18పేజెస్‌, సుధీర్‌వర్మతో ఒకటి ఇలా నాలుగు సినిమాలు వరుసలో ఉన్నాయి. ప్రస్తుతం కార్తికేయ-2 విడుదలపై దృష్టి పెట్టా. 

‘కార్తికేయ’లో స్వాతి హీరోయిన్‌. కానీ ‘కార్తికేయ-2’లో అనుపమా పరమేశ్వరన్‌. మార్పునకు కారణమేంటి?

చందూ మొండేటి: (నవ్వుతూ)హీరో నిర్ణయం ప్రకారమే అలా చేశాం.

నిఖిల్‌: అయ్యయ్యో.. నాకేం తెలీదు. నాపై తోసేస్తున్నారు.

చందూ మొండేటి: కథ మారింది కదండీ. కార్తికేయ మొత్తం సుబ్రహ్మణ్యపురంలో సాగింది. కార్తికేయ-2 ద్వారకాలో జరుగుతుంది. కథలో లొకేషన్‌ మారిందని హీరోయిన్‌ని మార్చాం. కార్తికేయలో లేని కొత్త పాత్రలు ఇందులో ఉంటాయి.

‘కార్తికేయ-3’ ఉంటుందా?‘కార్తికేయ-2’ ఆ అంచనాలకు అందుకుంటుందా?
చందూ మొండేటి: ఉంటుందండీ.. ఈసారి అంతర్జాతీయ నేపథ్యంలో సీక్వెల్‌ ఉంటుంది. ఏదేమైనా కార్తికేయ-2 విజయం సాధిస్తుందనే నమ్మతున్నాం. అందుకే దీనికి సీక్వెల్‌ కూడా ప్లాన్‌ చేశాం.

మీ సినిమాలలో ‘సవ్యసాచి’ సరిగా ఆడకపోవడానికి కారణం ఏంటి?

చందూ మొండేటి: స్క్రిప్టు ఇంకొంచెం మెరుగ్గా రాయాల్సిందని నా అభిప్రాయం. స్క్రిప్టు లోపమే ఆ సినిమా పరాజయానికి కారణం.

‘ప్రేమమ్‌’లో సాయిపల్లవి పాత్రలో శృతిహాసన్‌ని ఎంపిక చేయడం వెనుక ఉద్దేశమేంటి?

చందూ మొండేటి: ఆ సినిమా మలయాళం ప్రేమమ్‌కి రీమేక్‌. అందులో ముగ్గురు హీరొయిన్లు. అప్పటికే ఇద్దరిని (అనుపమా పరమేశ్వరన్‌, మడోన్నా సెబాస్టియన్‌) రిపీట్ చేశాం. మాతృకతో పోల్చుకుంటే భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ పాత్రకు శృతిహాసన్‌ని ఎంపిక చేశాం.

మీరు మెగా ఫోన్‌ పట్టుకుంటున్నారని తెలిసింది.. అందులో నిజమెంత?

నిఖిల్‌: నిజానికి ఒక చిన్నపిల్లల సినిమా డైరెక్ట్‌ చేద్దాం అనుకున్నాను. నా డ్రీమ్‌ అది. మొదలుపెడదాం అనుకునే లోపు నాకు తెలిసిన దర్శకులు, ప్రొడ్యూసర్లూ వద్దని చెప్పారు. ఉన్న టైంని హీరోగా సద్వినియోగం చేసుకోమని సలహా ఇచ్చారు. అందుకే ప్రస్తుతానికి పక్కన పెట్టేశా.

మీ పేరు ఒకరి ఫోన్‌లో ‘లవ్‌ సింబల్‌తో28’ అని ఉంటుందట? ఎవరి ఫోన్‌ అది?

నిఖిల్‌: అది నా భార్య ఫోన్‌లో.. నేను నా భార్యను బంగారం అని పిలుస్తాను. తను నన్ను ఇంకా అమూల్యంగా పిలవాలని ‘డైమండ్‌’ అని పిలుస్తుంది. అందుకే 28 క్యారెట్ల డైమండ్‌కి గుర్తుగా నా పేరుని అలా సేవ్‌ చేసుకుంది. నా ఫోన్‌లో ఆమె నంబరు ‘వైఫ్‌’ అనే ఉంటుంది.

మీ తరువాతి సినిమాల సంగతేంటి?మీ దర్శకత్వంలో రానున్న చిత్రాలేంటి?
చందూ మొండేటి: ‘గీతా ఆర్ట్స్’తో సినిమా ఒకే అయ్యింది. ప్రొడ్యూసర్లు కన్ఫర్మ్‌ చేసేశారు. అయితే కార్తికేయ-2 విడుదల తరువాత ఆ సినిమాలను ప్రకటిద్దామనుకుంటున్నాం.

దాదాపు 30ఏళ్ల తరువాత అనుపమ్‌ఖేర్‌ తెలుగులో కార్తికేయ-2 చేస్తున్నారు..కారణం ఏంటి?

చందూ మొండేటి: అనుపమ్‌ ఖేర్‌ 33ఏళ్ల క్రితం తెలుగులో ఒక సినిమాలో నటించారు. మళ్లీ కార్తికేయ-2తో రీఎంట్రీ ఇవ్వడం గర్వంగా ఉంది. ఇందులో ఆయనది చాలా కీలకమైన పాత్ర. కథ కూడా ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే చేస్తానని ఒప్పుకొన్నారు.

మీరు నాగార్జున గారికి వీరాభీమాని అని తెలిసింది..ఆయనతో సినిమా ఎప్పుడు?
చందూ మొండేటి: అవునండీ. కార్తికేయ హిట్ అయిన వెంటనే ఆయన్ను కలిశాను. ఆయన్ను పోలీస్‌ ఆఫీసర్‌గా పెట్టి విక్రమ్‌ లాంటి సినిమా తీయాలనుంది. దానిపై ఆయనతో చాలాసార్లు చర్చించా. భవిష్యత్‌లో ఆయనతో ఒక పెద్ద సినిమా ఉంటుంది.

రాత్రి 9 దాటితే మీలోనుంచి ఒక చిరంజీవి, ప్రభుదేవా బయటకొస్తారని తెలిసింది..నిజమేనా?

చందూ మొండేటి: అవునండీ.. నేను వాళ్ల డ్యాన్స్‌కి పెద్ద ఫ్యాన్‌. టైం దొరికినప్పుడు వాళ్ల స్టెప్పులను, హావభావాలను అనుకరిస్తూ డ్యాన్స్‌ చేస్తాను. కానీ దానికి ప్రత్యేక సందర్భం కావాలి (నవ్వుతూ..). ఆ సెట్‌ అంతా వేరే ఉంటుంది.

మీ తల్లిదండ్రులు మీ సక్సెస్‌ను చూసి ఆనందించారా?
నిఖిల్‌: నేను చిన్నప్పటినుంచి బాగా చురుకుగా ఉండేవాడిని. అమ్మానాన్నలకు కూడా నాపై నమ్మకం. అనుకున్నట్లుగానే నటుడిగా సక్సెస్‌ అయ్యా. నా విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు.

చందూ మొండేటి: చాలా హ్యాపీగా ఫీలయ్యారు. నేను ఏదో గ్రాఫిక్‌ కోర్సు నేర్చుకుంటున్నానని ఇంట్లో చెప్పొచ్చాను. ఇక్కడికొచ్చి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కొన్ని సంవత్సరాలు పనిచేసి ‘కార్తికేయ’ తీసి రాజమండ్రిలో మొదటిసారి మా అమ్మానాన్నలకు చూపించేసరికి వాళ్లు చాలా సంతోషించారు. వాళ్ల కల నిజమైనట్లు భావించారు.

‘కార్తికేయ’లో ఒక పామును వాడారు. ఈ సినిమాలో ఎన్ని పాములను వాడారు?

చందూ మొండేటి: ఎక్కువ పాములనే వాడాం. దాదాపు డజను పైనే ఈ సినిమాలో ఉంటాయి. సన్నివేశాన్ని బట్టి గ్రాఫిక్స్‌, రియల్‌ పాముల సీన్లను తీశాం.

ఈ సినిమా విషయంలో ఏదో ఒక పాము సెంటిమెంట్‌ కొనసాగుతోందట.. ఏంటది?
నిఖిల్‌: ‘కార్తికేయ’ నిర్మాత ఒకరు రాజేశ్‌వర్మ. ఆయనది వైజాగ్. ఆ సినిమా షూటింగ్ టైంలో, విడుదలైనపుడు రోజూ ఆయన ఇంటికి ఒక పాము వచ్చి కనిపించేదట. ఇప్పుడు కార్తికేయ-2 షూటింగ్‌ ప్రారంభమయ్యాక కూడా అదే పాము రోజూ కనిపిస్తుందట. దేవుడున్నాడు అని ఎలా నమ్ముతామో ఇటువంటి నమ్మకాలను అలాగే గౌరవించాలని నా ఉద్దేశం.

శ్రీదేవి అనే ఒకమ్మాయి మీకు రాసిన లెటర్‌ విశేషాలు చెబుతారా?
నిఖిల్‌: అవునండీ. నేనొక నార్మల్‌ హీరోని. చిన్నప్పట్నుంచి చిరంజీవి, పవన్‌కల్యాణ్‌లను అభిమానిస్తూ ఈ స్థాయికి వచ్చాను. అటువంటి నాకు ఒక ఫ్యాన్‌ అంత అభిమానిస్తూ లెటర్‌ రాసేసరికి అది చదివి భావోద్వేగానికి గురయ్యా. లెటర్‌ చదవడం పూర్తయ్యేసరికి కళ్లనుంచి నీళ్లొచ్చాయి. నేను నా ఫ్యాన్స్‌ని ఫ్రెండ్స్‌లాగే భావిస్తాను. అంత అభిమానాన్ని నేను ఊహించలేదు. 

కార్తికేయ-2 సినిమా విషయంలో మీకు ఇస్కాన్‌ నుంచి ఒక అభినందన లెటర్‌ వచ్చిందట?
నిఖిల్‌: అవును. అది చాలా గొప్ప విషయం. మేం విడుదల చేసిన కార్తికేయ-2 మోషన్‌ పోస్టర్‌ని చూసిన ఇస్కాన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీ రాధారామన్‌ దాస్‌ గారు స్వయంగా వారి ప్రధాన కార్యాలయం (బృందావన్‌)నుంచి అభినందిస్తూ ఉత్తరం రాసి మా టీమ్‌ని ఇస్కాన్‌కి ఆహ్వానించారు. ఇతిహాసాల గొప్పతనాన్ని తెలిపే ఇటువంటి సినిమాలు రావాలని ఆయన అన్నారు. వారి సమక్షంలోనే కార్తికేయ-2 హిందీ టీజర్‌ని విడుదల చేశాం. 

ఈ సినిమా చిత్రీకరణ సమయంలో బీఎస్‌ఎఫ్‌ వాళ్లు మిమ్మల్ని ఆపారంట? అసలేమైంది?
నిఖిల్‌: గుజరాత్‌లోని రాన్‌ ఆఫ్‌ కచ్‌లో షూటింగ్‌. దానికి దగ్గర్లోనే పాకిస్థాన్‌ బోర్డర్‌. షూటింగ్‌ చేసుకుంటూ మేమక్కడికి వెళ్లిపోయాం. మా డ్రోన్లు ఎగురుతున్నాయి. వెంటనే అక్కడికి బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) సిబ్బంది వచ్చారు. అందులో తెలుగు తెలిసిన అధికారి నన్ను గుర్తుపట్టి ‘హే కార్తికేయా!’ అని పిలిచాడు. ఆయనకు విషయం చెప్పేసరికి మొత్తం అనుమతి ఇప్పించి, చివరిలో నాకొక ఆర్మీ క్యాప్‌ బహుకరించారు. దాన్ని చాలా అపురూపంగా దాచుకున్నా. నిజానికి ‘కార్తికేయ’ నాకు చాలా గుర్తింపునిచ్చింది. ఒకసారి పవన్‌కల్యాణ్ గారిని కలిసినపుడు ఆయన సైతం నన్ను ‘కార్తికేయ’ పేరుతోనే పలకరించారు.

కార్తికేయ-2లో మీరు మర్చిపోలేని సన్నివేశమేంటి? 

నిఖిల్‌: క్లైమాక్స్‌.. సినిమా మొత్తం అద్భుతంలా అనిపిస్తుంది. చివరి పది నిమిషాలు తన్మయత్వానికి గురవుతాం. కాలభైరవ ఈ సినిమాకి మ్యూజిక్‌ డైరెక్టర్‌. కోట్లాది మంది ఆరాధించే శ్రీకృష్ణుడి గురించి చూపిస్తున్నామని నేను సినిమా చిత్రీకరణలో లీనమైపోయాను. చివరి సన్నివేశం చిత్రీకరణలో ఆ మ్యాజిక్‌ నాపై పనిచేసి నాకు తెలియకుండానే ఏడ్చేశాను. సహజంగా వచ్చిన ఆ సీన్‌ క్లైమాక్స్‌కి హైలైట్‌గా నిలుస్తుంది. ‘కార్తికేయ-2’తో తెరపై అద్భుతం చూపించబోతున్నాం అనే నమ్మకంతో ఉన్నాం.

ఒకే అండి. త్వరలో విడుదలవనున్న మీ చిత్రం ‘కార్తికేయ-2’ విజయవంతమవ్వాలని కోరుకుంటూ ఆల్‌ ది బెస్ట్‌.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని