Andhra News: ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు చోరీ

వాహనాన్ని పరిశీలిస్తున్న అధికారులు

వంగర, న్యూస్‌టుడే: పాలకొండ ఆర్టీసీ డిపోకు చెందిన స్టూడెంట్స్‌ బస్సు సోమవారం అర్ధరాత్రి చోరీకి గురవడంతో ఉత్కంఠ నెలకొంది. సోమవారం రాత్రి రాజాం నుంచి వంగర వచ్చి విద్యార్థులను దింపేసిన తరువాత బస్సును డ్రైవర్‌ పి.బుజ్జి వంగర పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా నిలిపారు. ఉదయం నాలుగు గంటల సమయంలో కనిపించకపోవడంతో సహచరుల సహాయంతో గ్రామంలో వెతికారు. అనంతరం వంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారాన్ని పాలకొండ ఆర్టీసీ డిపో మేనేజర్‌ వెంకటేశ్వరరావుతో పాటు డిపో సీఐ లక్ష్మణరావుకు తెలియజేయడంతో వారు వంగర పోలీస్‌ స్టేషన్‌కు మంగళవారం వెళ్లారు. కొన్ని గంటల తరువాత రేగిడి ఆమదాలవలస మండలం మీసాల డోలపేట సమీపంలో ఉన్నట్లు తెలుసుకొని వంగర పోలీసులతో రాజాం సీఐ కె.రవికుమార్‌, ఆర్టీసీ అధికారులు చేరుకున్నారు. వేలిముద్రల సేకరణ అనంతరం బస్సును వంగర ఠాణాకు తీసుకువచ్చారు. అనుమానితులను రాజాం పోలీస్‌ స్టేషన్‌లో విచారించారు. పొందూరు మండలం గోకర్ణపల్లికి చెందిన చౌదరి సురేష్‌ మద్యం తాగి సోమవారం రాత్రి సదరు బస్సులో వంగర చేరుకుని.. తిరిగి ఇంటికి వెళ్లడానికి అదే వాహనాన్ని తీసుకువెళ్లినట్లు పోలీసుల ముందు నిందితుడు ఒప్పుకొన్నాడు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కె.రవికుమార్‌ తెలిపారు.


మరిన్ని

ap-districts
ts-districts