Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం సేవలు కీలకమని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ అన్నారు. సాంకేతికపరంగా, సిబ్బంది కొరత కారణంగా సమస్యలు ఎదురవుతున్నా ఎక్కువ గంటలు పనిచేస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు. కరోనా తర్వాత పాస్‌పోర్టుల జారీ, స్లాట్‌ బుకింగ్‌, సాంకేతికపరంగా రీ షెడ్యూల్‌లో ఎదురవుతున్న సమస్యలను రీజినల్‌ పాస్‌పోర్టు అధికారి(ఆర్‌పీవో) దాసరి బాలయ్య.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

మంగళవారం నగరంలో వివిధ కార్యక్రమాలకు హాజరైన క్రమంలో ఆయన సికింద్రాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని సందర్శించి అక్కడి సిబ్బందితో సమావేశమయ్యారు. సరికొత్త ఆలోచనలతో పనులు వేగంగా చేస్తున్నారని, కార్యాలయం చూడముచ్చటగా ఉందని కితాబిచ్చారు. సెలవు రోజున కార్యాలయానికి వచ్చినందుకు అభినందనలు తెలిపారు. మరోసారి హైదరాబాద్‌ వచ్చినప్పుడు సిబ్బందితో ముచ్చటించే వీలుంటుందో లేదోనని.. అందుకే సెలవురోజున అందరినీ కలిసినట్లు తెలిపారు. సేవల రంగంలో గత 50 ఏళ్లలో దేశంలో అనేక మార్పులు వచ్చాయని కేంద్రమంత్రి జైశంకర్‌ పేర్కొన్నారు. పాస్‌పోర్టు తీసుకోవాలంటే గతంలో ఏడాది వరకు వేచి ఉండేవారని, అనంతరం కొన్ని నెలలు.. ప్రస్తుతం కొద్ది రోజుల్లో ఇంటికొచ్చేస్తుందన్నారు. సాంకేతికత అభివృద్ధి, డిజిటలైజేషన్, డేటాబేస్‌ తదితరాలతో పోలీస్‌ వెరిఫికేషన్, తత్కాల్‌ ప్రక్రియ వేగవంతమయ్యిందన్నారు. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని, కొవిడ్‌ తర్వాత ఈ సంఖ్య మరింతగా పెరిగిందన్నారు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని